సాధారణంగా దొంగలు ఇంట్లోకి ప్రవేశించగానే వస్తువులన్నీ తీసి ఎక్కడెక్కడో పడేస్తారు. కానీ ఓ దొంగ మాత్రం అందుకు భిన్నంగా చేశాడు. సరిగా లేని వస్తువులను సర్దేసి వెళ్లాడు. అంతేకాదు.. దొంగతనం చేయడానికి వచ్చి భోజనం వండేశాడు. ఇంటిని బాగా క్లీన్ చేశాడు.ఈ ఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది.
బ్రిటన్‌లో డామియన్ వోజ్నిలోవిజ్ అనే దొంగ ఓ ఇంటికి కన్నమేసేందుకు వెళ్లాడు. ఖాళీ ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే వంట చేసి, ఇంట్లో ఉంచిన బట్టలు ఉతికాడు. బయటకు వెళ్లే ముందు ఇంటి యజమానురాలికి ఓ నోట్ కూడా పెట్టాడు. 'కంగారు పడకు, సంతోషంగా వుండి తిను.' అని రాశాడు. ఈ 36 ఏళ్ల దొంగకు సంబంధించిన విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే చివరకు అతడు పోలీసులకు చిక్కాడు. కార్డిఫ్ క్రౌన్ కోర్టు అతనికి 22 నెలల జైలు శిక్ష విధించింది.
ఈ సంఘటన ఇంటి యజమానురాలిని ఎంతగానో భయపెట్టింది. ఘటన జరిగిన రెండు వారాల పాటు ఆమె ఇంటికి వెళ్లలేదు. చివరకు దొంగ పట్టుబడటంతో ఆ మహిళ ఉపశమనం పొంది తిరిగి తన ఇంటికి వెళ్లింది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి టెన్షన్ పడలేదని ఆమె చెప్పుకొచ్చింది. తాను ఒంటరిగా నివసిస్తున్నానని తెలుసుకుని టార్గెట్ చేశాడా? అని అనుమానం వ్యక్తం చేసింది. అందుకే ఇంటి నుంచి వెళ్లిపోయానని, స్నేహితుల ఇంట్లో ఉన్నానని తెలిపింది
దొంగ డామియన్ వోజ్నిలోవిజ్ ఇంట్లోకి చొరబడిన తర్వాత షూ విప్పాడు. ఆ తర్వాత రీసైక్లింగ్ బిన్ దగ్గరకు వెళ్లి చూశాడు. చిందరవందరగా ఉన్న వస్తువులను సర్దేశాడు. చెత్తను తీసి డస్ట్ బిన్‌లో వేశాడు. కిచెన్ ఐటమ్స్ అంతా ఏర్పాడు చేశాడు. అంతే కాదు ఫ్రిజ్‌లో కొన్ని వస్తువులను పెట్టాడు. మొక్కల కుండీలను తొలగించి, వంటగదిని తుడిచి ఖాళీ మద్యం బాటిళ్లను ర్యాక్‌లో ఉంచాడు.
గతంలో జూలై 29న కూడా దొంగతనం చేయాలనే ఉద్దేశంతో డామియన్ ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. ఇక్కడ ఇంటి యజమాని ఫోన్‌కు సీసీటీవీ అలర్ట్ వచ్చింది. దీంతో ఇంటి యజమాని తన అల్లుడిని ఇంట్లో చూడటానికి పంపించాడు. ఇక్కడ కూడా డామియన్ ఇంటి బట్టలు ఉతికాడు. అయితే అక్కడ మాత్రం తిని, మద్యం సేవించాడు. ఈ కేసు కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది.