Uttarkashi tunnel collapse: ఉత్తర కాశి సొరంగ ప్రమాదం; వారం రోజులుగా శిధిలాల్లోనే 40 మంది కార్మికులు; రంగంలోకి పీఎంఓ
Uttarkashi tunnel collapse: ఉత్తర కాశిలో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్ప కూలిన ఘటనలో సహాయ చర్యలు వారం రోజులుగా కొనసాగుతున్నాయి. సొరంగం శిధిలాల్లో చిక్కుకుపోయిన కార్మికుల ప్రాణాలు కాపాడడం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
Uttarkashi Tunnel Collapse: ఉత్తర కాశిలో బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యారా - దండల్‌గావ్ మధ్య నిర్మాణంలో ఉన్న సొరంగం నవంబర్ 12 తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ శిధిలాల్లో 40 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు అధికారులు గత వారం రోజులుగా కృషి చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఆహారం అందుతోంది..
బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారిపై ఒక పర్వతం కిందుగా టన్నెల్ ను నిర్మిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ శిధిలాల్లో చిక్కుకుపోయిన కార్మికులతో కమ్యూనికేషన్ ను పునరుద్ధరించగలిగారు. వారికి 4 ఇంచ్ ల వ్యాసం ఉన్న ఒక చిన్న రంధ్రం ద్వారా ఆహారం అందిస్తున్నారు. వారి ప్రాణాలకు హాని కలగకుండా, వారిని బయటకు తీసుకురావడం కోసం వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు.
నిట్ట నిలువుగా..
ఇప్పుడు ఆ సొరంగం మార్గం పై భాగం నుంచి నిట్ట నిలువగా ఒక భారీ రంధ్రాన్ని తొలచి, దాని ద్వారా ఆ కార్మికులను బయటకు తీసుకురావాలని నిర్ణయించారు. ఆ దిశగా శనివారం నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకోసం అత్యాధునిక డ్రిల్లింగ్ మిషన్ ను ప్రమాదం జరిగిన ప్రదేశానికి తరలించారు. మరోవైపు, ఆ కార్మికులు సురక్షితంగా బయటకు రావాలని కోరుతూ దేశవ్యాప్తంగా ప్రజలు పూజలు చేస్తున్నారు.
రంగంలోకి పీఎంఓ
దాదాపు గత వారం రోజులుగా 40 మంది కార్మికులు ప్రాణాలు అరచేత పట్టుకుని ఆ సొరంగ శిధిలాల్లో ఉంటున్న నేపథ్యంలో.. ప్రధాన మంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. శనివారం పీఎంఓ నుంచి ఒక ఉన్నతాధికారి ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. సహాయ చర్యలను పర్యవేక్షించారు. కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం స్వయంగా అక్కడకు చేరుకుని సహాయ చర్యలను సమీక్షించనున్నారు. మరోవైపు, ప్రధాని మోదీ మాజీ అడ్వైజర్, ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓఎస్డీ గా పని చేస్తున్న భాస్కర్ ఖుల్బే స్వయంగా సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఉత్తర కాశి నుంచి 30 కిమీల దూరం
ప్రమాదం జరిగిన సిల్క్యారా టన్నెల్ ఉత్తరకాశీ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ నుంచి ఏడు గంటల ప్రయాణ దూరంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చార్ ధామ్ ఆల్-వెదర్ రోడ్ ప్రాజెక్ట్‌లో భాగంగా, నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) ఆధ్వర్యంలో ఈ టన్నెల్ ను నిర్మిస్తున్నారు.