UP Road Accident : పాల ట్యాంకర్‌ను ఢీ కొట్టిన బస్సు.. 18 మంది మృతి
Unnao Road Accident : ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18 మంది మరణించారు. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఉత్తరప్రదేశ్ ఉన్నావ్‌లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఈ ప్రమాదంలో 18 మంది మరణించారు. డబల్ డెక్కర్ బస్సు పాల ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వెళ్తున్న బస్సు ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. దీంతో 18 మంది మృతి చెందారు. 19 మందికి పైగా గాయపడ్డారు.
లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై బీహార్‌లోని శివగఢ్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న స్లీపర్ బస్సు బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాల ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ట్యాంకర్‌ను బస్సు చాలా వేగంతో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి సహా 18 మంది మృతి చెందారు. దాదాపు 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
బెహతా ముజావర్ ప్రాంతంలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేలోని కిమీ.నం 247 వద్ద ఉదయం 05.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు నంబర్ UP95 T 4720, మిల్క్ ట్యాంకర్ నంబర్ UP70 CT 3999ని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సులో వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 19 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు ఇద్దరు బీహార్‌కు చెందిన రజనీష్ కుమార్ (26), మహ్మద్ షమీమ్ (28)గా అధికారులు గుర్తించారు. మిగతా బాధితుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.
స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఉన్నావ్ పరిపాలన హెల్ప్‌లైన్ నంబర్‌లను కూడా జారీ చేసింది. అవి : 0515-2970767, 9651432703, 9454417447, 8887713617, 8081211289.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అన్ని విధాలా సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.