ూఎస్‌లోని టెక్సాస్ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. గ్వాడాలుపే నదిలో అకస్మాత్తుగా నీటి ఉధృతి పెరగడంతో అనేక ప్రాంతాల్లో వరద చుట్టుముట్టింది. జనాలు వరదలో చిక్కుకుపోయారు. అధికారుల ప్రకారం.. ఇప్పటివరకు వరదల కారణంగా 52 మందికి పైగా మరణించారు. ఇందులో 15 మంది పిల్లలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. క్యాంప్ మిస్టిక్‌లోకి వరద నీరు ప్రవేశించింది. ఈ క్రైస్తవ శిబిరంలోని 27 మంది బాలికలు తప్పిపోయారు. రెస్క్యూ బృందాలు వారి కోసం వెతుకుతున్నాయి. వందలాది మంది ఈ శిబిరంలో ఉన్నారు.
అధికారుల ప్రకారం.. తప్పిపోయిన వారి సంఖ్యను ఇంకా సరిగా అంచనా వేయలేమని చెప్పారు. నదిలో ఇంకా వెతుకుతున్నారు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గ్వాడాలుపే నది నీరు కేవలం 45 నిమిషాల్లో 8 మీటర్లు పెరిగింది. ఇది పరిస్థితిని చాలా దారుణంగా మార్చింది. నది నీరు అకస్మాత్తుగా పెరిగిన భయానక దృశ్యాన్ని సీసీటీవీలో రికార్డు అయింది.
తప్పిపోయిన వారందరినీ కనుగొనే వరకు అన్వేషణ కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు. టెక్సాస్‌కు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. భారీ విధ్వంసాన్ని చూపిస్తున్నాయి. గతంలో ఇళ్ళు ఉన్న ప్రదేశాలలో కాంక్రీట్ ప్లాట్‌ఫారమ్‌లు కనిపిస్తున్నాయి. నది ఒడ్డున శిథిలాల కుప్పలు పడి ఉన్నాయి. పైకప్పులు, చెట్ల నుండి రెస్క్యూ సిబ్బది.. ప్రజలను బయటకు తీశారని స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి.
టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ రాష్ట్ర విపత్తు ప్రకటనను పొడిగిస్తున్నట్లు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి అదనపు వనరులను అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు.
బాధితుల కోసం తాను, తన భార్య మెలానియా ప్రార్థిస్తున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. 'మా ధైర్యవంతులైన సిబ్బంది సైట్‌లో ఉన్నారు. వారు ఉత్తమంగా పని చేస్తున్నారు.' అని ఆయన సోషల్ మీడియాలో అన్నారు.
మరోవైపు జాతీయ వాతావరణ సేవ(ఎన్‌డబ్ల్యూఎస్) తన అంచనాలో మరిన్ని వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 'అధిక ప్రవాహంతో నదులు, వాగులు, ఇతర లోతట్టు ప్రాంతాలు, వరదలకు గురయ్యే ప్రమాదం సంభవించవచ్చు.' అని పేర్కొంది.