US school shooting : పక్కా ప్రణాళికతో స్కూల్​పై కాల్పులు.. ఆరుగురు మృతి-us school shooting shooter kills 6 at nashville in targeted attack ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us School Shooting : పక్కా ప్రణాళికతో స్కూల్​పై కాల్పులు.. ఆరుగురు మృతి

US school shooting : పక్కా ప్రణాళికతో స్కూల్​పై కాల్పులు.. ఆరుగురు మృతి

Sharath Chitturi HT Telugu
Mar 28, 2023 08:15 AM IST

Nashville school shooting : అమెరికా నాష్విల్లే స్కూల్​లో జరిగిన కాల్పుల ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు.. పక్కా ప్రణాళికతో స్కూల్​పై దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు.

కాల్పులు జరిగిన స్కూల్​ ప్రాంతం వద్ద పోలీసులు
కాల్పులు జరిగిన స్కూల్​ ప్రాంతం వద్ద పోలీసులు (AP)

Nashville school shooting : గన్​ కల్చర్​తో ఉక్కరిబిక్కిరి అవుతున్న అమెరికాలో మరోమారు కాల్పుల మోత మోగింది. టెనస్సి రాజధాని నాష్విల్లేలోని ఓ స్కూల్​లో మాజీ విద్యార్థి మారణహోమం సృష్టించాడు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇది పక్కా ప్రణాళికతో చేసిన దాడి అని పోలీసులు వెల్లడించారు.

అసలేం జరిగింది..?

28ఏళ్ల ఆడ్రి హేల్​ అనే వ్యక్తి.. రెండు అసాల్ట్​ రైఫిల్స్​, ఒక హ్యాండ్​గన్​తో.. కోవెనంట్​ అనే క్రీస్టియన్​ అకాడమీ స్కూల్​లోకి చెచ్చుకెళ్లాడు. సైడ్​ ఎంట్రెన్స్​పై భారీగా కాల్పులు జరిపి లోపలికి వెళ్లాడు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 10 గంటలకు ఈ ఘటన జరిగింది.

US school shooting : కాల్పుల మోతతో అప్పటికే స్కూల్​లో గందరగోళం నెలకొంది. అనంతరం బిల్డింగ్​లో ఫైరింగ్​కు పాల్పడ్డాడు హేల్​. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురిలో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు పాఠశాల సిబ్బంది ఉన్నారు. మరణించిన చిన్నారుల్లో ఒకరి వయస్సు 8ఏళ్లు, మరో ఇద్దరి వయస్సులు 9ఏళ్లు. షూటింగ్​లో ప్రాణాలు కోల్పోయిన పాఠశాల సిబ్బంది వయస్సు 60-61 మధ్యలో ఉంటుంది. వీరిలో ఒకరు స్కూల్​ హెడ్​ అయిన కాథెరిన్​ కూన్స్​.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు 15 నిమిషాల్లోనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే హేల్​ను కాల్చి చంపేశారు. అనంతరం అతడి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. స్కూల్​ మ్యాప్​తో పాటు ఓ మేనిఫెస్టోనూ కూడా తీసుకున్నారు. మ్యాప్​లో స్కూల్​కు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. పోలీసులను ఎదుర్కొనేందుకు హేల్​ పూర్తిగా సన్నద్ధమయ్యాడు. ఫలితంగా.. ఇది పక్కా ప్రణాళికతో జరిపిన దాడి అని పోలీసులు నిర్ధరించారు. వివిధ ప్రాంతాల్లో కాల్పులు జరిపేందుకు హేల్​ ప్రణాళికలు రచించినట్టు, స్కూల్​పై దాడి అందులో భాగం అని.. ఆ మేనిఫెస్టోను చూస్తే పోలీసులకు అర్థమైంది.

US school shooting death toll : హేల్​ లింగ్​పై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. అధికారులు హేల్​ను 'ఆమె' అని సంబోధించారు. కాగా.. హేల్​ లింక్​డిన్​ ప్రొఫైల్​లో తన ఐడెంటిటీని పురుషుడిగానే చెప్పాడు.

స్కూల్​పై దాడికి వెనకున్న కారణాలపై దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. గతంలో హేల్​ ఆ స్కూల్​కు వెళ్లడానికి ఇష్టపడలేదని తెలిసినట్టు వివరించారు. అసలు కారణం ఇంకా తెలియలేదని, దర్యాప్తులో వెలుగులోకి వస్తుందని స్పష్టం చేశారు.

US school shooting today : స్కూల్​లోని మిగిలిన విద్యార్థులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు.

జో బైడెన్​ స్పందన..

నాష్విల్లే కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన తనకు బాధ కలిగించిందని అన్నారు.

Nashville school shooting suspect : "ఇది చాలా బాధాకరమైన విషయం. గన్​ కల్చర్​ మన దేశాన్ని నాశనం చేస్తోంది. ఆయుధాల వినియోగంపై నిషేధం విధించాలని కాంగ్రెస్​ను నేను కోరుతున్నాను," అని బైడెన్​ తెలిపారు.

అమెరికాలో స్కూళ్లపై కాల్పుల ఘటనలు సర్వసాధారమైన విషయంగా మారింది. ఎవరో కోపానికి పసి పిల్లలు బలైపోతున్నారు. మొత్తం మీద అమెరికావ్యాప్తంగా గన్​ కల్చర్​ ఆందోళనకు గురిచేస్తోంది. కాల్పుల్లో కనీసం నలుగురు అంతకన్నా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు.. అమెరికాలో ఈ ఏడాదిలో ఇప్పటికే 129 వెలుగులోకి వచ్చాయి.

సంబంధిత కథనం