US Presidential Elections: 2024 లో జరిగే యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది?
US Presidential Elections: సరిగ్గా మరో సంవత్సరంలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీల తరఫున ఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారో తెలుసుకుందాం.
US Presidential Elections: అమెరికాలో రానున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమున్న అభ్యర్థులపై మార్కెట్టీ లా స్కూల్ (Marquette Law School) ఒక సర్వే చేసింది.
బైడెన్ పై హేలీ పై చేయి
ఒకవేళ డెమొక్రాటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరఫున నిక్కీ హేలీ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిస్తే.. విజయావకాశాలు నిక్కీ హేలీకే ఉన్నాయని ఆ సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 55% మంది నిక్కీ హేలీ తదుపరి ప్రెసిడెంట్ కావాలని కోరుకోగా, 45% జో బైడెన్ కు మద్ధతుగా నిలిచారు. నవంబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు, వివిధ నగరాల్లోని మొత్తం 856 ఓటర్లపై, 668 మంది ఓటర్లుగా నమోదయ్యే అవకాశం ఉన్నవారిపై ఈ సర్వే నిర్వహించారు.
ట్రంప్ కూడా..
బైడెన్ పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆధిక్యతలో ఉండడం ఈ సర్వేలో తేలిన మరో ఆసక్తికర అంశం. బైడెన్ కన్నా ట్రంప్ 4 పాయింట్లు ఆధిత్యతలో ఉన్నారు. ట్రంప్ కు 52% ప్రజలు సపోర్ట్ చేశారు. మొత్తంగా, రానున్న ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ విజయం సాధించడం కష్టంగానే కనిపిస్తోంది. మరోవైపు, వచ్చే సంవత్సరం అధ్యక్ష ఎన్నికల నాటికి బైడెన్ వయస్సు 81 సంవత్సరాలకు చేరుతుంది. ఒకవేళ, బైడెన్ డెమొక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా అవకాశం లభించి, ఆ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తే, అమెరికా ప్రెసిడెంట్ గా గెలిచిన అత్యంత వృద్ధుడిగా బైడెన్ రికార్డు సృష్టిస్తారు.
తగ్గుతున్న బైడెన్ పాపులారిటీ
కాగా, అమెరికాలో అధ్యక్షుడు జో బైడెన్ పాపులారిటీ క్రమంగా తగ్గుతోంది. ఈ సంవత్సరం ఏప్రిల్ తో పోలిస్తే, ప్రస్తుతం మరింత తగ్గింది. ప్రస్తుతం 39% అమెరికన్లు మాత్రమే బైడెన్ పాలనను సమర్ధిస్తున్నారని రాయిటర్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. సెప్టెంబర్ లో నిర్వహించిన సర్వే లో ఇది 42% గా ఉంది.