US Presidential Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ల మధ్యనే మళ్లీ పోటీ..!-us presidential elections donald trump and biden rematch a done deal now ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Presidential Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ల మధ్యనే మళ్లీ పోటీ..!

US Presidential Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ల మధ్యనే మళ్లీ పోటీ..!

HT Telugu Desk HT Telugu

US Presidential Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ప్రైమరీల్లో విజయాలు సాధించి డెమొక్రాటిక్ పార్టీ తరఫున జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నికల రేసులో పోటీపడడం దాదాపు ఖాయమైంది. వీరిద్దరు తమ పార్టీల నుంచి నామినేషన్లను దక్కించుకున్నారు.

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (AP)

US Presidential Elections: డెమొక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మంగళవారం అధ్యక్ష నామినేషన్లను గెలుచుకున్నారు. దీంతో 2020 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల మాదిరిగానే మరోసారి అధ్యక్ష ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

ప్రతీ నాలుగేళ్లకు..

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సాధారణంగా, ప్రతీ నాలుగు సంవత్సరాలకు, నవంబర్ 5 వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. అంటే, ఈ సంవత్సరం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 238 రోజుల సమయం ఉంది.

ప్రైమరీల్లో ట్రంప్ హవా..

జార్జియా, మిసిసిపీ, వాషింగ్టన్ స్టేట్ ల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో.. తమ తమ పార్టీల తరఫున డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ విజయం సాధించారు. ఉత్తర మరియానా దీవుల ప్రైమరీలో జో బైడెన్ 11 డెలిగేట్లను సాధించారు. అయితే, జార్జియాలో, గాజాలో యుద్ధంపై బైడెన్ (Joe Biden) ప్రభుత్వ వైఖరిపై ఓటర్లు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. బ్యాలెట్ లో 'అన్ కమిటెడ్' ఆప్షన్ లేకపోవడంతో కొందరు ఓటర్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు అసాధారణ మార్గాలను ఆశ్రయించారు. మరోవైపు, జార్జియాలో ట్రంప్ (Donald Trump) విజయం ఏకపక్షంగా సాగింది. ఇతర అభ్యర్థులు బ్యాలెట్లో కనిపించినప్పటికీ, పోటీ నామమాత్రంగానే సాగింది. స్కాట్ కార్పెంటర్ వంటి కొద్ది మంది ట్రంప్ (Donald Trump) పట్ల ద్వేషం కారణంగా మాజీ రాయబారి నిక్కీ హేలీకి ఓటు వేశారు.

మరోసారి అవకాశం ఇవ్వండి

ప్రైమరీల్లో విజయం అనంతరం అమెరికా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ అధ్యక్షుడు బైడెన్ (Joe Biden) ఒక ప్రకటన విడుదల చేశారు. నాలుగేళ్ల క్రితం తాను విజయం సాధించిన నాటి కన్నా ట్రంప్ విసురుతున్న ముప్పు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉందని బైడెన్ హెచ్చరించారు. ఈ సమయంలో తన పార్టీపై, తనపై ఈ దేశాన్ని నడిపించడానికి మరోసారి విశ్వాసం ఉంచాలన్నారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.