Joe Biden - Xi Jinping meet: చిరునవ్వుతో అమెరికా, చైనా అధ్యక్షుల చర్చలు మొదలు.. జిన్‍పింగ్, బైడెన్ ఏమన్నారంటే..!
Joe Biden - Xi Jinping meet: అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‍పింగ్ మధ్య చర్చలు మొదలయ్యాయి. జీ20 సదస్సు సందర్భంగా బాలికి చేరుకున్న ఇరువురు నేతలు సమావేశమయ్యారు.
Joe Biden - Xi Jinping meet: తైవాన్ విషయంలో అగ్రరాజ్యం అమెరికా, చైనా దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఇటీవల మరింత పెరుగుతున్నాయి. అయితే ఈ తరుణంలో అమెరికా, చైనా అధ్యక్షులు ముఖాముఖి సమావేశమయ్యారు. ఇండోనేషియాలోని బాలి (Bali) లో జీ20 సదస్సు (G20 Summit) సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ (US President Joe Biden), చైనా అధ్యక్షుడు షీ జిన్‍పింగ్ (China President Xi Jinping) చర్చలు మొదలుపెట్టారు. ప్రపంచమంతా ఈ రెండు దేశాల వైపు చూస్తున్న నేపథ్యంలో ఈ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాతో ఎలాంటి బంధాన్ని కోరుకుంటున్నారో చర్చలు ప్రారంభమయ్యే ముందు జిన్‍పింగ్ చెప్పారు. జిన్‍పింగ్‍ను చిరునవ్వుతో పలకరించారు బైడెన్. ఇద్దరు నేతలు కరచాలనం చేసుకున్నారు. అధ్యక్ష పదవిని చేపట్టాక బైడెన్.. చైనా అధినేతను ముఖాముఖి కలవడం ఇదే తొలిసారి. పూర్తి వివరాలు ఇవే.
Joe Biden - Xi Jinping meet: సత్సబంధాలను కోరుకుంటున్నాం: జిన్‍పింగ్
చైనా-అమెరికా మధ్య సత్సంబంధాలు మళ్లీ నెలకొంటాయని ఆశిస్తున్నట్టు చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్‍పింగ్ అన్నారు. ఆరోగ్యకరమైన, స్థిరమైన వృద్ధి ఉండేలా రెండు దేశాల మధ్య బంధాలు కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు. “మేమే నేడు ఎట్టకేలకు ముఖాముఖి సమావేశం అవుతున్నాం. అమెరికా-చైనా మధ్య సంబంధాలతో నెలకొని ఉన్న వ్యూహాత్మక ప్రాముఖ్యత గురించిన అభిప్రాయాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నా. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మళ్లీ గాడిన పడేలా మీతో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నాం” అని చర్చకు ముందు బైడెన్‍తో షీ జిన్‍పింగ్ అన్నారు.
Joe Biden - Xi Jinping meet: మాస్కులతో అధికారులు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెంట సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్, ట్రెజరీ సెక్రటరీ జెనెట్ ఎలెన్, చైనాలో అమెరికా అంబాసిడర్ నోకోలస్ బర్న్స్ ఉన్నారు. ఇక చైనా అధ్యక్షుడు జిన్‍పింగ్‍తో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ జనవల్ ఆఫీసర్ డింగ్ షియుషియాంగ్, విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఉన్నారు. జిన్‍పింగ్, బైడెన్ ఎదురెదురుగా కూర్చుకున్నారు. ఇద్దరూ దేశాధ్యక్షులు మినహా మిగిలిన అధికారులందరూ మాస్కులు ధరించి కనిపించారు.
Joe Biden - Xi Jinping meet: అన్ని దేశాలతో కలిసి పని చేయాలి
“సంబంధాలను చైనా-అమెరికా సరైన రీతిలో కొనసాగిస్తాయని ప్రపంచం అంచనా వేస్తోంది. మన మీటింగ్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచ శాంతి కోసం మరింత ఆకాంక్షను పెంచేందుకు, ప్రపంచ నిశ్చితికి విశ్వాసాన్ని కల్పించేందుకు, సమాంతర అభివృద్ధికి కోసం మనం అన్ని దేశాలతో కలిసి పని చేయాల్సి ఉంది” అని బైడెన్‍తో జిన్‍పింగ్ అన్నారు.
మరోవైపు, అమెరికా, చైనా మధ్య పరస్పర సహకారం అవసరమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. విభేదాలను రూపిమాపి, కలిసి పని చేసేందుకు దారులు అన్వేషించాల్సిన అవసరం ఉందని అన్నారు.
Joe Biden - Xi Jinping meet: తైవాన్‍పైనే ఉత్కంఠ
తైవాన్ (Taiwan)ను స్వాధీనం చేసుకోవాలని చైనా భావిస్తోంది. యుద్ధ విమానాల విన్యాసాలతో తైవాన్‍పై యుద్ధానికి సిద్ధమనేలా సంకేతాలు ఇస్తోంది. మరోవైపు తైవాన్‍కు అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. తైవాన్‍కు ఆయుధ సాయం చేస్తోంది. దీంతో అమెరికా-చైనా మధ్య సంబంధాలు ఇటీవలి కాలంలో మరింత క్షీణిస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికా, చైనా దేశాధినేతలు బైడెన్, జిన్‍పింగ్ ముఖాముఖి చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది. మరి తైవాన్ అంశాన్ని చర్చిస్తారా.. ఏదైనా స్పష్టమైన నిర్ణయానికి వస్తారేమో చూడాలి.