అమెరికాలోని భారతీయులపై మరో భారం ‘రెమిటన్స్ టాక్స్’; ఏమిటిది? ఎంత శాతం ఉంటుంది?-us lowers remittance tax to 3 5 percent what is remittance tax and how it will impact indians and h 1b workers ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  అమెరికాలోని భారతీయులపై మరో భారం ‘రెమిటన్స్ టాక్స్’; ఏమిటిది? ఎంత శాతం ఉంటుంది?

అమెరికాలోని భారతీయులపై మరో భారం ‘రెమిటన్స్ టాక్స్’; ఏమిటిది? ఎంత శాతం ఉంటుంది?

Sudarshan V HT Telugu

అమెరికాలో నివసిస్తున్న వారు తమ స్వదేశాలకు, అమెరికాయేతర దేశాల్లోని వారికి కానీ పంపించే డబ్బుపై విధించనున్న ప్రతిపాదిన రెమిటెన్స్ టాక్స్ ను 3.5 శాతానికి తగ్గించారు. ఈ రెమిటెన్స్ ఎక్సైజ్ పన్ను అమల్లోకి వస్తే భారత్ పై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ రెమిటెన్స్ టాక్స్ అంటే ఏమిటో ఇక్కడ చూద్దాం.

డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన రెమిటెన్స్ టాక్స్ (AP)

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల్లో రెమిటెన్స్ ఎక్సైజ్ టాక్స్ ఒకటి. అమెరికాలో నివసిస్తున్న వారు తమ స్వదేశాలకు, అమెరికాయేతర దేశాల్లోని వారికి కానీ పంపించే డబ్బుపై విధించనున్న పన్ను ఇది.

5 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గింపు

అయితే, ప్రతిపాదిత బిల్లులో ఈ రెమిటెన్స్ ఎక్సైజ్ టాక్స్ ను 5% గా నిర్ణయించారు. అయితే, ఈ పన్నును 5 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించాలన్న సవరణను అమెరికా ప్రతినిధుల సభ 215-214 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ ప్రతిపాదిత చట్టాన్ని ట్రంప్ ‘‘'వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్’’ గా అభివర్ణించారు. అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు 'రెమిటెన్స్ పై పన్ను' విధించడం ఈ బిల్లులోని అతి ముఖ్యమైన లక్షణం. రెమిటెన్స్ టాక్స్ 3.5 శాతానికి తగ్గడం అమెరికాలో మెజారిటీ ఎన్ఆర్ఐలకు ఊరట కలిగిస్తుందని భావిస్తున్నారు.

రెమిటెన్స్ ఎక్సైజ్ టాక్స్ బిల్లులో ఏముంది?

ఈ బిల్లు ప్రకారం అమెరికాలో చట్టబద్ధమైన వలసదారులు తమ అవుట్ గోయింగ్ రెమిటెన్స్ లపై పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా, కొంత శాతం డబ్బు అమెరికా ఖజానాకు వెళ్తుంది. ఈ ప్రతిపాదిత నిబంధనను 'రెమిటెన్స్ బదిలీలపై ఎక్సైజ్ ట్యాక్స్'గా పిలుస్తారు. దీనిద్వారా రెమిటెన్స్ లపై 5% ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తారు. దేశంలో నివసిస్తున్న, పనిచేసే భారతీయులలో ఆందోళనలు రేకెత్తడంతో, ఈ బిల్లులో సభ ఆమోదం పొందడానికి ముందు కొన్ని మార్పులు చేశారు. అమెరికా నుంచి వెళ్లే నగదు బదిలీలపై అమెరికా తన ప్రతిపాదిత ఎక్సైజ్ పన్నును 5% నుండి 3.5% కు తగ్గించింది. ఆర్థిక, వాణిజ్య, ఇమ్మిగ్రేషన్ ప్రవాహాలను లక్ష్యంగా చేసుకుని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వెల్లడించిన వన్ బిగ్, బ్యూటిఫుల్ బిల్లు చట్టంలో ఈ మార్పు ఒక భాగం.

బిల్లు భారత్ పై చూపే ప్రభావం

3.5 శాతం రెమిటెన్స్ ఎక్సైజ్ పన్ను అమల్లోకి వస్తే భారత్ పై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా నుంచి దేశానికి ఏటా 25 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ లు వస్తున్నాయి . 2024లో భారత్ కు వచ్చిన 129 బిలియన్ డాలర్ల విదేశీ రెమిటెన్స్ లలో 28 శాతం అమెరికా నుంచే వచ్చాయని ప్రపంచ బ్యాంకు నివేదించింది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) ప్రకారం, ప్రతిపాదిత రెమిటెన్స్ టాక్స్ కారణంగా భారతదేశానికి వచ్చే రెమిటెన్స్ లలో 10% –15% తగ్గుదలకు దారితీస్తుంది. అంటే సుమారు 12–18 బిలియన్ డాలర్ల మేరకు తగ్గుతుంది.

ఎవరిపై ప్రభావం పడుతుంది?

ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే హెచ్ -1బీ వీసాదారులు, ఎఫ్ -1 వీసాదారులు, అమెరికాలో ఆస్తులు లేదా ఆదాయం ఉన్న గ్రీన్ కార్డులు కలిగిన విదేశీయులపై భారీ ప్రభావం పడుతుంది. అలాగే, యుఎస్ నుండి నియంత్రిత స్టాక్ యూనిట్లు (ఆర్ ఎస్ యులు) లేదా ఇతర ఆదాయాన్ని ఆర్జించిన తరువాత డబ్బును విదేశాలకు తరలించే విదేశీయులు కూడా రెమిటెన్స్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

రెమిటెన్స్ లు తగ్గుతాయి..

అంతేకాదు, ఈ టాక్స్ కారణంగా భారత్ కు వచ్చే రెమిటెన్స్ ల్లో కూడా భారీ తగ్గుదల నమోదు కావచ్చు. యూఎస్ నుంచి అక్కడి వారు తమ కుటుంబాలకు పంపించే డబ్బు మొత్తాలు తగ్గవచ్చు. అదనంగా, ఈ ప్రతిపాదన విదేశీయులను యునైటెడ్ స్టేట్స్ లో ఆస్తులు లేదా ఉద్యోగాలను ఉంచకుండా నిరోధించవచ్చు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారికి ఈ భారం ఎక్కువగా ఉండవచ్చు. దీనివల్ల ఆర్థిక సంస్థలు, మనీ ట్రాన్స్ ఫర్ ప్రొవైడర్లపై మరింత ఒత్తిడి ఉండవచ్చు.

ఆల్రెడీ చెల్లిస్తున్న పన్నులకు ఇది అదనం

అమెరికాలోని భారతీయులకు, అంటే, గ్రీన్ కార్డు హోల్డర్లు లేదా హెచ్ -1బి లేదా ఇతర వీసాలపై ఉన్నవారికి - ఇప్పటికే చెల్లించిన ఆదాయపు పన్నులకు అదనంగా ఈ పన్ను వర్తిస్తుందని యుఎస్ టాక్స్ విభాగం నిపుణుడు లాయిడ్ పింటో చెప్పారు. భవిష్యత్తులో ఎన్ఆర్ఐలు భారత్ కు డబ్బు పంపడం ఖరీదైనదిగా భావించడం వల్ల విదేశీ మారకద్రవ్య ప్రవాహంలో తగ్గుదలను భారత్ ఎదుర్కొంటుందని పన్ను, కన్సల్టెన్సీ సంస్థ ఏకేఎం గ్లోబల్ లీడ్-ట్రాన్స్ఫర్-ప్రైసింగ్ అండ్ లిటిగేషన్ మనీష్ గార్గ్ తెలిపారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులు, గ్రీన్ కార్డు ఉన్నవారు కూడా గణనీయంగా ప్రభావితమవుతారని సీఎన్బీసీ టీవీ తెలిపింది.

రెగ్యులేటరీ నియంత్రణలు కూడా..

కొత్త బిల్లు రెగ్యులేటరీ పర్యవేక్షణను కూడా పెంచుతుంది. ఒకే రోజులో 5,000 డాలర్ల కంటే ఎక్కువ పంపే వినియోగదారుల వివరాలను మనీ ట్రాన్స్ ఫర్ కంపెనీలు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతో సాధారణ బదిలీల పరిశీలన పెరుగుతుంది. కఠినమైన కేవైసీ నిబంధనలు, కంప్లయన్స్ ఫైలింగ్ ల కారణంగా కొంతమంది ఖాతాదారులకు బదిలీలు ఆలస్యం కావచ్చు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.