US layoffs : 75వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఉఫ్! ట్రంప్ పనులతో రోడ్డు మీదకు ఉద్యోగులు..!
US layoffs: డొనాల్డ్ ట్రంప్- ఎలాన్ మస్క్ డాడ్జ్ టీమ్ పేరు వింటేనే అమెరికా ఫెడరల్ ఉద్యోగులు వణికిపోతున్నారు! ఇప్పటికే 75వేల మందికిపైగా ఉద్యోగులు తమ జాబ్స్ని కోల్పోయారు. మరో 20లక్షల మందిపై ఏ క్షణంలోనైనా ‘లేఆఫ్స్’ పిడుగు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి రోజుకో సంచలనం సృష్టిస్తున్నారు. అక్రమ వలసలు, టారీఫ్ యుద్ధంతో ప్రపంచ దేశాలకు షాక్ ఇస్తున్న ఆయన.. ఇప్పుడు సొంత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు కనిపిస్తోంది. దిగ్గజ వ్యాపారవేత్త, డాడ్జ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్న్మెంట్ ఎఫీషియెన్సీ) హెడ్ ఎలాన్ మస్క్‌తో కలిసి ఫెడరల్ వర్క్‌ఫోర్స్‌ని అమాంతం తగ్గించేందుకు ట్రంప్ చర్యలు చేపట్టారు. ఫలితంగా అమెరికావ్యాప్తంగా వివిధ ఫెడరల్ డిపార్ట్మెంట్స్లో ప్రభుత్వ ఉద్యోగులు.. కనీవినీ ఎరుగని రీతిలో లేఆఫ్స్‌ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 75వేల మంది.. ఉద్యోగాల నుంచి తప్పుకున్నట్టు, మరో 19లక్షల మందిపై ఏ క్షణంలోనైనా 'లేఆఫ్' పిడుగు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
75వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు కట్..
ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్ రిపోర్టు ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ఎలాన్ మస్క్‌తో కలిసి పనిచేయాలని ఏజెన్సీ హెడ్స్‌కి ట్రంప్ సూచించారు. అంతేకాదు, అవసరమైతే తప్ప, కొత్త ఉద్యోగులను తీసుకోవద్దని స్పష్టం చేశారు. వైట్‌హైస్ ఫ్యాక్ట్ షీట్ ప్రకారం.. నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు వైదొలిగితే, వారి స్థానంలో ఒకరికి మించి నియమించకూడదు!
ఎఫీషియెన్సీ తక్కువగా ఉన్న ఉద్యోగులను తొలగించి, డబ్బులు ఆదా చేసుకోవాలని చూస్తున్నట్టు డాడ్జ్ టీమ్, ట్రంప్ యంత్రాంగం గత కొంతకాలంగా చెబుతూ వస్తోంది. ఇందులో భాగంగానే దాదాపు 20లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులకు 'బైఔట్' ప్రోగ్రామ్ ఎంచుకునే ఆప్షన్ని ఇచ్చింది ట్రంప్ బృందం. నిర్దిష్ట తేదీలోగా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే, సెప్టెంబర్ 30 వరకు సంబంధించిన జీతాలు ఇస్తామని ఆ ప్రోగ్రామ్‌లో చెప్పింది. ఇప్పటివరకు 75వేల మంది ఈ ప్రోగ్రామ్ని ఆప్ట్ చేసుకుని ఉద్యోగాల నుంచి వైదొలిగారని సెమాఫోర్ నివేదిక తెలిపింది. "మీరు రాజీనామా చేయకపోతే, భవిష్యత్తులో మీ ఉద్యోగాలకు 100శాతం హామీ ఉంటుందని చెప్పలేము," అని సదరు ప్రోగ్రామ్‌లో రాసి ఉండటం ఇందుకు కారణం.
ఇక శుక్రవారం ఒక్కరోజే 9,500కిపైగా మంది ప్రభుత్వ ఉద్యోగాలను తొలగించినట్టు తెలుస్తోంది.
సీఐఏ సహా అమెరికాలోని వివిధ ఏజెన్సీల మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఇప్పటివరకు 3.7శాతం మంది రాజీనామా చేశారు. మరీ ముఖ్యంగా విద్య, చిన్న వ్యాపారాల వ్యవహారాలు, ఎనర్జీ విభాగాల్లో ప్రొబెషనరీ పీరియడ్‌లో ఉన్న ఉద్యోగులు అధిక ప్రభావాన్ని ఎదుర్కొన్నారు.
అంతేకాదు ట్రంప్ విమర్శించే వివిధ విభాగాలకు బడ్జెట్ కూడా తగ్గిపోతున్నట్టు సమాచారం. ఫలితంగా.. ఆయా విభాగాల అధికారులు.. కాస్ట్ కటింగ్‌పై ఫోకస్ చేస్తున్నారు. ఉద్యోగాల కోత నుంచి ప్రాజెక్ట్స్ ఖర్చును తగ్గించడం వరకు అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నారు.
రోజుకు ఒక బిలియన్ డాలర్లు ఆదా!
ఓవైపు అనూహ్యంగా ఉద్యోగాలు కోల్పోయిన వారు బాధలో ఉంటే, మరోవైపు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డాడ్జ్పై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రోజుకు 1 బిలియన్ డాలర్లు ఆదా చేయగలిగే విధానాన్ని మస్క్ టీమ్ కనుగొందని చెబుతున్నారు.
"వేల బిలియన్ డాలర్లు ఆదా చేసుకునే మార్గాన్ని ఇప్పటికే కనుగొన్నాము," అని ట్రంప్ అన్నారు.
ఇదే విషయంపై జనవరి 29న డాడ్జ్ వివరణ కూడా ఇచ్చింది.
"ఫెడరల్ గవర్న్‌మెంట్‌కి సంబంధించిన 1 బిలియన్ డాలర్లను డాడ్జ్ ఆదా చేస్తోంది. అనవసరమైన పొజీషన్స్లో రిక్రూట్మెంట్ ఆపేయడం, విదేశీ వ్యవస్థలకు నిధులను ఆపేయడం వంటివి ఇందులో భాగం. ఇవన్నీ అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతోనే జరుగుతున్నాయి. ఇది మంచి ప్రారంభం. దీనిని రోజుకు 3 బిలియన్ డాలర్లకు పెంచాలి," అని డాడ్జ్ ట్వీట్ చేసింది.
అసలేంటి ఈ డాడ్జ్? దీని లక్ష్యాలేంటి?
ఇందాక చెప్పినట్టు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఎలాన్ మస్క్ నేతృత్వంలో డాడ్జ్ని ఏర్పాటు చేశారు ట్రంప్. ఫెడరల్ ఏజెన్సీల్లో వర్క్‌ఫోర్స్‌ని తగ్గించడం ఈ డాడ్జ్ ప్రధాన అజెండా.
సంబంధిత కథనం