Elon Musk: భార్య మెలానియా, ఎలాన్ మస్క్ లకు ట్రంప్ థాంక్స్ ; అన్నిరకాలుగా సహకరించారని ప్రశంసలు-us elections this is what donald trump said about elon musk in victory speech ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Elon Musk: భార్య మెలానియా, ఎలాన్ మస్క్ లకు ట్రంప్ థాంక్స్ ; అన్నిరకాలుగా సహకరించారని ప్రశంసలు

Elon Musk: భార్య మెలానియా, ఎలాన్ మస్క్ లకు ట్రంప్ థాంక్స్ ; అన్నిరకాలుగా సహకరించారని ప్రశంసలు

Sudarshan V HT Telugu
Nov 06, 2024 02:48 PM IST

US Elections: 2024 అమెరికా ఎన్నికల్లో విజయం సాధించినట్లు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో ఎలన్ మస్క్ పై ప్రశంసలు కురిపించారు. తన ప్రచారానికి మద్దతుగా నిలిచిన టెక్ బిలియనీర్ మస్క్ ను 'సూపర్ జీనియస్', 'స్పెషల్ బాయ్'గా అభివర్ణించారు.

భార్య మెలానియా, ఎలాన్ మస్క్ లకు ట్రంప్ థాంక్స్
భార్య మెలానియా, ఎలాన్ మస్క్ లకు ట్రంప్ థాంక్స్ (Reuters / Brian Snyder)

US Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఇద్దరు వ్యక్తులను రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. తన విజయంలో తన భార్య మెలానియా, టెక్ బిలియనీర్, తన స్నేహితుడు ఎలాన్ మస్క్ లకు ప్రధాన పాత్ర ఉందన్నారు. మెలానియా రాసిన పుస్తకాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

అమెరికాకు స్వర్ణయుగం

విజయం ఖాయమైన అనంతరం డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 6న వేదికపైకి వచ్చి తన విజయాన్ని ఘనంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమెరికాకు స్వర్ణయుగాన్ని తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేశారు. ‘‘మునుపెన్నడూ ఎవరూ చూడని ఉద్యమం ఇది, నిజం చెప్పాలంటే ఇది రాజకీయంగా జరిగిన గొప్ప ఉద్యమం అని నేను నమ్ముతున్నాను. ఈ దేశంలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఎ స్టార్ ఈజ్ బోర్న్'

తన విజయ ప్రసంగంలో ఎలాన్ మస్క్ పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. తన ప్రచార కర్తల్లో మస్క్ అత్యంత సమర్థవంతమైనవాడని అన్నారు. తన ప్రచారానికి మస్క్ ఆర్థికంగా కూడా సహకరించాడని వెల్లడించారు. ‘‘అతనో ప్రత్యేకమైన వ్యక్తి, సూపర్ జీనియస్. మన మేధావులను మనం కాపాడుకోవాలి. అలాంటివారు మన దగ్గర ఎక్కువగా లేరు. మన సూపర్ మేధావులను మనం కాపాడుకోవాలి’’ అన్నారు. పెన్సిల్వేనియాలో ట్రంప్ ప్రచారానికి మస్క్ (elon musk) మిలియన్ డాలర్లు వెచ్చించారు.

పాపులర్ ఓటు

20 సంవత్సరాలలో పాపులర్ ఓటును గెలుచుకున్న మొదటి రిపబ్లికన్ గా ట్రంప్ రికార్డు సృష్టించారు. 2004లో జార్జి డబ్ల్యూ బుష్ తర్వాత 2016లో ట్రంప్ (donald trump) సహా ఏ రిపబ్లికన్ కూడా పాపులర్ ఓట్లను గెలుచుకోకపోవడం గమనార్హం. విజయం సాధించిన అనంతరం ట్రంప్ మాట్లాడుతూ, ‘‘ఇప్పుడు అమెరికా ఒక కొత్త స్థాయికి చేరుకోబోతోంది. మేము మా దేశానికి సహాయం చేయబోతున్నాము. మన దేశానికి సాయం చేస్తాం. మనం మన దేశాన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మన సరిహద్దులను చక్కదిద్దుకుందాం. మన దేశానికి సంబంధించిన ప్రతిదీ మేం చక్కదిద్దుకుందాం. ఈ రాత్రికి ఒక కారణంతో చరిత్ర సృష్టించాం. ఎవరూ ఊహించని అడ్డంకులను అధిగమించాం. అత్యంత నమ్మశక్యం కాని రాజకీయ లక్ష్యాన్ని సాధించాం’’ అని ట్రంప్ అన్నారు.

ఓటర్లకు కృతజ్ఞతలు

‘‘మీ 47వ అధ్యక్షుడు, 45వ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు అమెరికా (us presidential elections 2024) ప్రజలకు, ప్రతి పౌరుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను, నేను మీ కోసం, మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్తు కోసం పోరాడతాను. ప్రతిరోజూ, నేను మీ కోసం పోరాడతాను మరియు నా శరీరంలోని ప్రతి శ్వాసతో, మా పిల్లలకు అర్హమైన మరియు మీకు అర్హమైన బలమైన, సురక్షితమైన మరియు సంపన్నమైన అమెరికాను అందించే వరకు నేను విశ్రమించను. ఇది నిజంగా అమెరికా స్వర్ణయుగం అవుతుంది' అని ట్రంప్ పేర్కొన్నారు.

Whats_app_banner