US election results date: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ఎప్పుడు ప్రకటిస్తారు?.. ట్రెండ్ ఎలా ఉంది?-us election results date when will trump vs harris winner be announced ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Election Results Date: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ఎప్పుడు ప్రకటిస్తారు?.. ట్రెండ్ ఎలా ఉంది?

US election results date: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ఎప్పుడు ప్రకటిస్తారు?.. ట్రెండ్ ఎలా ఉంది?

Sudarshan V HT Telugu

US election results date: ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి అమెరికా పై ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఉంది. స్టాక్ మార్కెట్లపై కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం పడుతోంది. అయితే, ఈ ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వెలువడుతాయి? ట్రంప్, హారిస్ లలో ఎవరు వైట్ హౌజ్ లోకి వెళ్తారనేది ఆసక్తిగా మారింది.

డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (AP)

US election results date: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి వారంలోకి అడుగుపెడుతోంది. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ లలో విజేత ఎవరనేది ఉత్కంఠగా మారింది. వివిధ సర్వేలు వారి మధ్య స్వల్ప తేడానే చూపుతున్నాయి.

నవంబర్ 5న..

సరిగ్గా వారం రోజుల తరువాత అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 5 న ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే, పోలింగ్ రోజుకు ముందే 41 మిలియన్లకు పైగా అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ జరిగే నవంబర్ 5వ తేదీననే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అయితే, అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరో తేలే తుది ఫలితాలు వెలువడడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.

మిషిగన్, జార్జియాలపై దృష్టి

జార్జియా, మిచిగాన్ సహా ఏడు స్వింగ్ రాష్ట్రాలు ప్రధానంగా ఈ ఎన్నికల ఫలితాలను నిర్ణయించనున్నాయి. మిషిగన్ లో అరబ్ అమెరికన్లు ఎక్కువగా ఉంటారు. ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు ఇవ్వడంపై అరబ్ అమెరికన్ల నుంచి బైడెన్ ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కొంటోంది. దాంతో ప్రధానంగా మిషిగన్ రాష్ట్రంపై కమలా హారిస్ దృష్టి సారించారు. ఇదిలావుండగా, ఎవాంజెలికల్స్, కన్జర్వేటివ్ క్రిస్టియన్ ఓటర్లు అధికంగా ఉన్న జార్జియాపై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆశలు పెట్టుకున్నారు. అక్కడి ఓట్లను సమీకరించడమే లక్ష్యంగా ట్రంప్ జార్జియాపై దృష్టి పెట్టారు.

పోటాపోటీ ప్రచారం

ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ (kamala harris), రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. అబార్షన్ హక్కుల విషయంలో కమలా హారిస్ ను రాడికల్ గా చిత్రీకరించేందుకు ట్రంప్ ప్రయత్నించగా, ఈ అంశంపై అమెరికాను 1800లకు తీసుకువెళ్లాలని ట్రంప్ కోరుకుంటున్నారని హారిస్ హెచ్చరిస్తున్నారు. 78 ఏళ్ల రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జార్జియాలో ర్యాలీ నిర్వహించే ముందు పాస్టర్లు, క్రిస్టియన్ నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 60 ఏళ్ల కమలా హారిస్ ఆదివారం పెన్సిల్వేనియాలో ప్రచారం చేశారు.

ఉద్రిక్తతలు పెరిగాయి

న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో ట్రంప్ (donald trump) ర్యాలీలో వక్తలు లాటినోలు, ప్యూర్టోరికో గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కమలా హారిస్ కీలకమైన పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో ఆదివారం ప్రచారం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

కీలక స్వింగ్ రాష్ట్రాలు

జార్జియా, మిచిగాన్ సహా ఏడు స్వింగ్ స్టేట్స్ ఈ ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయి. అబార్షన్ పై ట్రంప్ వైఖరి, సుప్రీంకోర్టు నియామకాలు కన్జర్వేటివ్ ఓటర్లను ఉత్తేజపరచగా, ఇజ్రాయెల్ పై కమలా హారిస్ వైఖరి కొంతమంది ముస్లిం, అరబ్ అమెరికన్ ఓటర్లను దూరం చేసింది. ఈ కీలకమైన ఎన్నికల ఫలితాల కోసం దేశం ఎదురుచూస్తుండగా ఫలితం ఉత్కంఠభరితంగా సాగుతోంది.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.