US concerned about CAA: సీఏఏ అమలుపై అమెరికా ఆందోళన; నిశితంగా గమనిస్తున్నామని వ్యాఖ్య
US about CAA: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) అమలు చేస్తూ కేంద్రం నిబంధనలను విడుదల చేసిన నేపథ్యంలో అమెరికా స్పందించింది. సీఏఏ అమలుపై తమకు ఆందోళన ఉందని, ఆ వివాదాస్పద చట్టం అమలు తీరును నిశితంగా గమనిస్తున్నామని ప్రకటించింది.
US about CAA: భారత్ లో పౌరసత్వ సవరణ చట్టం (CAA) నిబంధనల నోటిఫికేషన్ పై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టం అమలును అమెరికా నిశితంగా పరిశీలిస్తోందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని మార్చి 11న భారత ప్రభుత్వం నోటిఫై చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదాస్పద చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. కాగా, ఈ చట్టం (CAA) అమలుపై తాజాగా, అమెరికా స్పందించింది. పౌరసత్వ సవరణ చట్టం అమలుపై తాము ఆందోళన చెందుతున్నామని మిల్లర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘ఈ చట్టాన్ని ఎలా అమలు చేస్తారో నిశితంగా పరిశీలిస్తున్నాం. మత స్వేచ్ఛను గౌరవించడం, చట్టం ప్రకారం అన్ని వర్గాలను సమానంగా చూడటం ప్రాథమిక ప్రజాస్వామిక సూత్రాలు’’ అని ఆయన అన్నారు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
ముస్లిమేతర శరణార్థులకు..
2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ల నుంచి భారత్ లోకి ప్రవేశించిన ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం కల్పించడానికి సీఏఏ (CAA) ను అమల్లోకి తీసుకువచ్చారు. ఈ చట్టాన్ని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మార్చి 11న అమలులోకి తీసుకువచ్చింది. ఈ చట్టం 2019 డిసెంబర్ లో పార్లమెంటు ఆమోద పొందింది. పార్లమెంటు ఈ చట్టాన్ని ఆమోదించిన నాలుగేళ్ల తర్వాత దీనిని కేంద్రం నోటిఫై చేసింది.
విపక్షాల విమర్శలు
ఈ పౌరసత్వ సవరణ చట్టం (CAA) రాజ్యాంగ విరుద్ధమని, వివక్షాపూరితంగా ఉందని, రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక పౌరసత్వ సూత్రాలను ఉల్లంఘిస్తోందని ప్రతిపక్ష నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సీఏఏ పరిధి నుంచి ముస్లింలను మినహాయించి, పౌరసత్వాన్ని మతపరమైన గుర్తింపుతో ముడిపెట్టడం ద్వారా ఈ చట్టం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక సూత్రాలను బలహీనపరుస్తుందని సీఏఏ విమర్శకులు వాదిస్తున్నారు.
ఎవరి పౌరసత్వాన్ని లాక్కోం: అమిత్ షా
అయితే సీఏఏ అంటే పౌరసత్వం ఇవ్వడమేనని, ఈ పౌరసత్వ సవరణ చట్టం (CAA) వల్ల దేశంలోని ఏ పౌరుడూ పౌరసత్వాన్ని కోల్పోడని కేంద్రం పేర్కొంది. సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోబోమని, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎప్పటికీ రాజీపడదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తమ దేశంలో భారత పౌరసత్వాన్ని నిర్ధారించడం తమ సార్వభౌమ హక్కు అని, దీనిపై తాము ఎన్నడూ రాజీపడబోమని, సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోబోమని ఆయన తేల్చి చెప్పారు. ప్రతిపక్షాలకు వేరే పని లేదని అమిత్ షా అన్నారు. ‘‘ఒకటి చెప్పి మరొకటి చేసిన చరిత్ర వారికి ఉంది. అయితే ప్రధాని మోదీ, బీజేపీ చరిత్ర వేరు. బీజేపీ కానీ, ప్రధాని మోదీ కానీ ఏదైనా చెప్పారంటే.. అది రాతిలో చెక్కినట్లే. మోదీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం’’ అన్నారు.
టాపిక్