US vs China: ‘అమెరికా 10సార్లు పంపింది’: అగ్రరాజ్యం, చైనా మధ్య ముదురుతున్న బెలూన్ల పంచాయితీ
US vs China: తమ దేశ గగనతలంలోకి అమెరికా 10సార్లకు పైగా అక్రమంగా బెలూన్లను పంపిందని చైనా తాజాగా ఆరోపించింది. ఈ నిఘా బెలూన్ల (Spy Balloon) విషయంలో ఇరు దేశాల మధ్య వివాదం మరింత ముదురుతోంది.
US vs China Balloon: అమెరికా, చైనా మధ్య నిఘా బెలూన్ల (Spy Balloon) వివాదం నానాటికీ ముదురుతోంది. ఈ నెల మొదట్లో తమ దేశ గగనతలంలో విహరిస్తున్న చైనాకు చెందిన ఓ బెలూన్‍ను యుద్ధ విమానంతో కూల్చివేసింది అమెరికా. దీనిపై డ్రాగన్ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా అగ్రరాజ్యంపై చైనా మరిన్ని ఆరోపణలు చేసింది. 2022 జనవరి నుంచి తమ దేశ గగనతలంలోకి అమెరికా 10సార్లకు పైగా బెలూన్లను పంపిందని చైనా సోమవారం (ఫిబ్రవరి 13) ఆరోపించింది.
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత
US vs China Balloons: చైనాకు చెందిన ఓ బెలూన్‍ను కరోలినా ప్రాంతంలో అమెరికా కుప్పకూల్చింది. అమెరికా గగనతలంలోకి వచ్చిన దాన్ని యుద్ధ విమానంతో పేల్చేసింది. అయితే అది సివిలియన్ బెలూన్ అని, వాతావరణ అధ్యయనం కోసం పంపిందని చైనా చెప్పింది. అమెరికా, కెనడా గగనతలంలో మరిన్ని బెలూన్లను అగ్రరాజ్యం గుర్తించి, కుప్పకూల్చిందని తెలుస్తోంది. అయితే తొలి బెలూన్ మాత్రమే తమది అని ఇంత వరకు చైనా స్పందించింది. తాజాగా ఈ విషయంపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి.. మీడియాతో మాట్లాడారు.
అమెరికాకు అలవాటే!
US vs China: వేరే దేశాల గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించడం అమెరికాకు అలవాటే అనేలా చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెబిన్ పేర్కొన్నారు. “ఇతర దేశాల గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించడం అమెరికాకు అసాధారణం కాదు. గతేడాది నుంచి చైనాపై అమెరికా అక్రమ బెలూన్లు తిరిగాయి. చైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా 10సార్లకుపైగా ఇలా జరిగింది” అని ఆయన తెలిపారు. అమెరికా ఉల్లంఘనల పట్ల చైనా ఎంతో బాధ్యతాయుతంగా, హుందాగా ప్రతిస్పందించిందని ఆయన అన్నారు.
US vs China: చైనాపై విహరించిన అక్రమ బెలూన్ల గురించి మరింత సమాచారం కావాలంటే అమెరికానే అడగాలని చెప్పారు.
US vs China: ఈ నెల 4వ తేదీన దక్షిణ కరోలినా సమీపంలో ఎఫ్-22 యుద్ధ విమానంతో చైనా నిఘా బెలూన్‍ను అమెరికా కుప్పకూల్చింది. సముద్ర జలాల్లో పడే విధంగా దీన్ని కూల్చివేసింది. ఆ తర్వాత బెలూన్ శిథిలాలను సేకరించింది. అనంతరం గగనతలంలో మరిన్నింటిని అమెరికా కూల్చినట్టు సమాచారం. అయితే మొదటి బెలూన్ తమదేనని మాత్రమే చైనా ఇప్పటి వరకు చెప్పింది. తమ సైనిక స్థావరాలపై నిఘా ఉంచేందుకే చైనా బెలూన్లను పంపుతోందని అమెరికా అనుమానిస్తోంది.
సంబంధిత కథనం