Pune man sets 8 bikes ablaze: భార్యపై కోపంతో 8 బైక్స్ ను తగలబెట్టాడు..
Pune crime news: భార్యపై కోపంతో ఇరుగుపొరుగు వారి బైక్ లను తగలబెట్టాడో పుణె వాసి. అందులో భార్య టూ వీలర్ కూడా ఉంది. ప్రస్తుతం ఊచలు లెక్కపెడ్తున్నాడు.
Pune crime news: పుణెకు (Pune) చెందిన ఒక వ్యక్తి తన భార్యపై కోపంతో ఎనిమిది బైక్ లను తగలబెట్టాడు. ముందుగా, తన భార్య టూ వీలర్ ను తగలబెట్టి, ఆ తరువాత దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి మిగతా బైక లను కూడా తగల బెట్టాడు.
Pune crime news: భార్య విడాకులు ఇస్తోందని..
పుణె (Pune)లోని ఖొండ్వా ప్రాంతానికి చెందిన తెరియన్స్ డొమ్నిక్ జాన్ కు తరచు భార్యతో గొడవలు అవుతుంటాయి. విసిగిపోయిన భార్య జాన్ కు విడాకుల నోటీసు పంపించింది. దాంతో, మరింత ఆగ్రహానికి లోనైన తెరియన్స్ డొమ్నిక్ జాన్.. భార్యపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుని.. మంగళవారం తెల్లవారు జామున వారుంటున్న భవనం కింద పార్క్ చేసిన తన భార్య టూ వీలర్ పై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఒకటే వాహనం తగలబడితే తనపై అనుమానం వస్తుందన్న భయంతో.. పక్కనే పార్క్ చేసి ఉన్న ఇరుగుపొరుగు వారి బైక్ లపై కూడా పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో మొత్తం 8 బైక్స్ తగలబడ్డాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు జరిపి ఈ పనికి పాల్పడింది తెరియన్స్ డొమ్నిక్ జాన్ యేనని తేల్చారు. ఎక్కడ దాక్కున్నాడో ట్రేస్ చేసి సోమవారం సాయంత్రానికి అరెస్ట్ చేశారు. కుటుంబ గొడవలతో ఫ్రస్ట్రేషన్ కు గురై ఈ పని చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ 435 సెక్షన్ కింద అతడిపై కేసు నమోదు చేశామన్నారు.