Fight in wedding : చికెన్​ బిర్యానీలో లెగ్​ పీస్​ లేదని.. పెళ్లి మండపంలో అరగంట కొట్టుకున్నారు!-up wedding guests punch kick maul each other over missing leg piece in biryani ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Fight In Wedding : చికెన్​ బిర్యానీలో లెగ్​ పీస్​ లేదని.. పెళ్లి మండపంలో అరగంట కొట్టుకున్నారు!

Fight in wedding : చికెన్​ బిర్యానీలో లెగ్​ పీస్​ లేదని.. పెళ్లి మండపంలో అరగంట కొట్టుకున్నారు!

Sharath Chitturi HT Telugu

Wedding fight in UP viral video : బిర్యానీలో లెగ్ పీస్ కనిపించడం లేదంటూ వధూవరుల బంధువల మధ్య గొడవ జరగింది. అరగంట పాటు కొట్టుకున్నారు! అసలేం జరిగిందంటే..

చికెన్​ బిర్యానీలో లెగ్​ పీస్​ లేదని గొడవ.. (X/@rahulroushan)

Fight for Chicken biryani in marriage : ఉత్తరప్రదేశ్​లోని బరేలీలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. బిర్యానీ విషయంలో వధూవరుల కుటుంబాల మధ్య గొడవ జరగడంతో ఓ పెళ్లి గందరగోళంగా మారింది. తమకు వడ్డించిన బిర్యానీలో ఒక్క చికెన్ లెగ్ పీస్ కూడా లేదని వరుడి తరఫు బంధువులు కోపం తెచ్చుకున్నారు. గొడవ పెరిగి, చివరికి రెండు వర్గాల వారు దారుణంగా కొట్టుకునే పరిస్థితికి చేరింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్​ మీడియాలు వైరల్​ అయ్యాయి.

ఇదీ జరిగింది..

ఈ ఘటన.. ఉత్తరప్రదేశ్​లోని నవాబ్ గంజ్ సర్తాజ్ మ్యారేజ్ హాల్​లో చోటుచేసుకుంది. తొలుత.. బిర్యానీలో లెక్​ పీస్​ లేదని వరుడి తరఫు బంధువులు అసహనం వ్యక్తం చేశారని సమాచారం. వధువు తరఫు వారికి అది నచ్చలేదు! అసభ్య పదజాలంతో దూషించారు. బిర్యానీ విషయంలో ఇరు కుటుంబాల మధ్య జరిగిన వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పెళ్లికి వచ్చిన అతిథులు చాలా మంది గొడవలో పాల్గొన్న దృశ్యాలు.. సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

ఈ వీడియోలో అతిథులు ఒకరినొకరు విచక్షణారహితంగా తన్నుకోవడం, గుద్దుకోవడం, కొట్టుకోవడం కనిపిస్తుంది. ఒకానొక సమయంలో ఓ వ్యక్తి ప్లాస్టిక్ కుర్చీని మరొకరిపై విసిరాడు. అసభ్య పదజాలంతో తిట్టుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఎక్స్​లో వేలాది మంది వీక్షించారు. వీటికి విస్తృతంగా ప్రచారం జరిగింది!

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి..

పురుషులు గుంపులుగా వచ్చి గొడవ పడుతుండటంతో మహిళలు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ గందరగోళానికి ముగింపు పలికేందుకు ఎవరూ ప్రయత్నించినట్టు కనిపించకపోవడం గమనార్హం. పెళ్లి మండపంలో అరగంట పాటు ఈ గొడవ జరిగింది. ఇంతలో.. పోలీసులను పిలవాలా? వద్దా? అని చాలా మంది ఆలోచించారు.

చివరకు వరుడు రంగంలోకి దిగి తాను పెళ్లి చేసుకోనని ప్రకటించాడు. ఆ మాటలతో.. అప్పటివరకు గందరగోళంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా నిశ్సబ్దం అలుముకుంది.

అయితే.. అప్పటివరకు కొట్లాటకు దిగిన వధువు తరఫు కుటుంబం.. ఆ తర్వాత వరుడిని బుజ్జగించే పనిలో పడింది. చివరికి.. ఏదో ఒక విధంగా నచ్చజెప్పి.. పెళ్లి జరిపించారు. సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఈ జంట కొత్త ఇంటికి వెళ్లింది. అతిథులు కూడా భోజనం చేసి తమ ఇళ్లకు వెళ్లిపోయారు.

ఇలా.. పోలీసుల ప్రమేయం లేకుండా.. పని పూర్తైంది.

ఈ దృశ్యలపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ‘ఛ! వీళ్లకి గొడవపడటానికి ఏదో ఒక కారణం కావాలి,’ అని ఒకరు కామెంట్​ చేయగా.. ‘ఈ గొడవకు కూడా మోదీని రాజీనామా చేయమంటారా?’ అని మరొకరు అన్నారు. “అంత పెళ్లి చేసి, బిర్యానీ ఎక్కువగా వండలేరా?” అని మరొకరు అభిప్రాయపడ్డారు. “ఇక్కడ గొడవపడిన వాళ్లందరు.. ఇళ్లకు వెళ్లి నీట్​ రద్దుపై ట్వీట్లు పెడతారు,” అని ఇంకొకరు కామెంట్​ చేశారు.

“ఇండియా కూటమికి కాస్త పవర్​ వచ్చిన తర్వాత.. దేశానికి ఏమవుతుందో అని భయపడ్డాను. కానీ ఇలా బిర్యానీలో చికెన్​ లెగ్​ పీస్​ కోసం గొడవపడుతుండటం చూసి.. ప్రశాంతంగా ఉంది. అనుకున్న విధంగానే మనం అభివృద్ధి చెందుతున్నాము,” అని మరొకర వ్యంగ్యాస్తరాలు సంధించారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.