Mahakumbh Stampede : కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. బాధితులకు 25 లక్షల చొప్పున ప్రకటించిన యోగి ప్రభుత్వం
Mahakumbh Stampede : మహాకుంభ మేళా తొక్కిసలాట ఘటన మృతి చెందిన వారి సంఖ్యను అధికారులు ధృవీకరించారు. కనీసం 30 మంది మరణించినట్టుగా ప్రకటించారు.
బుధవారం తెల్లవారుజామున మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 30 మంది మరణించారు. 60 మంది గాయపడ్డారు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఇన్ జనరల్ వైభవ్ కృష్ణ ప్రయాగ్‌రాజ్‌లో విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ధృవీకరించారు. మృతుల్లో 25 మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 36 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మిగిలిన వారిని వారి కుటుంబాలతో పంపించారు.
30 మంది మృతి
భక్తుల తోపులాట కారణంగా ఈ సంఘటన అర్ధరాత్రి 1 గంటల నుంచి 2 గంటల మధ్య జరిగింది. జనం బారికేడ్లను దూకి అవతలి వైపునకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. 90 మందికి పైగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో 30 మంది మరణించారని విలేకరుల సమావేశంలో డీఐజీ చెప్పారు.
ప్రాణనష్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారు. గణాంకాలను విడుదల చేయడానికి అధికారులు 16 గంటలకు పైగా సమయం తీసుకున్నారు. ఈ సంఘటనను అత్యంత విచారకరం అని, ప్రధాని మోదీ సంతాపాన్ని తెలిపారు.
25 లక్షల ఆర్థిక సాయం
ఊరేగింపు కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను యాత్రికులు దూకేందుకు ప్రయత్నించినప్పుడు తొక్కిసలాట జరిగిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ టెలివిజన్ ప్రకటనలో తెలిపారు. మహాకుంభ మేళా-2025 తొక్కిసలాటపై న్యాయ విచారణను యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్‌కు నెల రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. 'ఈ సంఘటన హృదయ విదారకమే కాదు మాకు పాఠం కూడా.' అని యోగి ఉద్వేగభరితంగా మాట్లాడారు.
రిటైర్డ్ జస్టిస్ హర్ష్ కుమార్ నేతృత్వంలోని జ్యుడీషియల్ ప్యానెల్‌లో మాజీ డీజీపీ వీకే గుప్తా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డీకే సింగ్ ఉన్నారు. తొక్కిసలాటకు గల కారణాలు, పరిస్థితులను పరిశోధించడంతోపాటు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని న్యాయ కమిషన్‌కు బాధ్యతలు అప్పగించినట్లు యోగి తెలిపారు.
ప్రత్యక్ష సాక్షి ఏమన్నాడంటే
'అకస్మాత్తుగా గుంపులో తోపులాట జరిగింది. మేము చిక్కుకుపోయాం. మాలో చాలా మంది కింద పడిపోయారు. గుంపు అదుపు లేకుండా పోయింది. దీంతో తొక్కిసలాట జరిగింది. బయటకు వెళ్లే అవకాశం లేదు, అన్ని వైపుల నుండి నెట్టడం జరిగింది.' అని ప్రత్యక్షసాక్షి సరోజిని చెప్పారు.
నలుగురు బెలగావి భక్తులు మృతి
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో బెలగావికి చెందిన కనీసం నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని కర్ణాటక పోలీసులు బుధవారం ధృవీకరించారు. బెలగావి జిల్లా కమిషనర్ మహ్మద్ రోషన్ మరణాల గురించి ప్రకటించారు. ఫోన్‌లో మీడియాకు తెలిపారు. మృతదేహాలను తిరిగి తీసుకురావడానికి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లేందుకు సీనియర్ జిల్లా అధికారి, పోలీసు అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.