Crime news : అమానవీయం! కట్నం ఇవ్వలేదని.. కోడలికి హెచ్​ఐవీ సిరంజిని ఇంజెక్ట్​ చేసి..-up horror in laws inject woman with hiv infected syringe over dowry demands ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : అమానవీయం! కట్నం ఇవ్వలేదని.. కోడలికి హెచ్​ఐవీ సిరంజిని ఇంజెక్ట్​ చేసి..

Crime news : అమానవీయం! కట్నం ఇవ్వలేదని.. కోడలికి హెచ్​ఐవీ సిరంజిని ఇంజెక్ట్​ చేసి..

Sharath Chitturi HT Telugu

కట్నం ఇవ్వలేదన్న కారణంతో ఓ మహిళకు, ఆమె భర్త తరఫు కుటుంబసభ్యులు హెచ్​ఐవీ సోకిన సిరంజిని ఇంజెక్ట్​ చేశారు! నిందితులపై కేసు నమోదు చేయాలని యూపీ కోర్టు పోలీసులకు ఆదేశాలిచ్చింది.

వరకట్నం వేధిపులు- మహిళకు హెచ్​ఐవీ సిరంజిని ఇంజెక్ట్​ చేసి..!

ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఒక అత్యంత అమానవీయ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం ఇవ్వలేదన్న కోపంతో ఓ మహిళకు, ఆమె భర్త తరఫు కుటుంబసభ్యులు హెచ్​ఐవీ సోకిన సిరంజితో ఇంజెక్షన్​ ఇచ్చారు. ఆ తర్వాత, ఆమెకు హెచ్​ఐవీ సోకిందని ఆ మహిళ తండ్రి చెప్పారు. అత్తమామలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఉత్తర్​ప్రదేశ్​లోని సహరన్​పూర్ కోర్టు యూపీ పోలీసులను ఆదేశించింది.

ఇదీ జరిగింది..

గతేడాది మే నెలలో హరిద్వార్​లోని అత్తారింట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రులు ఉత్తర్​ప్రదేశ్​ మీరట్​లో నివాసముంటారు. 2023 ఫిబ్రవరిలో తన కుమార్తెకు వివాహం చేసినట్లు బాధితురాలి తండ్రి కోర్టుకు తెలిపారు. పెళ్లి కోసం దాదాపు రూ.45 లక్షలు ఖర్చు చేశానని వివరించారు. వరుడి కుటుంబానికి సబ్ కాంపాక్ట్ ఎస్​యూవీ, రూ.15 లక్షల నగదు ఇచ్చామని తెలిపారు.

అయితే హరిద్వార్​లోని అత్తారింటికి మహిళ వెళ్లినప్పటి నుంచి ఆమెను భర్త తరఫు కుటుంబసభ్యులు వేధించడం మొదలుపెట్టారు. మరింత కట్నం తీసుకురావాలని డిమాండ్​ చేశారు. రూ.10 లక్షల అదనపు కట్నం, పెద్ద ఎస్​యూవీ తీసుకొచ్చేంత వరకు హింసిస్తూనే ఉంటామని బెదిరించారు.

ఆ విషయం బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పి విలపించింది. కానీ వారు అదనపు కట్నం సమకూర్చడంలో విఫలమయ్యారు.ఈ నేపథ్యంలోనే గతేడాది మే నెలలో 30 ఏళ్ల మహిళకు ఆమె అత్తమామలు హెచ్ఐవీ సోకిన సిరంజి ఇంజెక్ట్ చేశారు. 

తన కుమార్తెకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, “పెళ్లయిన వెంటనే అత్తమామలు ఆమెను వేధించడం ప్రారంభించారు. 2023 మార్చి 25న ఇంటి నుంచి గెంటేశారు. మూడు నెలల పాటు నా కూతురు మాతోనే ఉంది. పంచాయతీ జోక్యం చేసుకోవడంతో మళ్లీ అత్తారింటికి వెళ్లింది. కానీ ఆమెకు హెచ్​ఐవీ సిరంజి ఇచ్చారు,” అని చెప్పుకొచ్చారు.

2024 మేలో ఆమె అత్తమామలు ఆమెకు బలవంతంగా హెచ్ఐవీ సోకిన సిరంజి ఇంజెక్ట్ చేశారని, ఆ తర్వాత ఆమె ఆరోగ్యం వేగంగా క్షీణించిందని మహిళ తండ్రి తెలిపారు.

వైద్య పరీక్షల్లో తన కుమార్తెకు హెచ్ఐవీ పాజిటివ్ అని తేలిందని చెప్పిన బాధితురాలి తండ్రి.. ఆమె భర్తకు నెగెటివ్ వచ్చిందని వెల్లడించారు.

కూతురు అత్తారింటి వారిపై ఫిర్యాదు చేయాలని ఆ తండ్రి నిర్ణయించుకున్నారు. అయితే తమ ఫిర్యాదును పోలీసులు, ఎస్ఎస్పీ పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. అనంతరం కుటుంబ సభ్యులు కోర్టులో చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.