చపాతీలు పెట్టడం లేదని పెళ్లి మధ్యలో లేచి వెళ్లిపోయిన వరుడు- చివరికి మరో అమ్మాయితో..-up groom abandons wedding over delay in serving roti marries another girl ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  చపాతీలు పెట్టడం లేదని పెళ్లి మధ్యలో లేచి వెళ్లిపోయిన వరుడు- చివరికి మరో అమ్మాయితో..

చపాతీలు పెట్టడం లేదని పెళ్లి మధ్యలో లేచి వెళ్లిపోయిన వరుడు- చివరికి మరో అమ్మాయితో..

Sharath Chitturi HT Telugu
Dec 28, 2024 02:44 PM IST

యూపీలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్​గా మారింది. భోజనంలో చపాతీలు పెట్టడం ఆలస్యమవుతోందన్న కారణంతో ఓ వరుడు పెళ్లి మండపాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఆగిపోయిన పెళ్లిలోని వధువు కుటుంబానికి తెలిసింది. వారేం చేశారంటే..

చపాతీలు పెట్టడం లేదని పెళ్లిలో లేచి వెళ్లిపోయిన వరుడు
చపాతీలు పెట్టడం లేదని పెళ్లిలో లేచి వెళ్లిపోయిన వరుడు (Pixabay)

ఉత్తర్​ప్రదేశ్​లో వింత విచిత్ర ఘటనలు జరుగుతూ ఉంటాయి. చందౌలి జిల్లాలో తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. చపాతీలు పెట్టడం ఆలస్యమైందన్న కారణంతో ఓ పెళ్లి ఆగిపోయింది! వరుడు కుటుంబసభ్యులు పెళ్లి మండపాన్ని వదిలేసి వెళ్లిపోయారు. కానీ ఆ తర్వాత ఆ వరుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు.

yearly horoscope entry point

ఇదీ జరిగింది..

చందౌలి జిల్లా హమీద్​పూర్ గ్రామంలో ఈ నెల 22న ఈ ఘటన జరిగింది. పెళ్లి భోజనంలో ఆలస్యంగా చపాతీ (రోటీ) వడ్డించారని వరుడు మెహతాబ్, అతని బంధువులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

వారిని భుజ్జగించేందుకు వధువు తరఫు కుటుంబం విశ్వప్రయత్నం చేసింది. కానీ అవేవీ పట్టించుకోకుండా వరుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఈ కథ ఇక్కడితో ముగియలేదు! వరుడి కుటుంబం రాత్రి ఇంటికి వెళ్లిపోయింది. కానీ రాత్రి సమయంలో వరుడు కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత.. తన బంధువుల్లోని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు.

ఈ విషయం ఆగిపోయిన పెళ్లికి సంబంధించిన వధువు కుటుంబానికి తెలిసింది. వారు కోపంతో ఊగిపోయారు. అసలు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మెహతాబ్​పై జిల్లాలోని ఇండస్ట్రియల్ నగర్ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు నమోదైంది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వధువు కుటుంబ సభ్యులు డిసెంబర్ 24న పోలీసు సూపరింటెండెంట్​ను ఆశ్రయించారు.

వరుడి వైపు నుంచి ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వధువు కుటుంబ సభ్యులు సీనియర్ పోలీసు అధికారిని కోరారు. తగిన చర్యలు తీసుకుంటామని ఎస్​పీ హామీ ఇచ్చారని, కుటుంబ సభ్యులను సంప్రదించాలని పోలీసులను ఆదేశించినప్పటికీ తమకు ఫోన్ రాలేదని వధువు సోదరుడు రాజు తెలిపారు.

అయితే, పెళ్లికి రూ.7 లక్షల వరకు ఖర్చు చేశామని, అందులో రూ.1.5 లక్షలు కట్నంగా వరుడి ఇంటికి పంపించామని కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే వరకట్నం ఇవ్వడం, స్వీకరించడం లేదా సహాయం చేసే ఎవరైనా శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని 1961 వరకట్న నిషేధ చట్టం స్పష్టం చేస్తోంది. కనీసం రూ.15,000 జరిమానా లేదా కట్నం విలువలో ఏది ఎక్కువైతే అది జరిమానాతో పాటు కనీసం ఐదేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. వరకట్నం ఆచారాన్ని అరికట్టడం, దీనికి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా చూడటం ఈ చట్టం ఉద్దేశం.

హనీమూన్​ విషయంలో విభేధాలు..

హనీమూన్​ విషయంలో విభేదాలు ఎదురవ్వడంతో వరుడిపై వధువు తండ్రి యాసిడ్​ దాడి చేసిన ఘటన ముంబైలో ఇటీవలే తీవ్ర కలకలం సృష్టించింది. హనీమూన్​ కోసం కశ్మీర్​ వెళదామని వరుడు చెబితే.. మక్కాకు తీసుకెళ్లాలని వధువు తరఫు కుటుంబసభ్యులు పట్టుబట్టారు. ఈ వ్యవహారం గొడవకు దారి తీసింది. చివరికి వరుడిపై వధువు తండ్రి యాసిడ్​ దాడి చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.