ఉత్తర్ ప్రదేశ్‌లో కొన్ని నెలల క్రితం కలకలం రేపిన సౌరభ్ రాజ్పుట్ మర్డర్ కేసు తరహాలో, అదే రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బల్లియాలో ఓ వ్యక్తిని అతని భార్య, ఆమె ప్రియుడు చంపేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికారు.
ఉత్తర్‌ప్రదేశ్ హరిపూర్‌లో జీవించే 62ఏళ్ల దేవేంద్ర రామ్ ఒక మాజీ సైనికుడు. అతని భార్య పేరు మాయ. కాగా, మాయకు వివాహేతర బంధం ఉంది. ఆమె లవర్ పేరు అనిల్ యాదవ్. తమ ప్రేమకు దేవేంద్ర అడ్డుగా ఉన్నాడని, ఆ అడ్డును తొలగించుకోవాలని మాయ- అనిల్‌లు భావించారు. దేవేంద్రను చంపడానికి ప్లాన్ చేశారు.
గత శుక్రవారం రాత్రి మాయ, దేవేంద్ర తినే ఆహారంలో మత్తుమందు కలిపింది. ఆయన అపస్మారక స్థితిలోకి జారుకున్న తర్వాత, మాయ తన భర్తను చంపేసింది. అనంతరం మాయ, అనిల్‌లు మృతదేహాన్ని ఆరు భాగాలుగా ముక్కలు ముక్కలు చేసి పాలిథీన్ బ్యాగుల్లో పెట్టారు. ఎవరు గుర్తించకుండా ఉండేందుకు, ఆ బ్యాగులను వేరువేరు చోట్ల పడేశారు. ఇందుకోసం అనిల్ యాదవ్ సహచరులు సతీశ్ యాదవ్, మిథిలేష్ యాదవ్‌లు సైతం సహకరించారు.
తన భర్త కనిపించడం లేదంటూ మరుసటి రోజు, అంటే మే 10న మాయ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తన కూతురిని ఇంటికి తీసుకొచ్చేందుకు రైల్వే స్టేషన్‌కి వెళ్లి దేవేంద్ర, ఇంటికి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొంది.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంతలో సికిందరపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పడి ఉన్న ఓ బ్యాగులో ఓ వ్యక్తి శరీర భాగం కనిపించింది. అది దేవేంద్రదే అని నిర్థరణ అయ్యింది. ఇక సోమవారం, దేవేంద్ర మొండెం కూడా అధికారులు గుర్తించారు.
ఘటనపై మర్డర్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా, దేవేంద్ర భార్య మయపై అనుమానాలు పెరిగాయి. దేవేంద్ర ఫోన్ కూడా ఇంట్లోనే ఉండటంతో మాయను విచారించారు. ఆమె నేరాన్ని అంగీకరించింది. లవ్ ఎఫైర్ కారణంగా మరో ప్రాణం బలైపోయిందని పోలీసులకు తెలిసింది.
ప్రేమకు అడ్డొస్తున్నాడన్న కారణంతో భర్తను తానే చంపినట్టు మహిళ ఒప్పుకుంది. ఈ క్రమంలోనే అనిల్ యాదవ్‌తో పాటు అతని ఇద్దరు సహచరుల పేర్లు కూడా బయటపెట్టింది. వారందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరానికి రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను కోర్టులో హాజరుపరచిన పోలీసులు, అనంతరం వారిని జైలుకు తరలించారు.
ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
మార్చ్ నెలలో సౌరభ్ రాజ్పుట్ అనే నేవీ అధికారిని, అతని భార్య ముస్కాన్, తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. అనంతరం డ్రమ్‌లో మృతదేహాన్ని పెట్టి సిమెంట్ పోసి కప్పేసింది. ఆ తర్వాత ప్రేమికులు ఇద్దరు విహారయాత్రలకు కూడా వెళ్లారు. చివరికి పోలీసులకు దొరికిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
సంబంధిత కథనం