భార్య ఇష్టానికి వ్యతిరేకంగా అసహజ శృంగారం చేయడంపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు-unnatural sex against wifes will is cruelty but rules madhya pradesh high court ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  భార్య ఇష్టానికి వ్యతిరేకంగా అసహజ శృంగారం చేయడంపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు

భార్య ఇష్టానికి వ్యతిరేకంగా అసహజ శృంగారం చేయడంపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు

Sudarshan V HT Telugu

ఐపీసీ 376/377 సెక్షన్ ప్రకారం భార్యతో అసహజ శృంగారం నేరం కాదని, కానీ, అందులో హింస, శారీరక వేధింపులు ఉంటే మాత్రం అది నేరంగా పరగణించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది.

అసహజ శృంగారం చేయడంపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు (Pixabay/Representative)

భార్యకు ఇష్టం లేకుండా, ఆమెపై అసహజ లైంగిక చర్యకు బలవంతం చేయడం, ఆమెపై శారీరకంగా దాడి చేయడం, క్రూరంగా వ్యవహరించడం వంటి వాటిని ఐపీసీ సెక్షన్ 498ఎ కింద నేరంగా పరిగణించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుత భారత చట్టాల ప్రకారం 'వైవాహిక అత్యాచారం' శిక్షార్హమైన నేరం కానందున సెక్షన్ 377 లేదా 376 కింద భర్తను ప్రాసిక్యూట్ చేయలేమని స్పష్టం చేసింది. అనంతరం, భర్తపై ఓ మహిళ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను కోర్టు సమర్థించింది.

ఈ సెక్షన్ల కింద నేరం కాదు..

పోలీసులు ఆ భర్తపై సెక్షన్ 377 (అసహజ నేరాలు), 323 (కావాలని గాయపరచడం), 498 ఎ (భర్త లేదా బంధువుల క్రూరత్వం) కింద అభియోగాలు మోపారు. భార్యతో అసహజ శృంగారం భారత చట్టాల ప్రకారం నేరం కాదని వాదిస్తూ భర్త ఆ ఎఫ్ఐఆర్ ను సవాలు చేశాడు. ఫిర్యాదులో వరకట్నానికి సంబంధించిన ఆరోపణలేవీ లేనందున సెక్షన్ 498ఏ వర్తించదని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు.

కోర్టు ఏం చెప్పింది?

భార్యతో అసహజ శృంగారం ఐపీసీ సెక్షన్ 376, 377 ప్రకారం నేరం కానప్పటికీ, హింస, శారీరక వేధింపులకు పాల్పడితే క్రూరత్వం కిందకు వస్తుందని మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ జీఎస్ అహ్లువాలియా తన తీర్పులో పేర్కొన్నారు. ‘‘భార్య ఇష్టానికి వ్యతిరేకంగా, ఆమె ప్రతిఘటించినప్పటికీ అసహజ శృంగారంలో పాల్గొనడం, ఆమెపై దాడి చేయడం, శారీరక హింసకు పాల్పడడం కచ్చితంగా క్రూరత్వం నిర్వచనం కిందకే వస్తుంది. వరకట్నం డిమాండ్ ఒక్కటే 498ఏ సెక్షన్ కింద క్రూరత్వంగా పరిగణించాలనడం సరికాదు’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

ఇవి కూడా క్రూరత్వమే

మహిళను ఆత్మహత్యకు ప్రేరేపించే లేదా మానసికంగా లేదా శారీరకంగా స్త్రీకి తీవ్రమైన గాయం లేదా ప్రాణానికి, అవయవానికి లేదా ఆరోగ్యానికి తీవ్రమైన గాయం లేదా ప్రమాదాన్ని కలిగించే ఏదైనా ఉద్దేశపూర్వక ప్రవర్తన క్రూరత్వం కిందకు వస్తుందని ఐపీసీ సెక్షన్ 498ఏను చదవడం ద్వారా స్పష్టమవుతుందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సెక్షన్ 377 కింద అభియోగాన్ని కోర్టు కొట్టివేసినప్పటికీ, ఇతర నిబంధనల ప్రకారం ముందుకు సాగడానికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొంది. పిటిషనర్ అసహజ ప్రవర్తనను భార్య ప్రతిఘటించినప్పుడల్లా ఆమెపై దాడి చేసి, శారీరక క్రూరత్వంతో హింసించారని నిర్దిష్ట ఆరోపణలు ఉన్నందున, సెక్షన్ 498 ఎ ఐపిసి కింద నేరం జరిగిందని ఈ కోర్టు అభిప్రాయపడింది' అని హైకోర్టు తెలిపింది. అనంతరం, సెక్షన్ 377 కింద నేరం కొట్టివేసి, సెక్షన్ 498ఏ, 323 కింద నమోదైన ఎఫ్ఐఆర్ ను పరిగణనలోకి తీసుకుంది.

చత్తీస్ గఢ్ హైకోర్టు తీర్పు

వయోజన భార్యతో అసహజంగా లైంగిక చర్యకు పాల్పడినందుకు భర్తపై అత్యాచారం లేదా అసహజ శృంగారం కింద ప్రాసిక్యూట్ చేయలేమని ఈ ఫిబ్రవరి లో చత్తీస్ గఢ్ హైకోర్టు పేర్కొంది. 2017 డిసెంబర్ 11న ఓ వ్యక్తి తన భార్య ఇష్టానికి వ్యతిరేకంగా అసహజ శృంగారంలో పాల్గొన్నాడు. ఆ లైంగిక చర్యలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తన భర్త బలవంతపు లైంగిక చర్య కారణంగానే తనకు గాయాలయ్యాయని ఆమె తన మరణ వాంగ్మూలంలో ఆరోపించింది. పెరిటోనిటిస్, మల రంధ్రాల కారణంగా ఆమె మరణించినట్లు వైద్యులు గుర్తించారు. అయినప్పటికీ, భారతీయ చట్టాల ప్రకారం, మేజర్ అయిన భార్యతో లైంగిక చర్యను అత్యాచారంగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. వివాహంలో అసహజ శృంగారాన్ని నేరంగా పరిగణించలేమని తేల్చి చెప్పింది. ట్రయల్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించిన భర్త హైకోర్టు తీర్పుతో నిర్దోషిగా విడుదలయ్యాడు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.