Madhya Pradesh High Court: భర్త తన భార్యతో అసహజ శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారంగా పరిగణించబడదని, అలాంటి సందర్భంలో భార్యను వివాహం చేసుకున్నందున ఆమె సమ్మతి ముఖ్యం కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అసహజ శృంగారంలో పాల్గొన్నాడని ఆరోపిస్తూ భార్య తన భర్తపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను మధ్యప్రదేశ్ హైకోర్టు (Madhya Pradesh High Court) కొట్టివేసింది.
చట్టబద్ధంగా పెళ్లైన భార్యతో భర్త అసహజ శృంగారం (unnatural sexual intercourse) చేయడం ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం నేరం కాదని నిర్ధారణకు వచ్చిన తర్వాత, ఇతర పనికిమాలిన ఆరోపణల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారా లేదా అనే దానిపై తదుపరి చర్చలు అవసరం లేదని ఈ కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ జీఎస్ అహ్లూవాలియా అభిప్రాయపడ్డారు
భారతదేశంలో 'మారిటల్ రేప్ (Marital rape) 'ను ఇంకా నేరంగా గుర్తించలేదని మధ్య ప్రదేశ్ హై కోర్టు వ్యాఖ్యానించింది. వైవాహిక అత్యాచారాన్ని భారత్ లో నేరంగా ఇంతవరకు గుర్తించలేదు కనుక జబల్పూర్లోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నెం.377/2022లో ఎఫ్ఐఆర్, దరఖాస్తుదారుడి (భర్త) క్రిమినల్ ప్రాసిక్యూషన్ ను రద్దు చేస్తున్నామని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ చట్టానికి మినహాయింపు ఐపీసీ సెక్షన్ 376-బి మాత్రమేనని, న్యాయపరమైన ఆదేశాల కారణంగా.. వేరుగా నివసిస్తున్న భార్యతో లైంగిక చర్యకు పాల్పడడం అత్యాచారంగా పరిగణిస్తామని కోర్టు తెలిపింది. అలాగే, సెక్షన్ 375ను ప్రస్తావిస్తూ 15 ఏళ్లు నిండిన భార్యతో భర్త శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం కిందకు రాదని కోర్టు స్పష్టం చేసింది.
లైవ్ లా నివేదిక ప్రకారం.. జూన్ 06, 2019, జూన్ 07, 2019 మధ్య రాత్రి, తన భర్త తనతో అసహజ శృంగారా (unnatural sexual intercourse) నికి పాల్పడ్డారని అతడి భార్య తన భర్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పలు సందర్భాల్లో అసహజ శృంగారాన్ని కొనసాగించాడని తెలిపింది. భార్య దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను సవాలు చేస్తూ ఆ భర్త హైకోర్టును ఆశ్రయించాడు. తన భార్యతో అసహజ శృంగారం ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం నేరం కాదని వాదించాడు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని ఆ వ్యక్తి కోర్టును కోరాడు.