US on India-China Clash: భారత్, చైనా ఘర్షణపై స్పందించిన అమెరికా-united states reacts to india china clash in tawang know what white house say ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  United States Reacts To India China Clash In Tawang Know What White House Say

US on India-China Clash: భారత్, చైనా ఘర్షణపై స్పందించిన అమెరికా

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 14, 2022 06:53 AM IST

US Response on India-China Clash in Tawang: తవాంగ్ వద్ద భారత్, చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణపై అమెరికా స్పందించింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాంటూ.. రెండు దేశాలకు ఓ సూచన చేసింది.

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వద్ద భారత సైనికులు
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వద్ద భారత సైనికులు (PTI)

US Reacts to India-China Clash in Tawang: భారత్, చైనా దళాల మధ్య అరుణాచల్ ప్రదేశ్‍లోని తవాంగ్ వద్ద జరిగిన ఘర్షణపై అగ్రరాజ్యం అమెరికా ఎట్టకేలకు స్పందించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు త్వరగా ముగియడం సంతోషకరమని శ్వేతసౌధం వ్యాఖ్యానించింది. పరిస్థితులను అమెరికా నిశితంగా పరిశీలిస్తోందని వైట్ హౌస్ (White House) ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పీయెర్ (Karine Jean-Pierre) అన్నారు. మరోవైపు, ఉద్రిక్తత సద్దుమణిగేందుకు ఇండియా తీసుకున్న చర్యలకు తమ మద్దతు ఉంటుందని పెంటగాన్ చెప్పింది. పూర్తి వివరాలు ఇవే..

ట్రెండింగ్ వార్తలు

రెండు దేశాలకు సూచన

US Reacts to India-China Clash in Tawang: “ఘర్షణల నుంచి ఇరు పక్షాలు త్వరగా విరమించినట్టు కనిపించడం మాకు ఆనందాన్ని కలిగించింది. మేం పరిస్థితిని పరిశీలిస్తున్నాం. ద్వైపాక్షిక మార్గాలను ఉపయోగించి.. సరిహద్దు వివాదాల గురించి చర్చించుకోవాలని భారత్, చైనా దేశాలకు సూచిస్తున్నాం. ఈసారి ఘర్షణ వాతావరణం త్వరగా సద్దుమణిగినందుకు సంతోషం” అని కరీన్ పేర్కొన్నారు. ఇలా భారత్, చైనా ఘర్షణపై అగ్రరాజ్యం అమెరికా ఆచితూచి స్పందించింది.

ఘర్షణ ఇలా..

India-China Tawang Clash: అరుణాచల్ ప్రదేశ్‍లోని తవాంగ్ సెక్టార్ వద్ద వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)ను దాటి వచ్చిన చైనా దళాలను భారత సైన్యం అడ్డుకుంది. డిసెంబర్ 9వ తేదీన సుమారు 300 మంది చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ (PLA) సైనికులు కర్రలతో పాటు వివిధ ఆయుధాలతో భారత సరిహద్దుల్లోకి వచ్చారు. భారత సైనికులు వీరిని సమర్థంగా ఎదుర్కొని తిప్పికొట్టారు. దీంతో డ్రాగన్ సేనలు వెనుదిరిగాయి. ఈ ఘటనలో ఇరు దేశాల సైనికులకు స్వల్ప గాయాలైనట్టు తెలిసింది. ఈ ఘటన తర్వాత భారత్-చైనా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

కాగా, ఈ తవాంగ్ ఘర్షణ గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్‍నాథ్ సింగ్.. పార్లమెంట్‍లో మంగళవారం ప్రకటన చేశారు. ఈ ఘర్షణలో భారత సైనికులు ఎవరూ మృతి చెందలేదని, తీవ్ర గాయాలు కూడా కాలేదని స్పష్టం చేశారు. దేశ భూభాగాన్ని కాపాడే పూర్తి సామర్థ్యం భారత ఆర్మీకి ఉందని చెప్పారు. ఎలాంటి ఉల్లంఘన జరిగినా.. ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని రాజ్‍నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

మరోవైపు గగనతలంలోనూ చైనా ఉల్లంఘనలకు పాల్పడే అవకాశం ఉండటంతో సరిహద్దుల వద్ద భారత వాయుసేన కూడా అప్రమత్తంగా ఉంది. ఘర్షణకు ముందు చైనీస్ డ్రోన్లను తిప్పికొట్టింది భారత వాయుసేన. ఏకంగా సుఖీయ్-30 యుద్ధ విమానాన్ని రెండు, మూడుసార్లు విహరింపజేసి.. చైనా ఉల్లంఘనలను అడ్డుకుంది.

మరోవైపు, చైనా మాత్రం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. భారత దళాలే సరిహద్దును దాటి తమవైపునకు వచ్చాయని చెబుతోంది. బోర్డర్ దాటిన భారత దళాలను తాను అడ్డుకున్నామని ప్రకటించుకుందని తెలుస్తోంది.

WhatsApp channel