Poor people in india: ఇండియాలో 41.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు: ఐరాస-united nations report says number of poor people in india fell by about 415 mn between 2005 and 2021 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  United Nations Report Says Number Of Poor People In India Fell By About 415 Mn Between 2005 And 2021

Poor people in india: ఇండియాలో 41.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు: ఐరాస

HT Telugu Desk HT Telugu
Oct 17, 2022 12:31 PM IST

Poor people in india: దాదాపు 15 ఏళ్లలో భారతదేశంలో 41.5 కోట్ల మంది పేదలు పేదరికం నుంచి బయటపడ్డారని ఐక్య రాజ్యసమితి వెల్లడించింది.

పేదరిక సూచీల్లో పౌష్ఠికాహారం కూడా ఒక సూచికగా ఎంచుకున్న నివేదిక
పేదరిక సూచీల్లో పౌష్ఠికాహారం కూడా ఒక సూచికగా ఎంచుకున్న నివేదిక (HT_PRINT)

ఐక్యరాజ్యసమితి, అక్టోబర్ 17: భారతదేశంలో పేదల సంఖ్య 2005-06, 2019-21 మధ్య సుమారు 415 మిలియన్ల (41.5 కోట్ల) మేర తగ్గింది. ఐక్య రాజ్యసమితి అభిప్రాయం ప్రకారం ఇది చారిత్రక మార్పు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని అనుసరించి 2030 నాటికి పేదరికంలో నివసించే అన్ని వయసుల పురుషులు, మహిళలు, పిల్లల నిష్పత్తిని సగానికి తగ్గించడం సాధ్యపడుతుందని ఈ గణాంకాలు చెబుతున్నాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ), ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆక్స్‌ఫర్డ్ పేదరికం, మానవ అభివృద్ధి ఇనిషియేటివ్ (ఓపీహెచ్‌ఐ) సోమవారం విడుదల చేసిన కొత్త మల్టీడైమెన్షనల్ పేదరిక సూచిక (ఎంపీఐ) భారతదేశంలో 2005-06, 2019-21 మధ్యకాలంలో 41.5 కోట్ల మంది పేదరికం నుండి బయటపడినట్లు తెలిపింది.

‘2030 నాటికి జాతీయ నిర్వచనాల ప్రకారం అన్ని కోణాలలో పేదరికంలో మగ్గుతున్న అన్ని వయసుల పురుషులు, మహిళలు, పిల్లల నిష్పత్తిని కనీసం సగానికి తగ్గించాలని సుస్థిర అభివృద్ధి లక్ష్యం రూపొందించుకున్నాం..’ అని చెప్పింది.

నివేదికపై ఐక్యరాజ్యసమితి ఒక పత్రికా ప్రకటనలో ‘భారతదేశంలో 15 సంవత్సరాల కాలంలో దాదాపు 415 మిలియన్ల మంది మల్టీడైమెన్షనల్ పేదరికం నుంచి బయటపడ్డారు. ఇది చారిత్రాత్మకమైన మార్పు..’ అని పేర్కొంది.

‘భారతదేశం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం ఒక ముఖ్యమైన కేస్ స్టడీ. ఇందులో మొదటిది పేదరికాన్ని అన్ని రకాలుగా అంతం చేయడం. అన్ని వయసుల పురుషులు, మహిళలు, పిల్లల నిష్పత్తి కనీసం సగానికి తగ్గించడం..’ అని పేర్కొంది.

భారతదేశానికి సంబంధించిన 2020 జనాభా గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో పేదలను కలిగి ఉంది. ఇక్కడ 22.89 కోట్ల మంది పేదలు ఉన్నారు. నైజీరియా 9.67 కోట్ల మంది పేదలు ఉన్నట్టు నివేదిక పేర్కొంది.

‘అయితే భారతదేశ జనాభా పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరలపై ఒత్తిడి కలిగిస్తుంది. కొనసాగుతున్న పోషకాహార, ఇంధన సంక్షోభాలను పరిష్కరించే సమీకృత విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాలి..’ అని పేర్కొంది.

‘2019-21 నాటికి భారతదేశంలో 9.7 కోట్ల మంది పేద పిల్లలు ఉన్నారు. గ్లోబల్ MPI పరిధిలో ఉన్న ఇతర దేశంలోని పేదలు పెద్దలు, పిల్లలు కలిపితే వచ్చే మొత్తం సంఖ్య కంటే ఇది ఎక్కువ. అయినప్పటికీ, ఈ బహుముఖ విధానాలు, సమీకృత విధానాలు మిలియన్ల మంది ప్రజల జీవితాలను మెరుగుపరుస్తాయని అవగతమవుతోంది..’ అని నివేదిక పేర్కొంది.

భారతదేశంలోని పేద రాష్ట్రాలు, వర్గాల (పిల్లలు, అట్టడుగు కులాలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నవారు)లో పేదరికం అత్యంత వేగంగా తగ్గింది. అయితే కోవిడ్-19 అనంతర మార్పులు ఈ గణాంకాలలో లేవని నివేదిక పేర్కొంది.

పిల్లల్లో పేదరికం వేగంగా తగ్గినప్పటికీ, భారతదేశంలో ఇప్పటికీ అత్యధిక సంఖ్యలో పేద పిల్లలు (9.7 కోట్లు) ఉన్నారు. 111 దేశాల్లో 1.2 బిలియన్ల మంది తీవ్రమైన బహుమితీయ పేదరికంలో జీవిస్తున్నారని నివేదిక పేర్కొంది. వీరిలో సగం మంది అంటే 593 మిలియన్ల మంది 18 ఏళ్లలోపు పిల్లలు.

పోషకాహారం, వంట ఇంధనం, పారిశుద్ధ్యం, గృహనిర్మాణం తదితర సూచీల ఆధారంగా ఈ నివేదిక 111 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదరికాన్ని పరిశీలించింది.

కొన్ని దేశాల్లోని ప్రాంతాలు జాతీయ సగటు కంటే పేదరికాన్ని వేగంగా తగ్గించాయి. వీటిలో భారతదేశంలోని బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ (2015/2016 - 2019/2021) ఉన్నాయి.

కోవిడ్-19 మహమ్మారికి ముందు 15 ఏళ్లలో భారతదేశంలో పేదరికం నుండి దాదాపు 41.5 కోట్ల మంది బయటపడ్డారు. దాదాపు 27.5 కోట్ల మంది 2005-2006, 2015-2016 మధ్య పేదరికం నుంచి బయట పడగా, 14 కోట్ల మంది 2015, 2019 మధ్య పేదరికం నుంచి బయటపడ్డారు.

2019-2021 డేటా ప్రకారం భారతదేశ జనాభాలో 16.4 శాతం మంది పేదరికంలో నివసిస్తున్నారు. జనాభాలో దాదాపు 4.2 శాతం మంది తీవ్ర పేదరికంలో ఉన్నారు.

IPL_Entry_Point