Indians in UK : భారతీయ రెస్టారెంట్లే టార్గెట్! ట్రంప్ స్టైల్లో అక్రమ వలసదారులకు యూకే వార్నింగ్..
అక్రమ వలసదారులు, అక్రమ ఉద్యోగాలపై యూకే వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా అధికారుల తాజా చర్యలు అక్కడి భారతీయ రెస్టారెంట్లపై ఎక్కువగా పడింది.

అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపడుతున్న చర్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ తరహాలోనేే ఇప్పుడు యూకే కూడా అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు అక్కడి పరిస్థితులను చూస్తే స్పష్టమవుతోంది! మరీ ముఖ్యంగా యూకే తాజా చర్యలతో అక్కడ ఉన్న భారతీయ రెస్టారెంట్లు టార్గెట్‌గా మారాయి.
యూకేలో భారతీయ రెస్టారెంట్లు..
యూకేలో అక్రమ వలసదారులపై జరుగుతున్న దాడులు భారతీయ రెస్టారెంట్లు, నెయిల్ బార్లు, కిరాణా దుకాణాలు, కార్ వాష్‌ల వరకు విస్తరించాయి. ఇలాంటి చోట్ల అక్రమ వలసదారులను ఉద్యోగాల్లో నియమించుకుంటుండటం అధికంగా ఉండటంతో అధికారులు ఈ దాడులు చేస్తున్నారు.
దేశంలో అక్రమ ఉద్యోగాలపై యూకే వ్యాప్తంగా దాడులు చేస్తున్నట్లు హోం ఆఫీస్ తెలిపింది. జనవరిలో వారి ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు 828 చోట్ల దాడులు చేశాయని, ఇది గత సంవత్సరం కంటే 48% పెరుగుదల అని సెక్రెటరీ య్వెట్ కూపర్ తెలిపారు. 609 మందిని అరెస్టు చేశారని, ఇది గత సంవత్సరం కంటే 73 శాతం ఎక్కువ అని పీటీఐ నివేదించింది.
రెస్టారెంట్లు, టేకవేలు, కాఫీ షాపులు, ఆహార, పానీయ- పొగాకు పరిశ్రమలపై కూడా గణనీయమైన చర్యలు తీసుకున్నట్లు ఆ శాఖ తెలిపింది. ఉత్తర ఇంగ్లాండ్ హంబర్‌సైడ్‌లోని ఒక భారతీయ రెస్టారెంట్ నుంచి ఏడుగురిని అరెస్టు చేశారు.
అన్ని రంగాల్లో అక్రమ ఉద్యోగ పరిస్థితులపై చర్యలు తీసుకుంటున్నట్లు హోం ఆఫీస్ తేల్చి చెప్పింది. “వలస నిబంధనలను గౌరవించాలి. వాటిని అమలు చేయాలి. చాలా కాలంగా, యజమానులు అక్రమ వలసదారులను నియమించుకుని వారిని దోపిడీ చేస్తున్నారు. చాలా మంది అక్రమంగా వచ్చి పనిచేయగలుగుతున్నారు. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు,” అని కూపర్ అన్నారు.
“ఛానెల్‌ని చిన్న పడవలో దాటి దేశంలోకి అక్రమంగా వస్తున్నారు. ఇది వారికి కూడా ప్రమాదకరమే. ఇది మన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది,” అని ఆమె చెప్పారు.
ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ప్రభుత్వం ఈ వారం దేశ పార్లమెంటులో సరిహద్దు భద్రత, ఆశ్రయం, వలస బిల్లును ప్రవేశపెడుతుంది. సరిహద్దు భద్రతను దెబ్బతీస్తున్నట్లు ప్రభుత్వం ఆరోపించే 'గుండా దళాలను' తరిమికొట్టడమే ఈ బిల్లు లక్ష్యం.
ఈ బిల్లులో కాస్త కఠిన రూల్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్స్‌కి వ్యతిరేకంగా సమర్థవంతమైన చర్యలు చేపట్టేందుకు ఈ బిల్లులో పలు కీలక చర్యలను జోడించారు. యూకేకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారి ఫోన్లను అసలెలాంటీ నోటీసులు కూడా ఇవ్వకుండా జప్తు చేయవచ్చు.
యూకేలో అక్రమ వలసదారులపై చర్యలు..
గత ఏడాది జులై 5 నుంచి ఈ ఏడాది జనవరి 31 వరకు, అక్రమ ఉద్యోగాలపై చర్యలు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే సుమారు 38 శాతం పెరిగాయని హోం ఆఫీస్ గణాంకాలు చూపిస్తున్నాయి. మొత్తం 1,090 సివిల్ పెనాల్టీ నోటీసులు జారీ చేశారు. అక్రమ వలసదారులకు ఉద్యోగాలు ఇస్తున్నట్టు రుజువైతే యజమానులకు 60వేల జీబీపీ వరకు ఫైన్ పడే అవకాశం కూడా ఉంది.
“వలస వ్యవస్థను ఉల్లంఘించవచ్చని అనుకునే వారిపై దాడులు చేయడంలో మా బృందాల నిబద్ధతను ఈ సంఖ్యలు చూపుతున్నాయి,” అని హోం ఆఫీస్‌లోని ఎన్ఫోర్స్మెంట్, కాంప్లయన్స్, క్రైమ్ డైరెక్టర్ ఎడ్డి మాంటెగోమెరీ అన్నారు.
సంబంధిత కథనం