తాను రష్యాకు అనుకూలంగా ఉన్నానని వస్తున్న ఆరోపణలను టెస్లా, స్టార్‌లింక్ సీఈఓ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఎలోన్ మస్క్ ఖండించారు. ఉక్రెయిన్ సైన్యం తమ స్టార్‌లింక్ ఉపగ్రహ వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడి ఉందని, దానిని మూసివేయాలని నిర్ణయించుకుంటే అది కూలిపోవచ్చని ఆయన చెప్పారు. తన స్టార్‌లింక్ ఉక్రెయిన్‌లో పనిచేయడం మానేస్తే.. ఈ దేశం రష్యా చేతిలో ఓడిపోవడానికి ఎక్కువ సమయం పట్టదని వ్యాఖ్యానించారు. మస్క్, ట్రంప్ ఇద్దరూ రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణను సమర్థిస్తున్నారు. అయితే విమర్శకులు మాత్రం మస్క్ రష్యాకు అనుకూలంగా ఉన్నారని అంటున్నారు.
'ఉక్రెయిన్‌పై భౌతిక పోరాటానికి నేను పుతిన్‌ను సవాలు చేసాను. నా స్టార్ లింక్ వ్యవస్థ ఉక్రేనియన్ సైన్యానికి వెన్నెముక. నేను దానిని మూసివేస్తే వారి మొత్తం ఫ్రంట్ లైన్ కూలిపోతుంది. సంవత్సరాల తరబడి కొనసాగే ప్రతిష్టంభనలో జరిగే మారణహోమం నన్ను కలవరపెడుతోంది. ఉక్రెయిన్ తప్పనిసరిగా కోల్పోతుంది. వెంటనే శాంతి నెలకొనాలి.' అని ఎలోన్ మస్క్ అన్నారు.
ఉక్రెయిన్‌లోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తలపై, ముఖ్యంగా మొనాకోలో విలాసవంతమైన ఆస్తులు కలిగిన వారిపై ఆంక్షలు విధించడం యుద్ధాన్ని ముగించడంలో సహాయపడుతుందని మస్క్ సూచించిన తర్వాత చర్చ మళ్లీ ప్రారంభమైంది.
సంఘర్షణలో రష్యా పాత్రను మస్క్ విస్మరిస్తున్నారని ఒక నెటిజన్ ఆరోపించారు. 'అవినీతికి పాల్పడిన ఎవరినైనా శిక్షించాలి. కానీ అదే సమయంలో పుతిన్ దురాక్రమణదారుడు కాదని నటించడం మానేయాలి. ఉక్రెయిన్ బాధిత దేశం. అర్ధంలేని మాటలు మాట్లాడటం మానేయండి. మీరు ఉక్రెయిన్‌ను విమర్శించడంపై మాత్రమే దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.' అని యూజర్ రాశారు.
ఉక్రెయిన్‌కు డొనాల్డ్ ట్రంప్ అమెరికా సైనిక సహాయాన్ని నిలిపివేసిన నేపథ్యంలో మస్క్ వ్యాఖ్యలు రావడంతో మరింత చర్చ మెుదలైంది. అవకాశం ఉంటే రష్యా, ఉక్రెయిన్ మధ్య త్వరిత శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. అయితే అలాంటి ఒప్పందాన్ని ఎలా కుదుర్చుకుంటారనే దాని గురించి వివరాలను ఆయన పంచుకోలేదు.
సంబంధిత కథనం