Ukraine Russia War : ఓ వైపు చర్చలు జరుగుతుండగానే.. ఉక్రెయిన్‌పై రష్యా 176 డ్రోన్ దాడులు!-ukraine russia war large russian drone attack on ukraine amid us russia talk in saudi arabia ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ukraine Russia War : ఓ వైపు చర్చలు జరుగుతుండగానే.. ఉక్రెయిన్‌పై రష్యా 176 డ్రోన్ దాడులు!

Ukraine Russia War : ఓ వైపు చర్చలు జరుగుతుండగానే.. ఉక్రెయిన్‌పై రష్యా 176 డ్రోన్ దాడులు!

Anand Sai HT Telugu Published Feb 18, 2025 03:22 PM IST
Anand Sai HT Telugu
Published Feb 18, 2025 03:22 PM IST

Ukraine Russia War : ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణపై సౌదీ అరేబియాలో రష్యా, అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌లో రష్యా 176 డ్రోన్ దాడులు చేసింది. 103 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది.

ఉక్రెయిన్‌పై రష్యా డ్రోనా దాడులు
ఉక్రెయిన్‌పై రష్యా డ్రోనా దాడులు (REUTERS)

సౌదీ అరేబియాలో ఉక్రెయిన్‌కు సంబంధించి రష్యా, అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో రష్యా 176 డ్రోన్లతో దాడి చేసిందని ఉక్రెయిన్ సైన్యం పేర్కొంది. ఈ దాడి తర్వాత 38 అపార్ట్ మెంట్లను ఖాళీ చేయాల్సి వచ్చిందని తెలిపింది. అదే సమయంలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరింది. కనీసం 103 డ్రోన్లను కూల్చివేసిట్టుగా సైన్యం వెల్లడించింది. అదే సమయంలో 67 డ్రోన్లు లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయని పేర్కొంది. కొన్ని చోట్ల డ్రోన్ పడిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ దాడికి సంబంధించి రష్యా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

నివాస భవనంపై

మధ్య ఉక్రెయిన్‌లోని డోలిన్స్కా నగరంలోని ఒక నివాస భవనంపై రాత్రిపూట పెద్ద ఎత్తున జరిగిన రష్యన్ డ్రోన్ దాడిలో ఒక తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు గాయపడ్డారని రాయిటర్స్ వార్త ప్రచురించింది. 38 అపార్ట్‌మెంట్‌ల నుండి ప్రజలను ఖాళీ చేయించారని పేర్కొంది. ఈ డ్రోన్ దాడుల్లో కిరోవోహ్రాడ్, ఖార్కివ్, కైవ్, చెర్కాసీ ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. డ్రోన్ శిథిలాలు పడటం వల్ల ఒక పారిశ్రామిక సంస్థలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.

రష్యా, అమెరికా చర్చలు

ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పలకడానికి, సంబంధాలను మెరుగుపర్చడానికి సౌదీ అరేబియాలో రష్యా, అమెరికా ఉన్నతాధికారులు మంగళవారం చర్చలు ప్రారంభించారు.ఈ నెల ప్రారంభంలో యుద్ధాన్ని ముగించడానికి చర్చలు ప్రారంభించడానికి తాను, పుతిన్ అంగీకరించామని చెప్పడం ద్వారా ఉక్రెయిన్, రష్యా పట్ల అమెరికా విధానాన్ని ట్రంప్ ప్రకటించారు.

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, విదేశీ వ్యవహారాల సలహాదారు యూరీ ఉషకోవ్ సోమవారం రాత్రి సౌదీ రాజధానికి చేరుకున్నారు. చర్చలు పూర్తిగా ద్వైపాక్షికంగా ఉంటాయని, ఉక్రెయిన్ అధికారులు పాల్గొనరని ఉషకోవ్ తెలిపారు.

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కోఫ్ రష్యా ప్రతినిధి బృందాన్ని కలుస్తారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ వెల్లడించారు.

Anand Sai

eMail
Whats_app_banner

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.