British High Commissioner: ఒకరోజు బ్రిటిష్ హై కమిషనర్ గా ఉండే అవకాశం; భారతీయ యువతులకు మాత్రమే
British High Commissioner: భారతీయ యువతులకు బ్రిటన్ మంచి అవకాశం కల్పిస్తోంది. ఒక రోజు పాటు వారు ఢిల్లీలో బ్రిటిష్ హై కమిషనర్ గా విధులు నిర్వర్తించే అవకాశాన్ని కల్పిస్తోంది. అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన చేసింది.
British High Commissioner: అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని జరుపుకోవడంలో భాగంగా.. భారతీయ యువతి ఒక రోజు పాటు ఢిల్లీలో బ్రిటిష్ హై కమిషనర్ గా విధులు నిర్వర్తించే అవకాశాన్ని ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్ ఇస్తోంది. అయితే, అలా ఒక రోజు బ్రిటిష్ హై కమిషనర్ గా ఎంపిక కావడానికి కొంత కసరత్తు చేయాల్సి ఉంటుంది.
ట్రెండింగ్ వార్తలు
వీడియో రూపొందించాలి..
ఒక రోజు బ్రిటిష్ హై కమిషనర్ గా ఎంపిక కావాలనుకునే యువతి వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఆ వయో పరిమితిలో ఉన్న భారత్ లోని అందరు యువతులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఈ పోటీకి అప్లై చేయడానికి వారు ముందుగా ఒక వీడియోను రూపొందించాలి. ‘‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి యువత ఏ విధంగా సహాయపడగలదు? ’’ అనే అంశంపై మాట్లాడుతూ ఆ వీడియోను రికార్డ్ చేయాలి. ఆ వీడియో నిడివి ఒక నిమిషం మాత్రమే ఉండాలి. అనంతరం, ఆ వీడియోను ట్విటర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, లింక్డ్ ఇన్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో పోస్ట్ చేయాలి. ఆ పోస్ట్ కు @UKinIndia ను ట్యాగ్ చేయాలి. అలాగే, #DayOfTheGirl హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలి.
లాస్ట్ డేట్ ఆగస్ట్ 18.. షరతులు వర్తిస్తాయి..
ఎంట్రీలను సబ్మిట్ చేయడానికి ఆఖరు తేదీ ఆగస్ట్ 18. ఒక వ్యక్తి ఒక ఎంట్రీ మాత్రమే పంపించాలి. ఒకటికి మించి పంపిస్తే డిస్ క్వాలిఫై అవుతారు. మీ కంటెంట్ ఒరిజినల్ అయి ఉండాలి. కాపీ కంటెంట్ ను పరిశీలించరు. ఏఐ ద్వారా పొందిన కంటెంట్ ను కూడా పరిశీలించడం కుదరదు. వీడియోలో, లేదా సోషల్ మీడియా పోస్ట్ లో వ్యక్తిగత వివరాలను పొందుపర్చకూడదు. బ్రిటిష్ హై కమిషన్ లోని న్యాయ నిర్ణేతల బృందం విజేతను నిర్ణయిస్తుంది. గత సంవత్సరం లక్నోకు చెందిన జాగృతి యాదవ్ విజేతగా నిలిచారు.
శక్తి సామర్ధ్యాల వెల్లడి
భారత్ లోని యువతుల్లో ఉన్న అచంచల శక్తి సామర్ధ్యాలను వెలికి తీసే లక్ష్యంతో ఈ పోటీ నిర్వహిస్తున్నామని బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తెలిపారు. ఆరోగ్యకరమైన, అభివృద్ధి దాయకమైన భవిష్యత్తు కోసం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలని కోరారు.