UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్షకు దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆదివారం, మే 19వ తేదీ వరకు పొడిగించింది. యూజీసీ-నెట్ జూన్ 2024కు హాజరు కావాలనుకునే అభ్యర్థులు యూజీసీ ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.ac.in ద్వారా మే 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఈ గడువు 2024 మే 15వరకు ఉండేది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డు/ నెట్ బ్యాంకింగ్/ యూపీఐ ద్వారా మే 20, 2024 రాత్రి 11:59 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చు. అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ విండో మే 21న ఓపెన్ అయి, 2024 మే 23న ముగుస్తుంది.
ఆన్ లైన్ అప్లికేషన్ ఫారంలో ఇచ్చిన ఇమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్ వారి స్వంత నంబర్ అయి ఉండాలని, లేదా తల్లిదండ్రులు / సంరక్షకులది మాత్రమే అయి ఉండాలని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఎందుకంటే యూజీసీ నెట్ 2024 కి సంబంధించిన అప్ డేట్స్ / సమాచారం / కమ్యూనికేషన్ ఆ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి, ఆ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు మాత్రమే పంపిస్తామని ఎన్టీఏ తెలిపింది.
హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్ సైన్స్ లలో యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు/ సంస్థల నుంచి మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 55% మార్కులు సాధించిన జనరల్/ అన్ రిజర్వ్డ్/ జనరల్-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హులు. నాన్ క్రీమీలేయర్/షెడ్యూల్డ్ క్యాస్ట్(ఎస్సీ)/షెడ్యూల్డ్ ట్రైబ్(ఎస్టీ)/దివ్యాంగులు(పీడబ్ల్యూడీ)/థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులు యూజీసీ నెట్ రాయడానికి మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
యూజీసీ నెట్ 2024 జూన్ నోటిఫికేషన్ ప్రకారం జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1,150. జనరల్-ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.600, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్ జెండర్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.325 గా నిర్ణయించారు. ఫీజు చెల్లింపునకు చివరి రోజు అంటే మే 20, 2024 రాత్రి 11.50 గంటలోపు చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్/ డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ యూపీఐ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
యూజీసీ నెట్ ప్రొఫెసర్ షిప్ పరీక్షకు హాజరు కావడానికి గరిష్ట వయోపరిమితి లేదు. అయితే, జేఆర్ఎఫ్ (జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్) పొందడానికి పరీక్ష ముగిసిన నెల మొదటి రోజున అంటే 01.06.2024 నాటికి అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీ-ఎన్సీఎల్/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్ జెండర్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు, మహిళా అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
యూజీసీ నెట్ జూన్ 2024 కు అప్లై చేయడానికి ఈ కింది స్టెప్ట్స్ ఫాలో కావాలి.
యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్షను జూన్ 16, 2024న నిర్వహించనున్నారు. పరీక్ష వ్యవధి 180 నిమిషాలు (3 గంటలు). పరీక్షను ఓఎంఆర్ (పెన్ అండ్ పేపర్) విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ తరహా, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. రెండు పేపర్స్ మధ్య విరామం ఉండదు.
యూజీసీ నెట్ జూన్ 2024కు దరఖాస్తు చేయడంలో ఏ అభ్యర్థికైనా ఇబ్బంది ఎదురైతే 011 - 40759000 /011 - 69227700 లకు కాల్ చేయవచ్చు. లేదా ugcnet@nta.ac.in ఐడీకి ఇ-మెయిల్ చేయవచ్చు. తాజా అప్డేట్స్ కోసం అభ్యర్థులు యూజీసీ ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లైన www.nta.ac.in https://ugcnet.nta.ac.in/ లను సందర్శించాలి.