Uganda man: 12 మంది భార్యలు.. 102 మంది పిల్లలు.. వారి పిల్లలు 578 మంది; పాపం.. ఈ కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉందట!
Uganda man: ఉగాండాకు చెందిన 70 ఏళ్ల ముసా హసహ్యా కసేరాకు తన అతి పెద్ద కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉందట. తన కుటుంబాన్ని ఆదుకోవాలని సోషల్ మీడియా వేదికగా అభ్యర్థిస్తున్నాడు. ముసా హసహ్యా కసేరాకు 12 మంది భార్యలు, 102 మంది పిల్లలు, 578 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు.
Biggest family: తూర్పు ఉగాండాలోని ముకిజాకు చెందిన 70 ఏళ్ల ముసా హసాహ్యా కసేరా అనే గ్రామస్తుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. అతడికి 12 మంది భార్యలు, 102 మంది పిల్లలు, 578 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. వారంతా ఉమ్మడి కుటుంబంగా కలిసే జీవిస్తున్నారు. హసహ్యా విస్తారమైన కుటుంబం స్థానికంగా చాలా పాపులర్ అయింది. కానీ, ఇప్పుడు తన కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నానని, చిన్న పిల్లలకు సరైన ఆహారం అందించలేకపోతున్నానని ముసా హసాహ్యా కసేరా బాధపడుతున్నాడు.
పెద్ద కుటుంబం..
'ప్రపంచంలోనే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తి' అంటూ ముసా హసాహ్యా కసేరా కథను ఇటీవల సోషల్ మీడియా (social media) లో షేర్ చేశారు. ఈ పోస్ట్ వెంటనే వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అతని పరిస్థితిపై స్పందిస్తున్నారు. ఒక నెటిజన్ ఇలా అన్నాడు, "ఇస్కో పరివార్ క్యూన్ బోల్తే హో ...? జిల్లా ఘోషిత్ క్యున్ నహీ కేఆర్ దేతే." (దీన్ని కుటుంబం అని ఎందుకు పిలుస్తారు? ఆ కుటుంబాన్ని జిల్లాగా ఎందుకు ప్రకటించకూడదు?), మరొకరు 'మౌజ్ హై భాయ్ కో' (ఈ వ్యక్తి గొప్ప జీవితం గడుపుతున్నాడు) అని అన్నారు. అయితే, హసహ్యా యొక్క వాస్తవికత చాలా భిన్నంగా ఉంది.
17 ఏళ్లకు మొదటి వివాహం
1972 లో ఉగాండాలోని ముకిజాకు చెందిన 70 ఏళ్ల ముసా హసాహ్యా కసేరా తన 17 సంవత్సరాల వయస్సులో తన మొదటి వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత దశాబ్దాలుగా, అతని కుటుంబం వేగంగా విస్తరించింది. ముసా హసాహ్యా కసేరా పశువుల వ్యాపారం చేసేవాడు. అతడి ఆదాయం చూసి చాలా మంది గ్రామస్తులు వారి కుమార్తెలను అతనికి ఇచ్చి వివాహం చేశారు. ఉగాండాలో కొన్ని మత సంప్రదాయాల ప్రకారం బహుభార్యత్వం చట్టబద్ధం అయినప్పటికీ, 1995 వరకు దేశంలో బాల్య వివాహాలను అధికారికంగా నిషేధించలేదు.
మొదటి సంతానం వయస్సు 50 ఏళ్లు
కసేరా మొదటి సంతానం సాండ్రా నబ్వైర్ అతడి వివాహం అయిన సంవత్సరం తరువాత జన్మించింది. కసేరా పిల్లల వయస్సు ఇప్పుడు 10 నుండి 50 సంవత్సరాల మధ్య ఉంటుంది. అతడి 12వ భార్య, అంటే అతడి చిన్న భార్య వయస్సు 35 ఏళ్లు. "నా మొదటి, చివరి పిల్లల పేర్లు మాత్రమే నాకు గుర్తున్నాయి. చాలామంది పేర్లు నాకు గుర్తు లేవు" అని హసహ్యా ఒప్పుకున్నాడు. అయితే, అతడు తన పిల్లల జననాల వివరాలను ఒక నోట్ బుక్ లో నీట్ గా రాసుకున్నాడు. ఈ విషయంలో అతడికి అతని భార్యలు సహాయపడతారు.
ఆర్థికంగా శిధిలం
పెద్ద కుటుంబం కావడంతో, కసేరా ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. అతను ఒక శిథిలావస్థలో ఉన్న ఇంటిలో నివసిస్తున్నాడు. దాని పైకప్పు శిధిలమైంది. అతడి కుటుంబం సమీప ప్రాంతంలో అనేక గడ్డితో నిండిన మట్టి గుడిసెలలో నివసిస్తోంది. ఒకప్పుడు తన ఎదుగుతున్న కుటుంబాన్ని పోషించడానికి సరిపోతుందని భావించిన అతని రెండెకరాల భూమి ఇప్పుడు ఆ పెద్ద కుటుంబం ఆకలిని తీర్చడం లేదు. "తిండి చాలడం లేదు. పిల్లలకు ఒకసారి లేదా మంచి రోజున రెండుసార్లు మాత్రమే అన్నం పెట్టగలుగుతున్నాం’’ అని హసహ్యా మూడవ భార్య జబీనా వివరించింది.
ఇళ్లల్లో పని చేస్తూ..
ముసా హసాహ్యా కసేరా పిల్లలు, మనవలు, మనవరాళ్లలో చాలా మంది తమ పొరుగువారి కోసం పనులు చేస్తారు. చాలా దూరం నుండి నీరు మరియు కట్టెలు తెచ్చుకుంటూ తమ రోజులను గడుపుతున్నారు. తరచుగా, వారి కుటుంబం ఆకలిని ఎదుర్కొంటుంది. ఇది తన మునుపటి నిర్ణయాల పర్యవసానమని హసహ్యా అంగీకరించాడు. మొదట్లో ఇది పెద్ద సమస్యగా అనిపించలేదని అన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడం, అంత పెద్ద కుటుంబాన్ని పోషించాల్సిన ఒత్తిడితో ఇద్దరు భార్యలు ఆ కష్టాన్ని భరించలేక వెళ్లిపోయారు.
ఫ్యామిలీ మీటింగ్స్
ఈ పెద్ద కుటుంబాన్ని నిర్వహించడం, రోజువారీ విబేధాలను పరిష్కరించడం కూడా సవాలే. అందువల్ల, హసహ్యా సంక్లిష్టమైన కుటుంబ సంబంధాలను నిర్వహించడానికి, నెలవారీ కుటుంబ సమావేశాలు జరుపుతాడు. అక్కడ వివాదాలు పరిష్కరించబడతాయి. అతని కుమారుడు షబాన్ మాగినో, 30 సంవత్సరాల ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు. అతడు కుటుంబ వ్యవహారాలను నిర్వహించడంలో సహాయం చేస్తాడు. సాధ్యమైనంతగా, యువ తరానికి విద్యను అందించేలా చూస్తాడు.
మంచి కుటుంబం
సుమారు 4,000 మంది జనాభా ఉన్న బుగిసా గ్రామంలో స్థానిక అధికారులు హసహ్యాకు సాయం చేయడానికే ప్రయత్నిస్తుంటారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన తన పిల్లలను బాగా పెంచారని స్థానికులు తెలిపారు. వారి కుటుంబంలో దొంగతనం, గొడవ వంటి పెద్ద సమస్యలేవీ లేవన్నారు. అతడి భార్యలు ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు. అయితే ఇప్పటికే ఇద్దరు భార్యలు వెళ్లిపోగా, మరో ముగ్గురు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణంలో నివసిస్తున్నారు. "నేను అతన్ని మొదటిసారి వివాహం చేసుకున్నప్పుడు అతనికి వేరే భార్యలు ఉన్నారని నాకు తెలియదు" అని అతడి భార్య జబీనా చెప్పింది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, హసహ్యా తన భార్యలు తనతో సంతోషంగా ఉన్నారని చెబుతాడు. "వాళ్ళంతా నన్ను ప్రేమిస్తున్నారు, చూశారా?, వాళ్ళు సంతోషంగా ఉన్నారు" అన్నాడు చిరునవ్వుతో.
విస్తరణకు ముగింపు
హసయ్య కుటుంబం ఎదుగుతూనే ఉన్నప్పటికీ మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టారు. అతని భార్యలు, అతడి కోడళ్లు, కొత్తగా పెళ్లైన కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు పుట్టకుండా నిరోధించడానికి గర్భనిరోధకాలను ఉపయోగిస్తున్నారు.