మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే ఇటీవల 'జై గుజరాత్' అంటూ నినదించడంపై శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఘాటుగా స్పందించారు. ద్రోహి, గద్దార్ అంటూ షిండే పై నిప్పులు చెరిగారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేతో కలిసి నిర్వహించిన రీ యూనియన్ ర్యాలీలో ఉద్ధవ్ షిండేను ద్రోహిగా అభివర్ణించారు.
అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియాలో విజయం సాధించిన పుష్ప సినిమాలోని డైలాగ్ ను ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే ఉపయోగించారు. ఆ సినిమాలో పుష్పరాజ్ గా నటించిన అల్లు అర్జున్ ‘‘ఝుకేగా నహీ సా..’’ అనే డైలాగ్ వాడుతాడు. ఆ డైలాగ్ తరహాలోనే షిండే ను ఉద్దేశించి ఉద్ధవ్ ఠాక్రే ‘‘ఉఠేగా నహీ సా..’ అని వ్యాఖ్యానిస్తారు. మరాఠాకి, మహారాష్ట్రకు ఏక్ నాథ్ షిండే ద్రోహం చేశాడని, అతడు మళ్లీ విజయం సాధించలేడని పేర్కొంటూ ఉద్ధవ్ పై వ్యాఖ్యలు చేశారు. షిండే తన బాస్ ను ప్రసన్నం చేసుకునేందుకు ‘జై గుజరాత్’ నినాదాన్ని లేవనెత్తారని ఉద్ధవ్ ఎద్దేవా చేశారు. "అతడికి సొంత ఆలోచనలు లేవు....మరాఠీ పట్ల గౌరవం ఇలా చూపిస్తున్నాడు" అని ఉద్ధవ్ అన్నారు.
రెండు దశాబ్దాల క్రితం శివసేన వారసత్వ వివాదంపై విడిపోయిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఇప్పుడు మళ్లీ మహారాష్ట్ర ప్రభుత్వ త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా చేతులు కలిపారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఒకే వేదికను పంచుకున్నారు. మరాఠీ, ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని థర్డ్ లాంగ్వేజ్ గా తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని 'మరాఠీచా ఆవాజ్' పేరుతో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే సంయుక్త ర్యాలీ నిర్వహించారు.
పుణెలో ఇటీవల జరిగిన ర్యాలీలో ఏక్ నాథ్ షిండే 'జై గుజరాత్' అని నినాదం ఇవ్వడం వివాదానికి దారి తీసింది. పుణెలోని కొంధ్వా ప్రాంతంలో 'జైరాజ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్ సెంటర్' ప్రారంభోత్సవంలో షిండే జై గుజరాత్ అని నినదించారు. . ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు. అక్కడ తన ప్రసంగాన్ని ముగించే సమయంలో, మొదట 'జైహింద్, జై మహారాష్ట్ర' అన్నారు. కాసేపటి తరువాత తన ప్రసంగం చివరలో 'జై గుజరాత్' అని షిండే జోడించారు. దీనిపై స్పందించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. అమిత్ షా ఆశీస్సులతోనే షిండే సేన గుజరాత్ లో ఆవిర్భవించిందన్నారు.
సంబంధిత కథనం
టాపిక్