Thackeray meets Shinde | షిండేకు ఉద్ధవ్ ఠాక్రే అన్న కొడుకు మద్దతు
Thackeray meets Shinde | శివసేనపై పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు మరో దెబ్బ తగిలింది. ఠాక్రే సొంత కుటుంబం నుంచి షిండేకు మద్దతు పెరుగుతోంది. తాజాగా, ఉద్ధవ్ ఠాక్రే అన్న కుమారుడు నిహార్ ఠాక్రే కూడా ఏక్‌నాథ్ షిండేతో సమావేశమయ్యారు.
Thackeray meets Shinde | ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే అన్న జయదేవ్ ఠాక్రే మాజీ భార్య స్మిత ఠాక్రే కూడా ఇటీవల శివసేన తిరుగుబాటు నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలిసి మద్దతు ప్రకటించారు.
Thackeray meets Shinde | షిండేను కలిసిన నిహార్ ఠాక్రే
ఉద్ధవ్ ఠాక్రే పెద్దన్న కుమారుడు నిహార్ ఠాక్రే శుక్రవారం శివసేన తిరుగుబాటు నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను ప్రత్యేకంగా కలిసి మద్దతు ప్రకటించారు. బాల్ ఠాక్రే వారసత్వంపై సంపూర్ణ హక్కులు ఉన్నాయని ప్రకటిస్తున్న ఉద్ధవ్ ఠాక్రేకు ఇది భారీ దెబ్బగా భావిస్తున్నారు. నిజానికి బాల్ ఠాక్రే పిల్లల కుటుంబాల మధ్య మొదట్నుంచీ సఖ్యత తక్కువే. తాజా పరిణామాల నేపథ్యంలో, ఒక్కరొక్కరుగా ఉద్ధవ్ ఠాక్రే వ్యతిరేకులు తిరుగుబాటు నేతకు దగ్గరవుతుండడం గమనార్హం.
Thackeray meets Shinde | బీజేపీ నేత అల్లుడు
నిహార్ ఠాక్రే న్యాయవాదిగా పని చేస్తున్నారు. అయితే, ఆయన రాజకీయాల్లో పెద్దగా క్రియాశీలకంగా లేరు. నిహార్ ఠాక్రే భార్య మాజీ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ కూతురు అంకిత పాటిల్. మొదట కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న హర్షవర్ధన్ పాటిల్ ఆ తరువాత బీజేపీలో చేరారు.
Thackeray meets Shinde | బాల్ ఠాక్రే ముగ్గురు పిల్లలు
బాల్ ఠాక్రే ముగ్గురు కొడుకుల్లో చిన్నవాడు ఉద్ధవ్ ఠాక్రే. పెద్దవాడు బిందుమాధవ్ ఠాక్రే, రెండోవాడు జయదేవ్ ఠాక్రే. సినిమా నిర్మాతగా ఉన్న బిందుమాధవ్ ఠాక్రే 1996లో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయన కుమారుడే ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండేను కలిసి మద్దతు ప్రకటించిన నిహార్ ఠాక్రే. జయదేవ్ ఠాక్రే మాజీ భార్య స్మిత ఠాక్రే కూడా ఇటీవల షిండేను కలిశారు. 2012 బాల్‌ఠాక్రే మరణించిన తరువాత, ఆయన వీలునామాపై వారి కుటుంబంలో విబేధాలు తలెత్తాయి.
Thackeray meets Shinde | ఉద్ధవ్ ఆవేదన
శివసేనలో తిరుగుబాటును జీర్ణించుకోలేకపోతున్న ఉద్ధవ్ ఠాక్రే తాజాగా మరోసారి తిరుగుబాటు నేతలపై విరుచుకుపడ్డారు. తాను అనారోగ్యంగా ఉన్న సమయంలో పార్టీలో తిరుగుబాటు లేవనెత్తి తనను మోసం చేశారని ఏక్‌నాథ్ షిండే వర్గం నేతలపై మండిపడ్డారు. పార్టీ పత్రిక సామ్నా`కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తిరుగుబాటు నేతలను ఉద్ధవ్ ఠాక్రే వాడిపోయిన ఆకులుగా అభివర్ణించారు. అవి రాలిపోవడం సహజమేనని, కొత్త ఆకులు వస్తాయని వ్యాఖ్యానించారు. త్వరలో న్యాయస్థానంలో, ఆ తరువాత ప్రజాక్షేత్రంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.