Udaipur riots : ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్తత- 10వ తరగతి విద్యార్థిపై కత్తి దాడితో అలజడులు
Udaipur Violence latest updates : 10వ తరగతి విద్యార్థిపై జరిగిన కత్తి దాడితో రాజస్థాన్ ఉదయ్‌పూర్ ఉలిక్కిపడింది. అనంతరం జరిగిన హింసాత్మక ఘటనతో అధికారులు అప్రమత్తయ్యారు. ఇంటర్నెట్‌ని మూసివేసి, పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వం పాఠశాలలో చదువుకుంటున్న ఓ విద్యార్థి, మరో విద్యార్థిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం ఆ ప్రాంతంలో మత ఘర్షణలు చెలరేగాయి. వెంటనే స్పందించిన అధికారులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదీ జరిగింది..
ఉదయ్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థిపై అతని క్లాస్మేట్ కత్తితో దాడి చేశాడు. ఈ వార్త వేగంగా ఆ ప్రాంతం మొత్తానికి వ్యాపించింది. ఫలితంగా హింస చెలరేగింది.
ఓ గుంపు రాళ్లు రువ్వడంతో పాటు మూడు, నాలుగు కార్లకు నిప్పుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. షాపింగ్ మాల్ పై కూడా రాళ్లు రువ్వారని, అందులో దుకాణాల అద్దాలు, గేట్లు ధ్వంసమయ్యాయని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ప్రభుత్వాసుపత్రి ఎదుట వందలాది మంది గుమిగూడినట్టు, పోలీసులు వారిని చెదరగొట్టినట్టు సమాచారం.
సాయంత్రానికి ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. నగరంలోని బాపు బజార్, హాతిపోల్, ఘంటా ఘర్, చేతక్ సర్కిల్, పరిసర ప్రాంతాల్లోని మార్కెట్లను అధికారులు మూసివేశారు.
ఉదయపూర్ జిల్లా కలెక్టర్ అరవింద్ పోస్వాల్ వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. “శుక్రవారం ఉదయం ఇద్దరు పిల్లల మధ్య గొడవ జరిగినట్లు అధికార యంత్రాంగానికి ఫిర్యాదు అందింది. ఇద్దరు పిల్లల మధ్య జరిగిన గొడవలో ఒక చిన్నారి తొడలపై కత్తితో దాడి చేసినట్లు మాకు సమాచారం అందింది. గాయం లోతుగా ఉంది. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు,” అని తెలిపారు.
“గాయపడిన పిల్లాడిని నేను కలిశాను. అతని పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉంది. కానీ కిడ్నీలో సమస్య కనిపిస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి నిపుణుల ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎలాంటి వదంతులు, తప్పుడు సమాచారాన్ని పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేశాము. అతని తండ్రిని కూడా అరెస్టు చేశాము,” అని పోస్వాల్ తెలిపారు.
కత్తిపోట్లకు నిరసనగా నగరంలోని మధుబన్ వద్ద కొన్ని హిందూ సంఘాల సభ్యులు గుమిగూడగా, పరిస్థితులు వేగంగా చెయ్యి దాటిపోయి, అనంతరం హింసకు దారితీసింది.
ఉదయ్‌పూర్ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో అధికార యంత్రాంగం బలగాలను మోహరించింది.
డివిజనల్ కమిషనర్ రాజేంద్ర భట్, కలెక్టర్ అరవింద్ పోస్వాల్, ఎస్పీ యోగేష్ గోయల్, రాజ్యసభ ఎంపీ చున్నీలాల్ గరాసియా, లోక్‌సభ ఎంపీ మన్నాలాల్ రావత్, ఎమ్మెల్యేలు తారాచంద్ జైన్, ఫూల్ సింగ్ మీనా, ఇతర ప్రజాప్రతినిధులు తాజా పరిస్థితిపై సమీక్షించారు.
ఉదయ్‌పూర్‌లో శుక్రవారం ఇంటర్నెట్పై నిషేధం విధించగా.. అది 24 గంటల పాటు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ప్రాంతంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలను శనివారం మూసివేస్తున్నట్టు స్పష్టం చేశారు.
ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే ఫూల్ సింగ్ మీనా స్పందించారు.
“ఉదయ్‌పూర్‌లో జరిగిన ఓ ఘటన హింసకు దారితీసింది. నిందితుడి ఇంటిని బుల్డోజర్తో ధ్వంసం చేయాలి. ఇలాంటి ఘటనలను నివారించేందుకు ఇలాగే చేయాలి! నేరానికి కారణమైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుంది,” అని ఫూల్ సింగ్ మీనా తెలిపారు.