Udaipur killing : ఉదయ్‌పూర్ ఘటన నిందితుడు.. బీజేపీ కార్యక్రమాలకు వెళ్లాడా?
Udaipur killing : ఉదయ్‌పూర్ హత్య ఘటనలో నిందితుడు రియాజ్ అట్టారి. గతంలో బీజేపీ కార్యక్రమాలకు వెళ్లాడు! ఎవరు పిలవకపోయినా.. రాజస్థాన్‌లో జరిగిన బీజేపీ కార్యక్రమాలకు వెళ్లేవాడు.

Udaipur killing : దేశవ్యాప్తంగా కలకలం సృష్టించి ఉదయ్‌పూర్ హత్య ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఒకడైన రియాజ్ అట్టారి.. గతంలో బీజేపీతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించాడు!
దారుణ హత్య..
నుపుర్ శర్మ వివాదంలో ఆమెకు మద్దతుగా నిలిచిన రాజస్థాన్ ఉదయ్పూర్వాసి కన్నయ్య లాల్‌ను గతవారం ఇద్దరు దారుణంగా హత్య చేశారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. నిందితులు రియాజ్ అట్టారి, మహమ్మద్ గౌస్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే పాక్ ఉగ్రసంస్థలతో నిందితులకు లింక్స్ ఉన్నట్టు వారు భావిస్తున్నారు.
అయితే.. ఈ పూర్తి వ్యవహారంపై, నిందితుల వ్యక్తిగత జీవితంపై ప్రముఖ వార్తాసంస్థ 'ఇండియా టుడే'.. మరింత లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే పలు విషయాలను బయటపెట్టింది.
రాజస్థాన్‌లోని బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్న రియాజ్ అట్టారీ ఫొటోలు ఇండియా టుడేకు చిక్కాయి. ఆ ఫొటోలు మూడేళ్ల కిందట తీసినవి.
2019లో సౌదీ అరేబియా- ఉమ్రా యాత్ర నుంచి తిరిగొచ్చిన రియాజ్‌ను ఓ వ్యక్తి సత్కరించారు. ఆయన పేరు ఇర్షద్ చైన్వాలా. ఆయన రాజస్థాన్‌లోని బీజేపీ మైనారిటీ మోర్చా సభ్యుడు.
Riyaz Attari India today : బీజేపీతో చైన్వాలాకు దశాబ్దకాలంగా పరిచయం ఉంది. ఆ ఫొటోలను చైన్వాలా వద్ద ప్రస్తావించింది ఇండియ టూడే. రియాజ్.. ఉదయ్‌పూర్‌లో జరిగే బీజేపీ కార్యక్రమాలకు హాజరయ్యేవాడని చైన్వాలా వెల్లడించారు.
"అవును. ఆ ఫొటోలో ఉన్నది నేను. ఉమ్రా యాత్ర నుంచి తిరిగొచ్చిన రియాజ్‌ను నేను స్వాగతించారు. అతను బీజేపీ కార్యక్రమాలకు వచ్చేవాడు. అతని వెంట ఎవరో ఒకరు ఉండేవారు. బీజేపీ నేత గులాబ్ చాంద్ కటారియాకు చెందిన ఎన్నో కార్యక్రమాలకు ఆయన వచ్చాడు," అని చైన్వాలా జవాబిచ్చారు.
అయితే.. పిలవకుండానే రియాజ్ అనేకమార్లు బీజేపీ కార్యక్రమాలకు వెళ్లినట్టు తెలుస్తోంది. 'రియాజే స్వయంగా వచ్చాడు. ఎవరు పిలవకపోయే కార్యక్రమాలకు వచ్చేవాడు. పార్టీతో కలిసి పనిచేయాలని ఉందని చెప్పేవాడు,' అని చైన్వాలా అన్నారు.
కాగా.. తన సన్నిహితులతో ఉన్నప్పుడు.. బీజేపీపై రియాజ్ మండిపడేవాడని, దుర్భాషలాడేవాడని తెలుస్తోంది.
Udaipur murder : మహమ్మద్ తాహిర్ అనే వ్యక్తి ద్వారా.. రియాజ్ అట్టారి బీజేపీ కార్యక్రమాలకు వెళ్లేవాడు. మహమ్మద్ తాహిర్ అనే వ్యక్తి బీజేపీ కార్యకర్త అని చైన్వాలా వెల్లడించారు.
తాహిర్- రియాజ్‌లు కలిసి దిగిన ఫొటోలు చాలా ఉన్నాయి. కాగా ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇండియా టుడే ప్రయత్నించింది. తాహిర్ నివాసానికి వెళ్లింది. కానీ అతను కనిపించలేదు. అతడు.. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడని తెలిసింది. అతని ఫోన్ కూడా స్విచ్ఆఫ్లోనే ఉంది.
'మాకు ఎలాంటి లింకులు లేవు..'
కాగా ఇండియా టుడే ప్రచురించిన కథనం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అధికారపక్షంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. 'ఈ విషయం బయటపడుతుంది అనేనా? కేసును వెంటనే ఎన్ఐఏకి తరలించారు?' అని ప్రశ్నించింది. 'కన్నయ్య లాల్‌ను చంపిన వ్యక్తి బీజేపీకి చెందిన వాడు' అని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరీ ట్వీట్ చేశారు.
ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ.. నిందితుడికి తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. రాజస్థాన్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఉదయ్‌పూర్ హత్య ఘటన జరిగినట్టు ఆరోపించింది.
సంబంధిత కథనం