Udaipur news: ఉదయ్‌పూర్ మర్డర్ కేసు నిందితులకు పాక్‌ సంస్థతో లింకులు-udaipur beheading main accused in touch with pak based organisation dawat e islami says police ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Udaipur News: ఉదయ్‌పూర్ మర్డర్ కేసు నిందితులకు పాక్‌ సంస్థతో లింకులు

Udaipur news: ఉదయ్‌పూర్ మర్డర్ కేసు నిందితులకు పాక్‌ సంస్థతో లింకులు

ఉదయ్‌పూర్ హత్య ఘటనలో నిందితులకు పాకిస్తాన్‌తో లింకులు ఉన్నట్టు ప్రాథమికంగా తేలింది.

ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను హత్య చేసిన ఘటనలో నిందితులు మహమ్మద్ రియాజ్ అఖ్తారి, గౌస్ మహమ్మద్ (HT_PRINT)

జైపూర్, జూన్ 30: ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను హత్య చేసిన సంఘటనలో ప్రధాన నిందితులు పాకిస్థాన్‌కు చెందిన సంస్థ దావత్-ఎ-ఇస్లామీతో టచ్‌లో ఉన్నారని, వారిలో ఒకరు 2014లో పాకిస్తాన్‌లోని కరాచీకి కూడా వెళ్లారని రాజస్థాన్ పోలీసులు బుధవారం తెలిపారు.

ప్రధాన నిందితులతో పాటు వారితో పరిచయం ఉన్న మరో ముగ్గురిని కూడా తమ కస్టడీలోకి తీసుకున్నామని రాజస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఎం.ఎల్. లాథర్ తెలిపారు.

‘ఇద్దరు వ్యక్తులు ఇప్పటివరకు ప్రధాన నిందితులుగా ఉన్నారు. వారితో పాటు, వారు పరిచయం ఉన్న మరో ముగ్గురిని మా కస్టడీలోకి తీసుకున్నాం..’ అని డీజీపీ లాథర్ వెల్లడించారు.

ఉదయ్‌పూర్‌లో జరిగిన సంఘటన ఉగ్రదాడి అని, కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కి బదిలీ చేశామని, దర్యాప్తులో రాష్ట్ర పోలీసులు వారికి సహకరిస్తారని ఆయన అన్నారు.

‘ప్రధాన నిందితులు దావత్-ఎ-ఇస్లామీ సంస్థతో టచ్‌లో ఉన్నారు. వారిలో ఒకరు 2014లో పాకిస్థాన్‌లోని కరాచీలో ఆ సంస్థను కలవడానికి వెళ్లారు. తల నరికివేత ఘటనను ఉగ్రవాద చర్యగా పరిగణిస్తున్నాం. కేసు ఎన్ఐఏకు బదిలీ అయ్యింది..’ అని వివరించారు.

ఈ సంఘటన జరగడానికి ముందే ఆ ప్రాంతంలో మత ఉద్రిక్తతలు తలెత్తినందున.. వాటిని శాంతింపజేయడానికి అవసరమైన చర్యలు తీసుకోని కారణంగా అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌లను సస్పెండ్ చేసినట్లు డీజీపీ లాథర్ తెలిపారు.

సస్పెండ్ అయిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత నుపుర్ శర్మకు మద్దతుగా కంటెంట్‌ను పోస్ట్ చేశారనే ఆరోపణతో ఉదయపూర్‌లో ఇద్దరు వ్యక్తులు దర్జీ కన్హయ్య లాల్‌ను నరికివేయడం దేశవ్యాప్తంగా ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించింది.

నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు చేసిన నినాదాల మధ్య బుధవారం ఉదయ్‌పూర్‌లో కన్హయ్య లాల్ అంత్యక్రియలు జరిగాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో దర్జీ కన్హయ్య లాల్‌ను పట్టపగలు ఇద్దరు వ్యక్తులు అతని దుకాణంలోనే నరికి చంపిన కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం చేపట్టిందని అధికారులు తెలిపారు.

యాంటీ టెర్రర్ ఏజెన్సీ చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంతో పాటు భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలు చేసిందని ఎన్‌ఐఏ సీనియర్ అధికారి ఒకరు ఏఎన్ఐకి తెలిపారు.

దేశవ్యాప్తంగా ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏ చేపట్టాలని హోం మంత్రిత్వ శాఖ ఆదేశించిన వెంటనే చర్యలు ప్రారంభమయ్యాయి.

ఇన్‌స్పెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డిఐజి) ర్యాంక్ అధికారుల పర్యవేక్షణలో నలుగురు సభ్యుల ఎన్‌ఐఎ బృందం గత రాత్రి ఉదయ్‌పూర్ చేరుకున్న తర్వాత సంఘటనకు సంబంధించిన వివరాలను ఇప్పటికే సేకరించింది. ఎన్ఐఏ బృందం అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించింది.

ఈ ఘటన ఉదయ్‌పూర్‌లోని మాల్దాస్ ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. నేరం చేసిన వెంటనే ఇద్దరు నిందితులు ‘తల నరికివేత’ గురించి గొప్పగా చెబుతూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ప్రాణహాని తలపెడతామని వ్యాఖ్యలు చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. దుండగులు వీడియోలో తమ పేరు రియాజ్ అక్తరీ, గౌస్ మహ్మద్‌గా చెప్పుకొచ్చారు.

ఉదయ్‌పూర్‌కు చెందిన రియాజ్, గౌస్‌లను రాజ్‌సమంద్ జిల్లాలోని భీమ్‌లో అరెస్టు చేశారు.

రియాజ్ 47 ఏళ్ల కన్హయ్య లాల్‌పై పదునైన ఆయుధంతో దాడి చేయగా, మరొకడు ఘౌస్ తన మొబైల్ ఫోన్‌లో నేరాన్ని రికార్డ్ చేశాడు.

కాగా బెదిరింపులు వస్తున్నాయంటూ కన్హయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

ప్రవక్త మొహమ్మద్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు మద్దతుగా బాధితుడు ఇటీవల సోషల్ మీడియా పోస్ట్‌ను షేర్ చేశారు.

హత్య తర్వాత, బాధితుడికి న్యాయం చేయాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలోని స్థానిక మార్కెట్లు మూసివేశారు.

సంబంధిత కథనం

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.