Uber Ride : ఏసీ ఆన్ చేయమన్నందుకు మహిళను రోడ్డు మధ్యలో దింపేసిన ఉబర్ డ్రైవర్
Uber Viral News : మహారాష్ట్రంలోని పూణేలోని ఒక మహిళ ఉబర్ రైడింగ్‌లో తనకు జరిగిన అనుభవాన్ని పంచుకుంది. డ్రైవర్‌ను ఏసీ ఆన్ చేయమని అడగ్గా చేయలేదు. ప్రీమియర్ రైడ్‌ల కోసం మాత్రమే అని చెప్పాడు. దీనిపై ఇద్దరి మధ్య వివాదం నడిచింది.
పూణేలో ఇఫ్ఫత్ షేక్ అనే మహిళ ఉబర్ బుక్ చేసుకుని రైడింగ్ స్టార్ట్ చేసింది. అయితే ఈ సమయంలో ఏసీ ఆన్ చేయమని డ్రైవర్‌ను అడిగింది. ప్రీమియర్ రైడ్‌లకు మాత్రమే ఎయిర్ కండిషనింగ్ సదుపాయం లభిస్తుందని డ్రైవర్ చెప్పాడు. అంతేకాదు ఆమెను మార్గమధ్యంలో దింపాడు. ఈ విషయాన్ని ఇఫ్ఫత్ షేక్ సోషల్ మీడియాలో పంచుకుంది.
ఆమె షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ఎయిర్ కండిషనింగ్ ఆన్ చేయడానికి ఎందుకు నిరాకరించాడని డ్రైవర్‌ని అడగడం వినవచ్చు. 'నేను ఉబర్‌లో కూర్చున్నాను. సెడాన్‌ను బుక్ చేశాను. నాకు ఏసీ కావాలంటే ప్రీమియర్ బుక్ చేసి ఉండాల్సింది అని చెబుతున్నాడు డ్రైవర్. నేను మొదటిసారిగా ప్రయాణిస్తు్న్న అనుకుంటున్నాడేమో.' అని వీడియోల మహిళ చెప్పడం వినవచ్చు.
తాను ఉబర్స్‌లో చాలా ప్రయాణించానని, మినీ లేదా సెడాన్‌ను బుక్ చేసినా ఏసీ అవసరమైతే అడగాలని, దానిని అందించడం వారి బాధ్యత అని ఇఫ్ఫత్ షేక్ పేర్కొంది. కెమెరాను చూస్తూ ఏసీ ఆన్ చేయడం కుదరదని డ్రైవర్ ఈ విషయం చెప్పాడు. డ్రైవర్ తన పేరు అనిల్ అని వెల్లడించాడు. ప్రీమియర్ కార్లకు మాత్రమే ఏసీ సౌకర్యం ఉందని మరోసారి పేర్కొంటూ యాప్‌ని చెక్ చేయమని అడిగాడు .
ఈ విషయాన్ని షేక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. బురఖా ధరించిన స్త్రీ తెలివితక్కువదని అనుకోవద్దు అని పేర్కొంది. అంతేకాకుండా తాను కోరుకున్న ప్రదేశంలో డ్రాప్ చేయమని అభ్యర్థిస్థే ఉబర్ డ్రైవర్ తిరస్కరించాడని తెలిపింది. తనకు తెలియని నగరమైన పూణేలో ఇలాంటి ఘటనతో అసౌకర్యంగా ఫీలైనట్టుగా చెప్పుకొచ్చింది. డ్రైవర్ రోడ్డు మధ్యలో దింపేసి వెళ్లిన తర్వాత ఆటో ఎక్కాల్సి వచ్చిందని చెప్పింది షేక్.
మరోవైపు ఈ విషయంపై ఉబర్ స్పందించింది. డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. రైడర్ ట్రిప్ ఛార్జీని వాపసు చేసినట్లు ఉబెర్ తెలిపింది. విభిన్న బడ్జెట్‌లు, పరిమాణాలకు అనుగుణంగా ఉబర్ విభిన్న రైడ్ ఆప్షన్స్ అందిస్తుంది. Uber Go అనేది కస్టమర్‌లు హ్యాచ్‌బ్యాక్‌లు లేదా చిన్న కార్లను పొందే అత్యంత ప్రాథమిక, బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్. ఉబర్ ప్రీమియర్ అనేది Uber Go కంటే కొంచెం ఎక్కువ ధరలతో ఉన్న ఆప్షన్. అయితే అన్ని ఉబర్ కేటగిరీలలో ఎయిర్ కండిషనింగ్ మాత్రం అందుబాటులో ఉంది.