Viral Video: బ్యాంక్ దోపీడిని అడ్డుకున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు.. గన్ చూపించినా బెదరకుండా: వీడియో
Viral Video: బ్యాంక్ దోపిడీకి ప్రయత్నించిన ముగ్గురు దుండగులను.. ఇద్దరు మహిళా పోలీసులు నిలువరించారు. ధైర్యసాహసాలను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Viral Video: ఇద్దరు మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు వీరోచిత ధైర్యాన్ని ప్రదర్శించారు. దుండగులను నిలువరించి బ్యాంకు దోపిడీని (Bank Robbery) అడ్డుకున్నారు. తుపాకీ చూపించినా బెదరకుండా దుండగులను పట్టుకున్నారు. బిహార్ (Bihar) లోని వైశాలీ జిల్లా హిజిపూర్‌లో ఈ ఘటన జరిగింది. ఆయుధాలతో కూడిన ముగ్గురు వ్యక్తులు బుధవారం బ్యాంకులో ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. ఆ కానిస్టేబుళ్లు అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ సోషల్ మీడియా వైరల్‍గా మారింది.
ఇదీ జరిగింది..
సెందూవారి చౌక్‍లోని ఉత్తర్ బిహార్ గ్రామీణ బ్యాంకు ప్రవేశ ద్వారం (Entrance) వద్ద జూహి కుమారి, శాంతి కుమారి అనే ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు బ్యాంకులోకి హడావుడిగా ప్రవేశించారు. డాక్యుమెంట్లను చూపించాలని అడుగగా.. ఓ వ్యక్తి తుపాకీ తీసి బెదిరించాడు. ఆ సమయంలో జుహి, శాంతి ఏ మాత్రం భయపడకుండా వారి చేతులను పట్టుకున్నారు. దోపిడీ జరకుండా నిలువరించారు. ఇందుకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ బయటికి వచ్చింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. కాగా, కానిస్టేబుళ్లు నిలువరించడంతో బ్యాంకు దోపిడీ సాధ్యం కాదని భయపడిన ముగ్గురు దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
పాస్‍బుక్ అడిగితే తుపాకీ తీశారు
“బ్యాంకులో ఏమైనా పని ఉందా అని ఆ ముగ్గురిని నేను అడిగా. అవును అని వారు అన్నారు. అయితే పాస్‍బుక్ చూపించాలని వారిని అడిగా. అప్పుడు వారు గన్ బయటికి తీశారు” అని జూహి చెప్పారు. దుండగులను నిలువరించే క్రమంలో జూహీ గాయపడ్డారు.
“మా రైఫిళ్లను లాక్కునేందుకు వారు ప్రయత్నించారు. కానీ, ఏం జరిగినా సరే బ్యాంకును వారు దోచుకోకుండా అడ్డుకోవాలని మేం అనుకున్నాం. జూహి తన తుపాకీతో వారిని నిలువరించింది. కాల్చేందుకు సిద్ధమైంది. అప్పుడు వారు పరారయ్యారు” అని శాంతి చెప్పారు.
దోపిడీకి ప్రయత్నించి దుండగుల కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. “సెందూవారి వద్ద ఉదయం 11 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు బ్యాంకును దోపిడీ చేసేందుకు ప్రయత్నించారు. మా మహిళా కానిస్టేబుళ్లు అద్భుతమైన ధైర్యాన్ని చూపి, వారిని భయపెట్టి తరిమేశారు. ఫైరింగ్ జరలేదు. ఆ కానిస్టేబుళ్లను రివార్డులు అందిస్తాం” అని సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఓమ్ ప్రకాశ్ వెల్లడించారు.
బిహార్ పోలీసులు అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను ట్వీట్ చేశారు. “ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల సాహసోపేతమైన చర్య అభినందనీయం. వారు ధైర్యసాహసాలు ప్రదర్శించడం వల్లే వైశాలీలో బ్యాంకు దోపిడీ ప్రయత్నం ఆగింది” అని పోస్ట్ చేశారు.