Kashmir encounter: కశ్మీర్లో శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్లో ఐదుగురు భారతీయ జవాన్లు మృతి చెందారు.ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆర్మీ మేజర్ ఉధంపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జమ్మూకశ్మీర్లోని రాజౌరీ సెక్టార్లో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
జమ్మూకశ్మీర్లోని రాజౌరీ సెక్టార్లో ఉగ్రవాదుల కదలికలపై విశ్వసనీయ సమాచారం అందడంతో భారతీయ సైన్యం ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూంబింగ్ జరుపుతోంది. ముఖ్యంగా గత నెలలో సైనికులు వెళ్తున్న వాహనాన్ని ఉగ్రవాదులు పేల్చేయడంతో ఐదుగురు జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. నాటి నుంచి మిలిటెంట్ల కోసం ఆర్మీ తీవ్రంగా గాలిస్తోంది. రాజౌరీ సెక్టార్లోని కంది అటవీ ప్రాంతంలోని సంక్లిష్ట పర్వత ప్రదేశంలో చిక్కుకుపోయిన కొందరు ఉగ్రవాదులు ఆర్మీ సెర్చ్ టీమ్ కు శుక్రవారం ఉదయం ఎదురయ్యారు. ఆర్మీ జవాన్లను చూడగానే ఉగ్రవాదులు వారిపై కాల్పులు ప్రారంభించారు. హ్యాండ్ గ్రెనేడ్లను, బాంబులను విసిరారు. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక ఆఫీసర్ సహా నలుగురు సైనికులు గాయపడ్డారు. వెంటనే తేరుకున్న సైనికులు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. గాయపడిన సైనికులను ఉధంపూర్ లోని ఆర్మీ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో మరో ముగ్గురు జవాన్లు చనిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆర్మీ మేజర్ కు చికిత్స కొనసాగుతోంది. ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.