ఆపరేషన్ సిందూర్ సందర్భంగా తన మిత్రదేశం పాకిస్థాన్‌కు సహకరించిన టర్కీపై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. భారత్‌లోని తొమ్మిది ప్రధాన విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టర్కీ కంపెనీ సెక్యూరిటీ క్లియరెన్స్‌ను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) రద్దు చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా సెలెబి ఏవియేషన్‌కు ఇచ్చిన సెక్యూరిటీ క్లియరెన్స్‌ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో తెలిపింది.
సెలెబి నుంచి ప్రకటన రావాల్సి ఉంది. సెలెబి అనేది ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, కన్నూర్, చెన్నై.. ఇలా మెుత్తం తొమ్మిది విమానాశ్రయాల్లో పనిచేసే గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ. విదేశీ విమానయాన సంస్థలు, కార్గో ఆపరేటర్లకు కూడా సెలెబి సేవలను అందిస్తుంది.
టర్కీకి చెందిన సెలెబి ఏవియేషన్ ఇండియాలో పలు విమానాశ్రయాల్లో సెక్యూరిటీ సేవలు అందిస్తోంది. సెలెబి ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ఇండియా పేరుతో ఇక్కడ గ్రౌండ్ హ్యాండ్లింగ్ కార్యకలాపాలు చేస్తోంది. ప్రత్యేకంగా దిల్లీలోనూ కార్గో సేవలను అందిస్తోంది. ఈ సంస్థ అత్యంత కీలకమైన భద్రతా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గ్రౌండ్‌లో విమానాలకు నిర్దేశం చేసే ర్యాంప్ సర్వీస్‌తోపాటుగా అనేక కార్యకలాపాలు చూస్తుంది.
భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో టర్కీ.. పాక్‌కు సాయం చేసిన విషయం తెలిసిందే. గతంలో భారత్ చేసిన సాయాన్ని మరిచిపోయిందని దేశంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. బాయ్‌కాట్ టర్కీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు డ్రోన్లు, క్షిపణలు ఇవ్వాల్సిన అవసరం ఏం వచ్చిందని విమర్శలు వచ్చాయి. దీంతో అక్కడకి వెళ్దామని టికెట్స్ బుక్ చేసుకున్నవారు కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. చాలా ట్రావెల్ ఏజెన్సీలు బుకింగ్స్ నిలిపివేశాయి.
మరోవైపు జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) సహా పలు విద్యాసంస్థలు టర్కీ విశ్వవిద్యాలయాలతో సహకారాన్ని నిలిపివేశాయి. టర్కీలోని ఇన్నోను విశ్వవిద్యాలయంతో జెఎన్‌యూ తన అవగాహన ఒప్పందాన్ని నిలిపివేసింది. 'జాతీయ భద్రత దృష్ట్యా జెఎన్‌యూ ఎంఓయూను నిలిపివేసింది.' అని జెఎన్‌యూ వైస్ ఛాన్సలర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ ఒక ప్రకటనలో తెలిపారు.