Turkey Fire Accident : టర్కీలోని హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 66 మంది మృతి
Turkey Fire Accident : టర్కీలోని ఒక హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 66 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. ఈ ఘోర అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
టర్కీ స్కీ రిసార్ట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జనవరి 21, తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రమాదం సంభవించింది. దేశంలోని వాయువ్య ప్రాంతంలోని పర్వతాల మధ్య కొండపై నిర్మించిన స్కీ రిసార్ట్ కమ్ హోటల్ కర్తాల్‌కయాలో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 66 మంది మరణించగా చాలా మందికి గాయాలు అయ్యాయి.
అగ్నిప్రమాదాన్ని టర్కీ మంత్రి అలీ యెర్లికాయ ధృవీకరించారు. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు మృత దేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదం తర్వాత 30 అగ్నిమాపక వాహనాలు, 25 అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి వచ్చాయి.
హోటల్‌లోని 11వ అంతస్తులో మంటలు చెలరేగాయని, వెంటనే కింది అంతస్తుల్లో మంటలు వ్యాపించాలని బోలు గవర్నర్ అబ్దుల్ అజీజ్ ఐడిన్ మీడియాకు తెలిపారు. హోటల్ నుంచి పెద్ద ఎత్తున మంటలు రావడంతో హోటల్‌లో ఉన్న 234 మంది అతిథులు భయాందోళనకు గురై తమ గదుల కిటికీల నుంచి దూకడం ప్రారంభించారు. అంత ఎత్తు నుండి దూకడం వల్ల కూడా కొందరు మరణించారు. మరికొందరు గాయపడ్డారు.
తాము సెలవుల కోసం వచ్చామని, ఇలాంటి ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు చెబుతున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
కర్తాల్‌కయా రిసార్ట్ కమ్ హోటల్ టర్కిలోని కొరోగ్లు పర్వతాల దిగువ ప్రాంతంలో నిర్మించారు. ఇది టర్కిలోని ప్రసిద్ధ స్కీ రిసార్ట్. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌కు తూర్పున 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాఠశాల సెలవులు కారణంగా రిసార్ట్ జనాలతో నిండిపోయింది. అదే సమయంలో ఈ ప్రమాదం జరిగింది.