TTD : అమెరికాలో వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవాలు-ttd kalyanotsavam in us city dallas ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ttd Kalyanotsavam In Us City Dallas

TTD : అమెరికాలో వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవాలు

HT Telugu Desk HT Telugu
Jun 26, 2022 12:34 PM IST

రెండేళ్ల విరామం తర్వాత అమెరికాలో శ్రీవారి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో అమెరికాలోని పలు నగరాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు.

అమెరికాలో ఘనంగా శ్రీవారి కళ్యాణోత్సవాలు
అమెరికాలో ఘనంగా శ్రీవారి కళ్యాణోత్సవాలు

అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీనివాస కళ్యాణాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున డల్లాస్ నగరంలో కన్నుల పండువగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. కళ్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. డల్లాస్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అమెరికాలోని 9 నగరాల్లో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జూన్ 18 న శాన్ ఫ్రాన్సిస్కో - బే ఏరియాలో, 19 న సియాటెల్ లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. తితిదే నుండి వెళ్ళిన అర్చకులు వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం కళ్యాణాన్ని నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ APNRTS సహకారంతో టీటీడీ, ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గాలతో సమన్వయం చేస్తూ ఎక్కడ, ఏ లోటు రాకుండా శాస్త్రం ప్రకారం కళ్యాణోత్సవాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తోంది. రెండేళ్ల తర్వాత జరుగుతున్న కార్యక్రమాలకు అశేష సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. కళ్యాణ ఘట్టాన్ని తిలకించి భక్తిపరవశంతో పులకరిస్తున్నారు. కళ్యాణోత్సవాలకు హాజరయ్యే భక్తులందరికీ తిరుమల నుండి తెచ్చిన లడ్డూ ప్రసాదం అందిస్తున్నారు.

కళ్యాణోత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వై వి సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. శాన్ ఫ్రాన్సిస్కో - బే ఏరియాలోని ఎస్వి సిద్ధి వినాయక స్వామి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో దేశంలోని వివిధ ప్రాంతాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు సుబ్బారెడ్డి చెప్పారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా తమ స్వస్థలాలకు రాలేక, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం నోచుకోని వేలాది మంది భక్తుల కొరకు అమెరికాలో కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.

అమెరికాలోని 9 నగరాల్లో కళ్యాణోత్సవాలు అక్కడి కార్యనిర్వాహక వర్గాల తోడ్పాటుతో నిర్వహిస్తున్నామని ఏపిఎన్‌ఆర్‌టిఎస్‌ అధ్యక్షుడు మేడపాటి వెంకట్ తెలిపారు. జూన్ 25 న డల్లాస్, 26 న సెయింట్ లూయిస్ లలో వైభవంగా కళ్యాణం జరుపుటకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. జూన్ 30న చికాగో, జూలై 2 న న్యూ ఆర్లీన్స్, 3న వాషింగ్టన్ డి.సి., 9 న అట్లాంటా, 10 న బర్మింగ్ హామ్ – అలబామా లలో శ్రీవారి కళ్యాణం నిర్వహిస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్