Trump's citizenship deadline: జన్మత: పౌరసత్వంపై ట్రంప్ ఆదేశాలు; సిజేరియన్ కోసం పరుగులు తీస్తున్న భారతీయ జంటలు
Trump's citizenship deadline: అమెరికాలో జన్మించే పిల్లలకు సహజంగా లభించే పౌరసత్వానికి సంబంధించి గడువు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన తాజా ఆదేశాలు.. భారతీయ జంటల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
Trump's citizenship deadline: అమెరికాలో జన్మించే పిల్లలకు సహజంగా లభించే పౌరసత్వానికి సంబంధించి గడువు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆదేశాలు ఇచ్చారు. దాంతో, ప్రస్తుతం గర్భంతో ఉండి, త్వరలో డెలివరీలు ఉన్న జంటలు సిజేరియన్ కోసం ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ట్రంప్ పౌరసత్వ గడువును అధిగమించడానికి అమెరికాలోని భారతీయ జంటలు సి-సెక్షన్ కోసం తొందరపడుతున్నారు.

ముందస్తు జననాల కోసం..
అమెరికాలో ఉన్న భారతీయ జంటలు ప్రసూతి క్లినిక్‌లకు వెళుతున్నారు. ముందస్తు జననాల కోసం అడుగుతున్నారు. ఫిబ్రవరి 20 నుండి జన్మహక్కు పౌరసత్వాన్ని ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు దీనికి కారణం. ఈ నేపథ్యంలో, డెలివరీ సమయం రాకముందే సీ సెక్షన్ ద్వారా డెలివరీ చేస్తే తల్లి, బిడ్డల ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు ఆందోళన చెందుతున్నారు.
ఫిబ్రవరి 20 వరకే..
జననహక్కు నిషేధ గడువును అధిగమించడానికి అమెరికాలో ముందస్తు ప్రసవాల కోసం భారతీయ జంటలు క్యూ కడుతున్నారు. ఫిబ్రవరి 20కి ముందు డెలివరీ జరగాలని కోరుకుంటున్నారు. అందుకోసం వైద్యులకు ఫోన్ చేసి సి-సెక్షన్ల కోసం అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు ప్రకారం జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేయడానికి ఫిబ్రవరి 20వ తేదీ గడువు కావడంతో, ఆ లోపే డెలివరీ కావాలని భారతీయ దంపతులతో పాటు యూఎస్ లో ఉంటున్న విదేశీ జంటలు కోరుకుంటున్నారు. అయితే, అలా ప్రసవ సమయం రాకముందే డెలివరీలు చేయడం ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.
ఫిబ్రవరి 20 ఎందుకు?
అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ట్రంప్ (donald trump) సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులలో ఒకటి అమెరికాలో జన్మహక్కు పౌరసత్వాన్ని ముగించడం. కాబట్టి, ఫిబ్రవరి 19 వరకు అమెరికా (usa news telugu) లో జన్మించిన పిల్లలు అమెరికన్ పౌరులుగా జన్మిస్తారు. ఫిబ్రవరి 19 తర్వాత, అమెరికా పౌరులు కాని జంటలకు జన్మించిన పిల్లలు సహజ అమెరికన్ పౌరులు కారు. అమెరికాలో తాత్కాలిక H-1B, L1 వీసాలపై పదివేల మంది భారతీయులు పనిచేస్తున్నారు. అమెరికాలో శాశ్వత నివాసం కల్పించే గ్రీన్ కార్డుల కోసం కూడా వారు క్యూలో ఉన్నారు. తల్లిదండ్రులలో ఎవరూ అమెరికన్ పౌరులు లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్లు కానట్లయితే, వారికి ఫిబ్రవరి 20 నుంచి జన్మించే పిల్లలకు పుట్టుకతో లభించే US పౌరసత్వం లభించదు.
వైద్యుల ఆందోళన
ట్రంప్ ఆదేశాల నేపథ్యంలో, తమ పిల్లలు యూఎస్ పౌరులు కావాలన్న ఉద్దేశంతో, పలువురు దంపతులు నెలలు నిండకముందే సిజేరియన్ ద్వారా పిల్లలకు జన్మనివ్వాలని కోరుకుంటున్నారు. ఎనిమిది, తొమ్మిది నెలల గర్భంతో ఉన్నవారు కూడా సీ- సెక్షన్ కోరుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. డెలివరీకి మూడు నెలల సమయం ఉన్నవారు కూడా తమను సిజేరియన్ కోసం సంప్రదిస్తున్నారని, అది ప్రమాదకరమని వారికి వివరిస్తున్నామని వైద్యులు తెలిపారు. ‘‘అకాల జననాల వల్ల తల్లి బిడ్డల ప్రాణాలకు ముప్పు ఉంటుంది. ఆ పిల్లల్లో అభివృద్ధి చెందని ఊపిరితిత్తులు, తక్కువ జనన బరువు, నాడీ సంబంధిత సమస్యలు, ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయి’’ అని హెచ్చరిస్తున్నారు.