Donald Trump On Gaza : గాజా నుంచి వచ్చే జనాలకు ఆశ్రయం ఇవ్వండి.. జోర్డాన్, ఈజిప్ట్‌కు డోనాల్డ్ ట్రంప్ సూచన!-trump wants egypt and jordan to take palestinians for clean out gaza ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Donald Trump On Gaza : గాజా నుంచి వచ్చే జనాలకు ఆశ్రయం ఇవ్వండి.. జోర్డాన్, ఈజిప్ట్‌కు డోనాల్డ్ ట్రంప్ సూచన!

Donald Trump On Gaza : గాజా నుంచి వచ్చే జనాలకు ఆశ్రయం ఇవ్వండి.. జోర్డాన్, ఈజిప్ట్‌కు డోనాల్డ్ ట్రంప్ సూచన!

Anand Sai HT Telugu
Jan 26, 2025 07:26 PM IST

Donald Trump On Gaza : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా గాజా గురించి కామెంట్స్ చేశారు.

డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో)
డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో) (AP)

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలపై అందరి దృష్టి పడుతుంది. అమెరికా ఫస్ట్ పాలసీ, కెనడా వంటి అనేక దేశాలకు వార్నింగ్‌లు ఇవ్వడంలో ట్రంప్ ఎక్కడ తగ్గినట్టుగా కనిపించడం లేదు. గాజా విషయంలో తాజాగా డొనాల్డ్ ట్రంప్ పెద్ద ప్రకటన చేశారు. జోర్డాన్, ఈజిప్ట్ కలిసి గాజాను స్వాధీనం చేసుకోవాలని, తద్వారా అక్కడ శాంతి నెలకొంటుందని ట్రంప్ అన్నారు.

yearly horoscope entry point

జోర్డాన్ ఈజిప్ట్‌కు సూచన

శనివారం గాజాకు సంబంధించి ప్రకటన చేశారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా II, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసితో ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. గాజా నుంచి వచ్చే శరణార్థులకు ఇరు దేశాలు తమ దేశాల్లో ఆశ్రయం ఇవ్వాలని కోరారు. దీని గురించి చాలా అరబ్ దేశాలతో కూడా మాట్లాడుతున్నానని ట్రంప్ అన్నారు. గాజా ప్రజలను ఇతర దేశాలలో పునరావాసం కల్పించడం ద్వారా గాజాను ఖాళీ చేయాలన్నారు.

గాజాలో అశాంతి

15 నెలల యుద్ధం తర్వాత గాజాలో తీవ్ర అశాంతి నెలకొందని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక్కడ శాంతిని నెలకొల్పడానికి గాజాను కొత్తగా అభివృద్ధి చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. 'గాజాలో 10-15 లక్షల మంది నివసిస్తున్నారు. వారిని ఇతర దేశాల్లో సెటిల్ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. పాలస్తీనా నుంచి వచ్చే శరణార్థులకు జోర్డాన్ దేశంలో ఆశ్రయం ఇచ్చింది. వారు గాజా ప్రజలకు కూడా ఆశ్రయం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఆశ్రయం స్వల్ప కాలానికి లేదా చాలా కాలం వరకు ఉండవచ్చు.' అని ట్రంప్ అన్నారు.

అనేక యుద్ధాలు

గాజాపై అనేక యుద్ధాలు జరిగాయని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇప్పుడు ఈ స్థలం చెత్తాచెదారంలా మారిపోయిందన్నారు. అంతా నాశనమైపోయిందని, ప్రజలను చంపుతున్నారని చెప్పారు. దీని గురించి చాలా అరబ్ దేశాలతో మాట్లాడానని అన్నారు. గాజా ప్రజలకు ఇళ్లు కట్టిస్తామన్నారు. అక్కడ వారు శాంతియుతంగా కొత్త జీవితాన్ని ప్రారంభించగలుగుతారన్నారు.

గాజాపై ట్రంప్ ప్రకటన చేయడం ఇదే తొలిసారి కాదు. జనవరి 20న తన ప్రమాణ స్వీకారోత్సవంలో, గాజా సముద్ర తీరంలో ఉన్న అసాధారణ ప్రదేశం అని కూడా అన్నారు. అక్కడ వాతావరణం చాలా బాగుందని చెప్పారు. గాజాను వేరే విధంగా పునర్నిర్మించాలని వ్యాఖ్యానించారు.

ఏడాదికిపైగా యుద్ధం

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ జనవరి 19 నుండి అమల్లోకి వచ్చింది. దాదాపు ఏడాదికిపైగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగింది. అనేక మంది మరణించారు. ఒప్పందలో భాగంగా హమాస్ చెరలో ఉన్న 90 మంది ఇజ్రాయెల్‌కు చెందినవారిని విడుతల వారీగా విడుదల చేస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీయన్లు కూడా విడుదల అవుతున్నారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.