భారత్ పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ సహా 12 దేశాల పౌరులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం పూర్తి స్థాయి ట్రావెల్ బ్యాన్ విధించారు. ఇతర దేశాలలో మయన్మార్, ఇరాన్, లిబియా ఉన్నాయి. ఈ 12 దేశాలతో పాటు మరో 7 దేశాలపై పాక్షిక ఆంక్షలు విధించారు. ఈ కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సంతకం చేశారు.
ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాల నుంచి వచ్చే పౌరులపై ఈ డిక్లరేషన్ పూర్తిగా ఆంక్షలు విధించింది. అలాగే, బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్మెనిస్తాన్, వెనిజులా దేశాలకు పాక్షిక ఆంక్షలు వర్తిస్తాయని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆఫ్ఘనిస్తాన్ పై తాలిబన్ నియంత్రణ, ఇరాన్, క్యూబా ప్రభుత్వాలు ఉగ్రవాదానికి మద్ధతు ఇవ్వడాన్ని ఉటంకిస్తూ వైట్ హౌస్ ఈ ఆంక్షలను సమర్థించింది. బైడెన్ పాలనలో హైతీ నుంచి అక్రమ వలసదారులు భారీగా రావడం, చాద్, ఎరిత్రియాల పౌరుల ఓవర్ స్టే రేటు అధికంగా ఉండడం వంటి కారణాలతో ఆయా దేశాలపై అమెరికా ట్రావెల్ బ్యాన్ విధించింది.
కొలరాడోలో యూదుల నిరసనపై దాడి చేసినందుకే తాను ట్రావెల్ బ్యాన్ పై సంతకం చేశానని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కొలరాడోలోని బౌల్డర్ లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి సరైన తనిఖీలు చేయని విదేశీయుల ప్రవేశం వల్ల మన దేశానికి పొంచి ఉన్న తీవ్ర ప్రమాదాలను నొక్కి చెప్పిందని ట్రంప్ వీడియో సందేశంలో పేర్కొన్నారు. అధిక ఓవర్ స్టే రేట్లు లేదా చట్టాల అమలులో తగినంత సహకారం లేకపోవడం వల్ల బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్మెనిస్తాన్, వెనిజులాలపై పాక్షిక ఆంక్షలు విధించినట్లు చెప్పారు. ఈ దేశాల వలస, వలసేతర వీసాలను (బి -1, బి -2, బి -1 / బి -2, ఎఫ్, ఎం, జె) పరిమితం చేస్తున్నట్లు వెల్లడించారు.
కొన్ని దేశాల పౌరులను అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడం ఇదే మొదటిసారి కాదు. రిపబ్లికన్ నేత 2017 నుంచి తన మొదటి పదవీకాలంలో ఏడు మెజారిటీ ముస్లిం దేశాల ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆ విధానాన్ని 2018లో అమెరికా సుప్రీంకోర్టు సమర్థించింది. ట్రంప్ తరువాత అధికారంలోకి వచ్చిన డెమొక్రాట్ అధ్యక్షుడు జో బైడెన్ 2021లో ఈ కార్యనిర్వాహక ఉత్తర్వులను రద్దు చేశారు.