Donald Trump: ‘‘లింకన్ తరువాత నేనే.. నన్ను అలా ప్రశ్నిస్తారా?’’ అంటూ బ్లాక్ జర్నలిస్ట్ లపై మండిపడిన ట్రంప్-trump rips reporter for asking him why should black voters trust you ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Donald Trump: ‘‘లింకన్ తరువాత నేనే.. నన్ను అలా ప్రశ్నిస్తారా?’’ అంటూ బ్లాక్ జర్నలిస్ట్ లపై మండిపడిన ట్రంప్

Donald Trump: ‘‘లింకన్ తరువాత నేనే.. నన్ను అలా ప్రశ్నిస్తారా?’’ అంటూ బ్లాక్ జర్నలిస్ట్ లపై మండిపడిన ట్రంప్

HT Telugu Desk HT Telugu

అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా షికాగోలోని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్ లతో జరిగిన చర్చకు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్లాక్ జర్నలిస్ట్ లు అడిగిన ప్రశ్నలకు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లజాతి ప్రజల కోసం అబ్రహం లింకన్ తరువాత తానే ఎక్కువ కృషి చేశానన్నారు.

బ్లాక్ జర్నలిస్ట్ లతో ట్రంప్ చర్చాకార్యక్రమం (AFP)

షికాగోలోని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్ ముందు హాజరైన సందర్భంగా ఆ కార్యక్రమానికి ఇంటర్వ్యూయర్ గా ఉన్న ఏబీసీ న్యూస్ కు చెందిన రాచెల్ స్కాట్ పై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. తనను ప్రశ్నించే విధానాన్ని తప్పుబడుతూ.. తనను ఇలాగేనా పరిచయం చేసేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బ్లాక్స్ మిమ్మల్ని ఎందుకు నమ్మాలి?

వేదిక పైకి వచ్చిన ట్రంప్ ను కనీసం పరిచయం కూడా చేయకుండా, ట్రంప్ ను నల్లజాతి ఓటర్లు ఎందుకు నమ్మాలని ప్రశ్నించిన మహిళా జర్నలిస్ట్, ఇంటర్వ్యూయర్ రాచెల్ స్కాట్ పై డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. "ఇది చాలా మొరటు పరిచయం" అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాచెల్ స్కాట్ తో ట్రంప్ వాగ్వాదం వైరల్ గా మారింది. ప్రారంభంలోనే స్కాట్ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పై ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. ‘‘బ్లాక్ డిస్ట్రిక్ట్ అటార్నీలను మీరు 'జంతువు', 'రాబిడ్' వంటి పదాలతో అవమానించారు. మీరు నల్లజాతి జర్నలిస్టులపై మాటల దాడి చేశారు. వారిని లూజర్స్, మూర్ఖులు అన్నారు. మీరు అలాంటి భాషను ఉపయోగించిన తర్వాత నల్లజాతి ఓటర్లు మిమ్మల్ని ఎందుకు విశ్వసించాలి?’’ అని స్కాట్ ట్రంప్ ను కఠినంగా ప్రశ్నించారు.

డొనాల్డ్ ట్రంప్ ప్రతి దాడి

స్కాట్ ప్రశ్నలపై ట్రంప్ సమాధానమిస్తూ, ఒక అధ్యక్ష అభ్యర్థి వేదికపైకి వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా పరిచయం చేయాలన్న కర్టెసీ కూడా మీకు లేదా? అని ఇంటర్వ్యూయర్ ను ప్రశ్నించారు. మర్యాద కోసమైనా 'హలో, ఎలా ఉన్నావు?' అని చర్చను ప్రారంభించకుండా, నేరుగా భయంకరమైన రీతిలో ప్రశ్నలు వేయడం ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లింకన్ తరువాత నేనే..

‘‘నేను మంచి స్ఫూర్తితో ఇక్కడికి వచ్చాను. నేను ఈ దేశంలోని నల్లజాతీయులను ప్రేమిస్తున్నాను. ఈ దేశంలోని నల్లజాతీయుల కోసం నేను చాలా చేశాను" అని ట్రంప్ అన్నారు. అబ్రహాం లింకన్ తర్వాత నల్లజాతీయులకు నేనే ఉత్తమ అధ్యక్షుడినని మాజీ అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించడంతో పాత్రికేయులు ట్రంప్ ను ఎగతాళి చేశారు. ఈ గదిలో చాలా మంది జర్నలిస్టులు నల్లజాతీయులేనని చెప్పారు. ‘‘సరిహద్దు నుండి అక్రమంగా దేశంలోకి వచ్చిన లక్షలాది మంది నల్లజాతీయులు బ్లాక్ జాబ్స్ ను తీసుకుంటున్నారు’’ అని ట్రంప్ (donald trump) వ్యాఖ్యానించగా.. "అసలు బ్లాక్ జాబ్ అంటే ఏమిటి సార్?" అని స్కాట్ ప్రశ్నించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. చట్టబద్ధంగా దేశంలో ఉంటున్న నల్లజాతీయుల ఉపాధిని అక్రమంగా దేశంలోకి వచ్చినవారు దూరం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభం కావడానికి ఈవెంట్ నిర్వాహకులే కారణమని ట్రంప్ ఆరోపించారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.