Modi Trump Meeting : ముందు టారీఫ్‌లు.. ఆ తర్వాత ట్రేడ్ డీల్స్! ట్రంప్- మోదీ భేటీ హైలైట్స్ ఇవే..
Modi Trump meeting : అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఇండియా సహా అనేక దేశాలపై ట్రంప్ టారీఫ్ పిడుగు వేసిన కొన్ని గంటల్లోనే ఈ భేటీ జరిగింది.
ఇండియాతో అద్భుతమైన ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, మిత్రపక్షం అన్న భేదం లేకుండా.. ఇండియా సహా అనేక దేశాలపై ట్రంప్ 'రెసిప్రొకల్ టారీఫ్' (పరస్పర సుంకం) ప్రకటించిన రెండు గంటల్లోనే ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ట్రంప్- మోదీ సమావేశానికి ముందు ఇలా..
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన మరుక్షణం నుంచి టారీఫ్‌ల ప్రకటనలతో ప్రపంచ దేశాలను బెంబెలెత్తిస్తున్న డొనాల్డ్ ట్రంప్.. గురువారం మిత్రదేశాలకు సైతం షాక్ ఇచ్చారు! అమెరికాతో ప్రపంచ దేశాలు చేసుకుంటున్న ఒప్పందాలు, వాటిపై ఆయా దేశాలు విధిస్తున్న సుంకాలపై అధ్యయనం చేసి, ప్రతిస్పందన టారీఫ్‌లు విధించే విధంగా యూఎస్ అఫీషియల్స్‌కి అన్ని అధికారాలను ఇస్తూ ఒక మెమొరాండంపై ట్రంప్ సంతకం చేశారు. అమెరికా ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తున్నారని, అందుకే ప్రతిస్పందిస్తున్నామని ట్రంప్ తేల్చిచెప్పారు.
ఇందులో భాగంగానే భారత్‌ని కూడా ట్రంప్ ప్రస్తావించారు.
"ఇతర దేశాలతో పోల్చినా, అమెరికాపై టారీఫ్‌లు ఎక్కువ వేస్తోంది భారత దేశమే!" అని ట్రంప్ అన్నారు. ఫలితంగా భారత్‌పైనా టారీఫ్ పిడుగు పడింది.
"చాలా దేశాలు మా నుంచి అధిక సుంకాలు వసూలు చేస్తున్నాయి. సమన్యాయం కోసం నేను రెసిప్రొకల్ టారీఫ్‌లు వేస్తున్నాను. ఎవరూ ఫిర్యాదు చేయకూడదు," అని మెమొరాండంపై సంతకం చేస్తూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
అయితే ఈ టారీఫ్‌లు ఏంటి? ఎప్పుడు అమల్లోకి వస్తాయి? అన్న విషయాలపై ట్రంప్ వివరణ ఇవ్వలేదు. వైట్‌హౌస్ సైతం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు సంతకం చేసినప్పటికీ, టారీఫ్‌ల అమలుకు కొన్ని వారాలు లేదా నెలల సమయం పడుతుందని తెలుస్తోంది.
తమ మీద ఏ దేశం.. ఎంత సుంకాలు విధిస్తోందో, తాము కూడా అంతే వసులూ చేస్తామని ట్రంప్ చెబుతున్నారు. ఇదే నిజమైతే, భారత్‌కు భారీ షాక్ తప్పకపోవచ్చు! అమెరికా వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తున్న దేశాల్లో ఇండియా బహుశా టాప్‌లో ఉంటుంది! వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకారం అమెరికా వస్తువులపై భారత్ సగటున 17శాతం టారీఫ్ రేట్లు విధిస్తుంది. కానీ అమెరికా ప్రస్తుతం భారత వస్తువులపై 3.3శాతం సుంకాల భారం వేస్తోంది.
అయితే, ఇదంతా.. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ, ట్రంప్‌ని కలవక ముందు జరిగిన విషయం. వీరిద్దరి సమావేశంతో భారత్‌కు ఊరట లభిస్తుందని అందరు భావించారు.
ట్రంప్- మోదీ సమావేశం తర్వాత ఇలా..
ఇక వైట్‌హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం తర్వాత భారత్‌తో సంబంధాలపై సానుకూలంగా స్పందించారు ట్రంప్. రానున్న రోజుల్లో ఇండియాతో అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటామని ప్రకటించారు.
"ఇండియా మా నుంచి చాలా చాలా చమురు- గ్యాస్‌ని కొనుగోలు చేస్తుంది. రానున్న కాలంలో ఇండియాతో అనేక అద్భుతమైన ట్రేడ్ డీల్స్ చేసుకుంటాము," అని ట్రంప్ అన్నారు.
"ఇండో-పెసిఫిక్ ప్రాంతంలో శాంతిని కొనసాగించేందుకు అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియాలు కలిసి ఉండాలని ఈ సమావేశంలో నేను మోదీ నిర్ణయించాము," అని ట్రంప్ అన్నారు.
మరోవైపు భారత్‌కి ఎఫ్-35 ఫైటర్ జెట్స్‌ని విక్రయించనున్నట్టు ట్రంప్ ప్రకటించారు.
"ఈ ఏడాది నుంచి భారత్‌తో మిలిటరీ సేల్స్‌ని భారీగా పెంచుతున్నాము. ఇండియాకు ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్‌ని విక్రయిస్తాము," అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఈ ఎఫ్-35.. ప్రపంచ డిఫెన్స్ చరిత్రలోనే అత్యాధునిక, స్టేట్-ఆఫ్- ఆర్ట్ జెట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే, భారత్‌కు ఇంతకాలం వీటిని విక్రయించకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది! డిఫెన్స్ విషయంలో ఇండియాకు రష్యాతో సత్ససంబంబంధాలు ఉన్నాయి. రష్యాను అమెరికా శత్రువుగా చూస్తుందన్న విషయం తెలిసిందే. భారత్‌కు ఫైటర్ జెట్స్ విక్రయిస్తే, ఈ టెక్నాలజీని ప్రత్యర్థులు దొంగలిస్తారేమో అని అమెరికా ఇంతకాలం ఆందోళనపడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఇండియాకి ఎఫ్-35 ఫైటర్ జెట్స్‌ని విక్రయించేందుకు సిద్ధమైంది.
భారత్- అమెరికా దేశాలు సంయుక్తంగా తమ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేసి 500 బిలియన్ డాలర్లకు చేర్చే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయని నరేంద్ర మోదీ ప్రకటించారు. రెండు దేశాలు త్వరలోనే పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందంపై పనిచేస్తాయని తెలిపారు.
ఇండియాకు తహావుర్ రాణా..!
26/11 ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహావుర్ రాణాని భారత్‌కు పంపించనున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ప్రధానమంత్రి మోదీతో భేటీ అనంతరం జరిగిన సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.
సంబంధిత కథనం