Trump wins: ట్రంప్ విజయం లాంఛనమే; దేశవ్యాప్తంగా పెరిగిన మద్ధతు; స్టాక్ మార్కెట్ దూకుడు
Trump wins: నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ కు అమెరికా దేశ వ్యాప్తంగా ప్రజాదరణ భారీగా పెరిగింది. ఈ ఎన్నికల్లో ట్రంప్ విజేతగా నిలిచాడని ఫాక్స్ న్యూస్ ప్రకటించింది. మిగతా మేజర్ వార్తా సంస్థలేవీ ఇంకా నిర్దిష్టంగా ప్రకటించలేదు. తానే విజేతగా నిలిచానని ట్రంప్ ప్రకటించారు.
Trump wins: 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమొక్రాట్ కమలా హారిస్ ను ఓడించారని ఫాక్స్ న్యూస్ ప్రకటించింది. అనంతరం, పామ్ బీచ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్ వద్ద బుధవారం తెల్లవారుజామున తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా తమకు అపూర్వమైన, శక్తివంతమైన తీర్పును ఇచ్చిందన్నారు.
అమెరికా గ్రేట్ అగైన్
తన ఎన్నికల ప్రచార నినాదమైన ‘విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ ను ట్రంప్ మరోసారి గుర్తు చేశారు. కాగా, ఫాక్స్ న్యూస్ మినహా ఇతర వార్తా సంస్థలు ట్రంప్ గెలుపును ఇంకా ప్రకటించలేదు. స్వింగ్ రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియాలను ట్రంప్ క్లీన్ స్వీప్ చేశారు. మిగిలిన నాలుగు స్వింగ్ స్టేట్స్ లో కూడా ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారని, ట్రంప్ విజయం దాదాపు ఖాయమేనని ఎడిసన్ రీసెర్చ్ తెలిపింది.
హ్యారిస్ ప్రసంగం లేదు.
కాగా, ట్రంప్ విజయం దాదాపు ఖాయమైన పరిస్థితుల్లో.. తన ప్రసంగాన్ని కమల హ్యారిస్ రద్దు చేసుకున్నారు. పూర్తి ఫలితాలు వెలువడిన తరువాత కమలా హారిస్ బహిరంగంగా ప్రసంగిస్తారని ఆమె ప్రచార కో-చైర్మన్ సెడ్రిక్ రిచ్మండ్ తెలిపారు. ఇంకా ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉందన్నారు.
దేశవ్యాప్తంగా హవా..
మాజీ అధ్యక్షుడు ట్రంప్ (donald trump) గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ కేంద్రాల వరకు ప్రతిచోటా తన 2020 నాటి ఫలితాలను మెరుగుపరుస్తూ దేశవ్యాప్తంగా బలాన్ని చూపిస్తున్నారు. 2021 జనవరి 6న యూఎస్ కాంగ్రెస్ పై ట్రంప్ మద్ధతుదారుల దాడి అనంతరం ఆయన రాజకీయ జీవితం ముగిసిందని పలువురు రాజకీయ పండితులు ప్రకటించారు. అయితే, వైట్ హౌజ్ ను తిరిగి స్వాధీనం చేసుకోవడం లక్ష్యంగా ట్రంప్ ఎన్నికలకు వెళ్లారు. 2020లో జరిగిన గత అధ్యక్ష ఎన్నికల తరువాత నుంచి ధరల పెరుగుదల కష్టాలను తీవ్రంగా అనుభవించిన హిస్పానిక్స్, సంప్రదాయక డెమొక్రటిక్ ఓటర్లు, అల్పాదాయ కుటుంబాల నుంచి ట్రంప్ కు ఎక్కువ మద్దతు లభించిందని ఎడిసన్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
పెరిగిన మద్దతు
2020 ఓటమి తరువాత ట్రంప్ మద్ధతు దేశవ్యాప్తంగా గణనీయంగా పెరిగింది. హిస్పానిక్ ఓటర్లలో 45% ట్రంప్ కు సపోర్ట్ చేశారు. అమెరికన్లు ముఖ్యంగా ఈ సారి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టగల వ్యక్తికి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నట్లు, అందుకే ట్రంప్ వైపు మొగ్గు చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 45 శాతం మంది ఓటర్లు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే నేడు అధ్వాన్నంగా ఉందని ఒక సర్వేలో తెలిపారు.
స్టాక్ మార్కెట్ హవా
మంగళవారం అర్థరాత్రి ట్రంప్ విజయంతో స్టాక్ మార్కెట్ (stock market) సానుకూలంగా స్పందించింది. గ్లోబల్ ఇన్వెస్టర్లు భారీగా ధరలు పెంచారు. యుఎస్ స్టాక్ ఫ్యూచర్స్, డాలర్ పైకి కదిలాయి. ట్రెజరీ ఈల్డ్స్ పెరిగాయి. బిట్ కాయిన్ పెరిగింది. ఇవన్నీ ట్రంప్ విజయానికి అనుకూలమైన ట్రేడింగ్స్ గా విశ్లేషకులు భావిస్తున్నారు.