అమెరికాను షేక్​ చేస్తున్న బిగ్​ బ్యూటిఫుల్​ బిల్లు- ఎన్​ఆర్​ఐలు, భారతీయులపై ప్రభావం ఎంత?-trump big beautiful bill effect on indians from sending money to investments and migration ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  అమెరికాను షేక్​ చేస్తున్న బిగ్​ బ్యూటిఫుల్​ బిల్లు- ఎన్​ఆర్​ఐలు, భారతీయులపై ప్రభావం ఎంత?

అమెరికాను షేక్​ చేస్తున్న బిగ్​ బ్యూటిఫుల్​ బిల్లు- ఎన్​ఆర్​ఐలు, భారతీయులపై ప్రభావం ఎంత?

Sharath Chitturi HT Telugu

అమెరికాను షేక్​ చేస్తున్న ట్రంప్​ ‘బిగ్​ బ్యూటిఫుల్​ బిల్లు’ ప్రభావం భారతీయులపై ఎంత ఉంటుంది? ఎన్​ఆర్​ఐలపై ఎంత ఉంటుంది? నిపుణుల విశ్లేషణను ఇక్కడ తెలుసుకోండి..

వైట్​హౌస్​లో ప్రధాని మోదీ- ట్రంప్​ ఫొటో.. (Reuters/File)

అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తీసుకొచ్చిన ‘బిగ్​ బ్యూటిఫుల్​ బిల్లు’ ఇప్పుడు అమెరికాను షేక్​ చేస్తోంది. దీనికి సానుకూలంగా- వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే, ట్రంప్​ బిల్లు అమెరికానే కాదు భారత్​ను, భారతీయులను కూడా ప్రభావితం చేస్తుంది. ఎన్​ఆర్​ఐలు భారతదేశానికి పంపే లేదా పెట్టుబడి పెట్టే డబ్బు, అంటే రెమిటెన్స్​లపై అత్యధిక ప్రభావం ఉంటుంది. వలసల విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ట్రంప్ “వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్” అని పేరు పెట్టిన 900 పేజీల వివరాలు ఇప్పుడు వెలువడ్డాయి కాబట్టి, భారతీయులపై తక్షణ ప్రభావాలను ఇక్కడ విశ్లేషిద్దాము..

భారత్​కు డబ్బు పంపడంపై ఛార్జీలు

అమెరికా నుంచి విదేశాలకు పంపే రెమిటెన్స్‌లపై మొదట ప్రతిపాదించిన 5 శాతం పన్నును తుది బిల్లులో కేవలం 1 శాతానికి తగ్గించారు. ఇది ఇప్పుడు ఆమోదం పొందింది. అమెరికాలో సుమారు 4.5 మిలియన్లు లేదా 45 లక్షల మంది భారతీయ పౌరులు/ భారత సంతతికి చెందినవారు ఉన్నారు. వీరిలో చాలామంది భారతదేశంలోని తమ కుటుంబాలకు పెద్ద మొత్తంలో డబ్బు పంపుతారు.

"అమెరికా బ్యాంక్, కార్డ్ ఆధారిత రెమిటెన్స్‌లకు మినహాయింపు కొనసాగుతుంది. కానీ అధిక విలువ కలిగిన లేదా తరచుగా బదిలీలు చేసే ఎన్​ఆర్​ఐలు తమ ఆర్థిక ప్రణాళికలను పునఃపరిశీలించాల్సి రావచ్చు," అని ది గార్డియన్స్ రియల్ ఎస్టేట్ అడ్వైజరీ కో-ఫౌండర్, డైరెక్టర్ రామ్ నాయక్ హెచ్‌టీకి తెలిపారు.

కొత్త రూల్​ జనవరి 1, 2026 నుండి అమల్లోకి వస్తుంది.

విదేశీ ఆదాయంపై పన్ను

గ్రీన్ కార్డ్ లేదా అమెరికా పౌరసత్వం కలిగి ఉన్న ఎన్​ఆర్​ఐలు సహా అమెరికా నివాసితులు సంపాదించిన ఫారిన్​ రెంట్​ ఇన్​కమ్​పై ప్రస్తుత నిబంధనలలో ఎటువంటి మార్పులు లేవు.

"అటువంటి ఆదాయం ప్రస్తుత చట్టం ప్రకారం పన్ను విధిస్తారు," అని పన్ను, నియంత్రణ సలహా సేవల సంస్థ ధ్రువ అడ్వైజర్స్ భాగస్వామి సందీప్ భల్లా చెప్పారు. దీని అర్థం.. గతంలో లానే అదే ఆదాయంపై డబుల్ ట్యాక్సేషన్‌ను నివారించడానికి భారతదేశంలో చెల్లించిన పన్నును అమెరికాలో పన్ను క్రెడిట్‌గా క్లెయిమ్ చేసుకోవచ్చు.

"అమెరికాలో నివసిస్తున్న ఎన్​ఆర్​ఐలు భారతీయ ఆస్తి విక్రయంపై మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశంలో చెల్లించిన పన్నులకు వారు విదేశీ పన్ను క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఈ బిల్లు రెమిటెన్స్‌లపై పెట్టిన ప్రాధాన్యత, ముఖ్యంగా 2025 తర్వాత, అమెరికాకు తిరిగి పంపే అమ్మకాల రాబడిపై ప్రభావం చూపవచ్చు," అని ది నాయక్ పేర్కొన్నారు.

సరిహద్దు నిఘా

భారతదేశం నుంచి వచ్చే వలసదారులు, ముఖ్యంగా అక్రమ సరిహద్దు దాటినవారు, 'డాంకీ రూట్' (డబ్బులు కట్టి అక్రమంగా దేశంలోకి ప్రవేశించడం) ద్వారా వెళ్లిన వారు ట్రంప్ బిల్లులో ప్రతిపాదించిన కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. "అమెరికన్ చరిత్రలో అతిపెద్ద సామూహిక బహిష్కరణ ఆపరేషన్" ను నిర్వహించాలనే ట్రంప్ హామీకి అనుగుణంగా, ఇమ్మిగ్రేషన్ నియంత్రణ, జాతీయ భద్రతా ప్రయత్నాల కోసం బిలియన్ల కొద్దీ అదనపు నిధులను ఈ బిల్లు కేటాయిస్తుంది.

అక్రమంగా ప్రవేశించిన సుమారు 18,000 మంది భారతీయ పౌరులను అమెరికా గుర్తించినట్లు నివేదికలు వచ్చాయి. భారత ప్రభుత్వం ఈ వ్యక్తులను తిరిగి వెనక్కి తీసుకుంటామని, "మానవ అక్రమ రవాణా వ్యవస్థను" ఛేదిస్తామని తెలిపింది.

బీబీసీ ఉటంకించిన పరిశోధన ప్రకారం, అమెరికా జనాభాలో 3% మంది అనధికార వలసదారులే ఉన్నారు. అయితే, వారిలో భారతీయుల సంఖ్యపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.అమెరికా ప్రభుత్వ డేటా ప్రకారం 2.2 లక్షల నుంచి ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం 7 లక్షల వరకు అంచనాలు ఉన్నాయి. మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత మూడొవ అతిపెద్ద సమూహంగా భారతీయులు ఉన్నారు. అయినప్పటికీ, అమెరికాలోని మొత్తం అనధికార వలస జనాభాలో భారతీయులు చాలా తక్కువ భాగాన్ని మాత్రమే కలిగి ఉన్నారు.

ఒక 2025 జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ పరిశోధన పత్రం ప్రకారం, అమెరికాలో అక్రమ భారతీయ జనాభా సంఖ్య, మొత్తం అనధికార వలసదారుల్లో వారి శాతం పెరిగింది. 1990లో 0.8% నుంచి 2015లో 3.9%కి పెరిగింది. అయితే, అందుబాటులో ఉన్న తాజా డేటా ప్రకారం 2022లో ఇది 2%కి తగ్గింది.

దరఖాస్తుల రుసుములు

అమెరికాలో చట్టబద్ధంగా ఉండాలనుకునే వారికి కూడా ట్రంప్ తీసుకొచ్చిన బిగ్​ బ్యూటిఫుల్​ బిల్లు ఖర్చులను పెంచుతుంది.

వర్క్ పర్మిట్‌లు, ఆశ్రయం దరఖాస్తులు, ఇతర మానవతా రక్షణల కోసం రుసుములను ఈ బిల్లు పెంచుతుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. మెడికేడ్, ఇతర ప్రభుత్వ సేఫ్టీ-నెట్ కార్యక్రమాలకు కోతలు వలసదారులను, తక్కువ ఆదాయ వర్గాలను కూడా ప్రభావితం చేస్తాయి.

రుసుముల్లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేయడానికి కనీసం 100 డాలర్లు, ఉద్యోగి అనుమతి దరఖాస్తుల కోసం 550 డాలర్లు, తాత్కాలిక రక్షిత స్థితి కోసం 500 డాలర్లు, మానవతా పెరోల్ కోసం 1,000 డాలర్లు ఉన్నాయి. ప్రవేశ పోర్ట్‌ల మధ్య సరిహద్దు దాటుతున్నప్పుడు పట్టుబడిన ఎవరికైనా 5,000 డాలర్ల జరిమానా విధిస్తారు. తక్కువ ఆదాయ దరఖాస్తుదారులకు కూడా రుసుము మినహాయింపులు ఉండవు.

ఇవి తక్షణ ప్రభావాల్లో కొన్ని మాత్రమే. భారతీయులు, భారత ఆర్థిక వ్యవస్థపై మధ్య- దీర్ఘకాలిక ప్రభావాలకు సంబంధించిన అంశాలు పూర్తిగా వెలువడాల్సి ఉంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.