టీఎంసీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నేత మహువా మొయిత్రా బిజు జనతా దళ్ నేత, మాజీ ఎంపీ పినాకి మిశ్రాను జర్మనీలో సింపుల్ గా వివాహం చేసుకున్నట్లు సమాచారం. వారిద్దరు కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ జంటలో మహువా మొయిత్రా వయస్సు 50 ఏళ్లు కాగా, పినాకి మిశ్రా వయస్సు 65 సంవత్సరాలు.
టీఎంసీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నేత మహువా మొయిత్రా బిజు జనతా దళ్ (BJD) నేత, మాజీ ఎంపీ పినాకి మిశ్రాల వివాహం జర్మనీలో మే 30వ తేదీన జరిగినట్లు సమాచారం. అయితే, ఈ వివాహం గురించి ఇటు టీఎంసీ నేతలకు కానీ, అటు బీజేడీ నేతలకు కానీ సమాచారం లేదు. అలాగే, ఈ వివాహం గురించి, వారిద్దరి నుండి అధికారిక ధృవీకరణ రాకపోయినప్పటికీ, వివాహం జర్మనీలో జరిగిందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో కూడా బయటపడింది.
మహువా మొయిత్రా, పినాకి మిశ్రా.. ఇద్దరికీ ఇది రెండో వివాహమే. మహువా మొయిత్రా గతంలో డానిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రోర్సన్‌ను వివాహం చేసుకుంది. కానీ విబేధాల కారణంగా చివరికి ఈ జంట విడాకులు తీసుకున్నారు. మహువా ప్రస్తుతం పార్లమెంటు సభ్యురాలిగా రెండవసారి సేవలందిస్తున్నారు. ఆమె మొదటిసారి 2019లో పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణనగర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అక్కడ ఆమె బిజెపి అభ్యర్థి కళ్యాణ్ చౌబేను ఓడించారు. 2024 ఎన్నికల్లో ఆమె ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈసారి బిజెపి అభ్యర్థి అమృత రాయ్‌ను ఓడించారు.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయిన పినాకి మిశ్రా బిజు జనతాదళ్ నాయకుడు. గతంలో పినాకి మిశ్రా పూరీ పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. పినాకి మిశ్రా మొదట సంగీతను 1984 జనవరి 16న వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మిశ్రా తొలిసారి 1996 లో కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా గెలిచారు. ఆ తరువాత ఆయన బీజేడీలో చేరారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఆయన లా పూర్తి చేశారు.
సంబంధిత కథనం
టాపిక్