ఆలయ ఉత్సవాల్లో ఏనుగుల బీభత్సం! ముగ్గురు మృతి, 30మందికి గాయాలు..
కేరళ థ్రిస్సూర్లోని ఓ ఆలయ ఉత్సవాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టపాసుల శబ్దాలు భరించలేక.. రెండు ఏనుగులు బీభత్సం సృష్టించడంతో ముగ్గురు మరణించారు. మరో 30మందికి గాయాలయ్యాయి.

కేరళ థ్రిస్సూర్ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచసుకుంది. ఓ ఆలయ ఉత్సవాల్లో రెండు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో 30మందికి గాయాలయ్యాయి.
టపాసుల శబ్దాలు భరించలేక..
కోయిలండి కురువాంకడులోని మనకులంగర ఆలయంలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోకి ఏనుగులను తీసుకొచ్చారు. అయితే, ఏనుగులకు సమీపంలోనే బాణాసంచా పేల్చడం మొదలుపెట్టారు. టపాసుల శబ్దాలను ఆ ఏనుగులు భరించలేకపోయాయి. ఒక ఏనుగు మరో ఏనుగు మీదపడింది. ఆ ఏనుగుకు గాయమైంది. ఆ తర్వాత రెండు ఏనుగులు పరుగులు తీశాయి. ఆలయ భవనాన్ని ధ్వంసం చేశాయి.
ఏనుగుల నుంచి తప్పించుకునేందుకు ఆలయంలోని ప్రజలు అనేక విధాలుగా ప్రయత్నించారు. ఫలితంగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. కొందరు ఏనుగుల కాళ్ల కింద పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. వారు.. 65ఏళ్ల లీల, 70ఏళ్ల అమ్ముకుట్టి అమ్మ, రంజన్. ఇదే ఘటనలో మరో 30మంది గాయపడ్డారు.
కాగా ఈ ఘటనపై స్పందించిన మావటి.. ఏనుగులను అదుపు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. దాదాపు 3 గంటల తర్వాత ఆలయం వద్ద పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.
ఇక ఏనుగుల పరుగుతో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారిని వెంటనే కొజికోడ్ మెడికల్ హాస్పిటల్కి తరలించారు. వారందరు ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఏనుగులు అదుపుతప్పడానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆలయ ఉత్సవాల్లో రెండు ఏనుగుల ప్రదర్శన కోసం ఆలయ సిబ్బంది అనుమతులు తీసుకున్నారు. అయితే ఏనుగుల విషయంలో అమల్లో ఉన్న నిబంధనలను అతిక్రమించారా? లేదా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెప్పారు.
మరోవైపు ఘటనస్థలాన్ని ఫారెస్ట్ కన్సర్వేటర్ ఆర్. కీర్తి సందర్శించారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.
“ఏనుగులను దూరం, దూరంగానే పెట్టినట్టు సిబ్బంది చెబుతున్నారు. అయితే ఏనుగుల విషయంలో అశ్రద్ధ వహించారా? రూల్స్ విమర్శించారా? దర్యాప్తు చేస్తున్నాను. దోషులుగా తేలితే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సిందే,” అని కీర్తి తెలిపారు.
ఏనుగుల దాడి..
మరో ఘటనలో వయనాడలో బుధవారం రాత్రి ఓ వ్యక్తిని అడవి ఏనుగు తొక్కి చంపిందని అధికారులు తెలిపారు. మృతుడిని మేప్పాడి పంచాయతీ అట్టమల సమీపంలోని గిరిజన జనావాసానికి చెందిన బాలన్ (27)గా గుర్తించారు.
బుధవారం తెల్లవారుజామున అతని కోసం వెతికిన కుటుంబసభ్యులు ఆ ప్రాంతంలోని టీ ఎస్టేట్ సమీపంలోని మార్గంలో ఛిద్రమైన అవశేషాలను కనుగొన్నారు. ఈ ప్రాంతం గత ఏడాది జులైలో కొండచరియలు విరిగిపడి అనేక మంది మరణించిన ముండక్కై-చూరల్మాల గ్రామాలకు సమీపంలో ఉంది. కొండచరియలు విరిగిపడటం, ఈ ప్రాంతాల్లోని ప్రజలు పునరావాస శిబిరాలకు, ప్రభుత్వ నివాసాలకు వలస వెళ్లడంతో అడవి ఏనుగుల బెడద పెరిగిందని స్థానికులు అటవీశాఖకు ఫిర్యాదు చేశారు.
బాలన్ దుకాణం నుంచి సరుకులు కొనుగోలు చేసేందుకు వెళ్లాడని, ఇంటికి తిరిగి వస్తుండగా మంగళవారం రాత్రి అడవి ఏనుగు దాడి చేసి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
సంబంధిత కథనం